Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లబ్దిదారుల ఎంపికతో నిలిచిన దళిత బంధు
- నియోజకవర్గానికి 100 మంది ఎంపిక
- ప్రస్తుతం 20 యూనిట్లకు మాత్రమే నిధులు విడుదల
- ఇప్పట్లో నిధులు వచ్చేలా లేవంటున్న అధికారులు
నవతెలంగాణ- రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
దళిత బంధు పథకం ఆసరా అవుతుందని ఆశపడ్డ దళితులకు నిరాశే ఎదురవుతుంది. మొదటి విడతలో భాగంగా ప్రతి నియోజకవర్గానికి 100 మంది లబ్దిదారులను దళిత బంధుకు ప్రభుత్వం ఎంపిక చేయాలని సూచించింది. లబ్దిదారులు ఆ సంతోషాన్ని మరువక ముందే ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఎంపిక చేసిన 100 మందిలో ప్రస్తుతం 20 మందికి మాత్రమే నిధులు మంజూరు చేయడంతో మిగతా వారికి నిరాశే మిగిలింది. తొలి విడతలోనే దళితబంధుకు ఇన్నీ ఇబ్బందులు తలెత్తుతున్నాయంటే.. చివరి లబ్దిదారుడి వరకు దళితబంధు అందేనా..! అన్న అనుమానాలు దళితులను గందరగోళ పరుస్తున్నాయి. రంగారెడ్డి జిల్లాలో దళిత సామాజిక తరగతులకు చెందిన జనాభా 4.40లక్షల మంది ఉన్నారు. ప్రస్తుతం దళితబంధు మొదటి విడతలో భాగంగా నియోజవర్గానికి 100 మంది ఎంపిక చేశారు. ఈ లెక్కన జిల్లాలో 8 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందుల్లో 4 నియోజకవర్గాలు రంగారెడ్డి జిల్లా విస్తీర్ణంలో ఉండగా, మరో 4 నియోజకవర్గాలు ఇతర జిల్లాల మండలాలతో కలిసి ఉన్నాయి. దాంతో జిల్లా కోటాలో భాగంగా 697 మందిని ఎంపిక చేశారు. ఈ పథకం ద్వారా ప్రతి లబ్దిదారుడికి రూ.10 లక్షలు కేటాయించగా.. ఇందుల్లో రూ. 10 వేలు రక్షణ నిధి కింద జమ చేయగా మిగతా రూ. 9.90 లక్షలతో లబ్దిదారులు ఎంపిక చేసుకున్న యూనిట్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రణాళికలు బాగా ఉన్నప్పటికీ ఆచరణలో మాత్రం అడుగు ముందుకు పడని పరిస్థితి నెలకొంది. జిల్లాలో మొదటి విడతలో భాగంగా ఎంపిక చేసిన 697 మంది లబ్దిదారులకు రూ. 6.09 కోట్లు నిధులు అవసరం ఉన్నప్పటికీ.. ప్రస్తుతం నియోజకవర్గానికి 20 మందికి మాత్రమే నిధులు ప్రభుత్వం విడుదల చేయడంతో 20 యూనిట్లకు మాత్రమే గ్రౌడింగ్ చేసేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మొత్తంగా మొదటి విడతలో జిల్లాలో 160 మందికి మాత్రమే దళిత బంధు పథకం ఫలితాలు అందే అవకాశం ఉంది.. మరో 537 మందికి నిరాశే మిగలనుంది. ప్రస్తుతం జిల్లాలో ఇప్పటివరకు ఒక్క లబ్దిదారుడికి కూడా దళిత బంధు పథకం ద్వారా యూనిట్ అందించలేదు.
నిధులోస్తేనే యూనిట్లు
ప్రస్తుతం నియోజకవర్గానికి 20 మందికి నిధులు మంజూరు చేసినప్పటికీ స్థానికంగా ఎదురైయ్యే సమస్యల దృష్ట్యా 20 మందికి కూడా యూనిట్లను గ్రౌండింగ్ చేసేందుకు అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. జిల్లాలో 72 మంది లబ్దిదారులు డెయిరీ ఫామ్‌లకు దరఖాస్తు చేసుకోగా ప్రస్తుతం వారికి షెడ్ల నిర్మాణాల కోసం ఒక్కో లబ్దిదారునికి రూ. 1.50లక్షల చొప్పున జిల్లాలో రూ.1.08 కోట్ల నిధులు మాత్రమే లబ్దిదారుల ఖాతాలో జమ చేశారు. మిగతా డబ్బులు జూన్ తర్వాత విడుదల చేస్తామని ఎస్సీ కార్పొరేషన్ అధికారులు చెబుతున్నారు.
పెండింగ్‌లో రూ. 5 కోట్లు
మొదటి విడతలో భాగంగా జిల్లాకు రావాల్సిన నిధులు మరో రూ. 5 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఏప్రిల్ నెలలో మొదటి విడత లబ్దిదారుల యూనిట్లును పూర్తి స్థాయిలో గ్రౌడింగ్ చేస్తామన్న ప్రభుత్వం ప్రస్తుతం 20 శాతం నిధులు కూడా ఇవ్వకుండా దళిత బంధు నీరుగార్చే విధంగా వ్యవహరిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ది. దళిత బంధు పేరుతో దళితులకు అందాల్సిన ఫలితాలు ఏవీ ఇవ్వకుండా.. ఎక్కడికక్కడ నిలిపి వేసి నిర్లక్ష్యం చేస్తోందని దళితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
లబ్దిదారులందరికీ అందేలా ప్రయత్నం చేస్తాం
- ప్రవీణ్ కుమార్, రంగారెడ్డి జిల్లా ఎస్సీ కార్పొరేషన్ అధికారి
మొదటి విడతలో భాగంగా జిల్లాలో 697 మంది లబ్దిదారులను ఎంపిక చేశాం. ఇందుల్లో 72 మంది డెయిరీ ఫామ్‌లకు దరఖాస్తు చేసుకున్నారు. షెడ్ల నిర్మాణాల కోసం ఒక్కొక్కరికి రూ.1.50లక్షలు ఇవ్వడం జరిగింది.
పూర్తిగా జూన్‌లో ఇస్తాం. మిగతా లబ్దిదారులకు ఈ నెలఖారులో పూర్తి స్థాయిలో యూనిట్లను గ్రౌడింగ్ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం.
లబ్దిదారులందరికి దళిత బంధు అందజేయాలి
దళితబంధు పేరుతో దళిత సంక్షేమ నిధులకు గండికొట్టిన ప్రభుత్వం.. దళిత బంధు పథకాన్ని పారదర్శకంగా అమలు చేయాలి. లబ్దిదారులకు సకాలంలో యూనిట్లు మంజూరు చేయాలి. మొదటి విడతలో భాగంగా ఎంపిక చేసిన లబ్దిదారులందరికి ఏకకాలంలో నిధులు విడుదల చేయాలి.
- కేవీపీఎస్ జిల్లా ప్రధాన
కార్యదర్శి సామేల్