Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశ ప్రజలకు ప్రధాని క్షమాపణ చెప్పాలి
- బాదుడు ఆపకపోతే.. ప్రజల తిరస్కరణే
- ఒక్కో కుటుంబంపై లక్ష రూపాయల పెట్రోపన్ను
- పెట్రో భారాన్ని నిరసిస్తూ కేంద్ర ప్రభుత్వానికి
మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పెట్రో ధరల పెంపును అడ్డుకోవడంలో విఫలమయ్యామని దేశ ప్రజలకు ప్రధాని నరేంద్రమోడీ బహిరంగ క్షమాపణ చెప్పాలని టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షులు, రాష్ట్ర మంత్రి కె.తారకరామారావు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం పెట్రో ధరల బాదుడు ఆపకపోతే ప్రజలు తిరస్కరించడం ఖాయమని హెచ్చరించారు. మోడీ కాలం అచ్చేదిన్ కాదు ముంచేదిన్ అని విమర్శించారు. ఈ మేరకు బుధవారం కేంద్ర ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. 'ఒకవైపు నిరంతరం ధరలను పెంచుతూనే మరోవైపు ఆ పాపాన్ని రాష్ట్ర ప్రభుత్వాలపై నెట్టే ఒక కుటిల ప్రయత్నానికి కేంద్రంలోని బీజేపీ ఒడిగడుతున్నది. నిజం చెప్పులేసుకునేలోపు అబద్ధం ఊరంతా బలాదూర్‌గా తిరిగొస్తున్నది. అందుకే, కేంద్రం చేస్తున్న అసత్య ప్రచారాన్ని ప్రజల ముందు ఎండగట్టేందుకే ఈ లేఖ రాస్తున్నాను' అని తెలిపారు. సబ్కాసాథ్ సబ్ కా వికాస్ అని గప్పాలు చెప్పుకునే మోడీ పాలనలో సబ్ కా సత్తేనాశ్లా దేశం తయారైందని వాపోయారు.
దోపిడీ కూడా దేశం కోసం ధర్మం కోసమేనా?
దేశంలోని 26 కోట్ల కుటుంబాలపై రూ.26.51 లక్షల కోట్ల పెట్రో పన్ను వేసిన పనికిమాలిన ప్రభుత్వం బీజీపీనేనని కేటీఆర్ ఘాటుగా విమర్శించారు. ఒక్కో కుటుంబం నుంచి లక్ష రూపాయల పెట్రో పన్నును కేంద్రం దోచుకుందని ఆరోపించారు. ఈ దోపిడీ కూడా దేశం కోసం.. ధర్మం కోసమేనా అని ప్రశ్నించారు. ప్రజలను దోపిడీ చేయడమే లక్ష్యంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెట్రో పన్ను యోజన పథకాన్ని ప్రవేశపెట్టిందని ఎద్దేవా చేశారు. ప్రతిపక్షంలో సామాన్యులపై ఎక్కడలేని ప్రేమ ఒలకబోసిన మోడీ ప్రధాని అయ్యాక ప్రజాసంక్షేమాన్ని గాలికొదిలేశారని విమర్శించారు. 2014లో ముడిచమురు ధర రూ.105 డాలర్లు అనీ, మోడీ వచ్చాక ఒకానొక దశలో సుమారు 20 డాలర్ల దిగువకు తగ్గిందని గుర్తుచేశారు. 2014లో లీటర్ పెట్రోల్ ధర సుమారు రూ.70.51, లీటర్ డీజిల్ ధర రూ. 53.78గా ఉండేదని తెలిపారు. నేడు పెట్రోల్ రూ. 118.19 కి, డీజిల్ 104.62కు చేరిందని విమర్శించారు. 2014కు ముందుకు పెట్రోల్‌పై ఎక్సైజ్ డ్యూటీ రూ.9.48గా ఉండేదనీ, మోడీ సర్కారు దాన్ని రూ.32.98కి పెంచిందని విమర్శించారు. ప్రజల నుంచి పెద్దఎత్తున నిరసన రావడంతో దాన్ని రూ.27.90కి తగ్గించిందని తెలిపారు. ఎక్సైజ్ డ్యూటీలో 41 శాతం రాష్ట్రాలకే తిరిగి వస్తుందంటూ కేంద్రమంత్రులతో పాటు వాట్సాప్ యూనివర్సిటీ బ్యాచ్ సోషల్‌మీడియాలో చేస్తున్న ప్రచారం పచ్చి అబద్ధమని తేల్చేశారు. కరోనా సంక్షోభంలో వలస కూలీలను వేల మైళ్లు నడిపించిన దౌర్భాగ్యఘనత మోడీ సర్కారుదేనని విమర్శించారు.
పెట్రో సెస్సుపై రాష్ట్రాలకు దక్కేది గుండుసున్నానే
2014 నుంచే రాష్ట్రాలను బలహీనపరిచే కుట్రలకు మోడీ సర్కారు పూనుకున్నదని కేటీఆర్ విమర్శించారు. బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సుంకాల రూపంలో కాకుండా సెస్సుల రూపంలో పెట్రో రేట్లు పెరుగుతున్నాయని తెలిపారు. రోడ్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి పేరిట రూ.18, వ్యవసాయ, మౌలిక వసతులు అభివృద్ధి పేరిట రెండున్నర రూపాయలు, ప్రత్యేక అదనపు ఎక్సైజ్ డ్యూటీ పేరిట పదకొండు రూపాయలను వసూలు చేస్తున్నదని తెలిపారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా రూ. 30 రూపాయలకు పైగా సెస్సులను పెట్రో ధరల పేరుతో మోడీ సర్కార్ వసూలు చేస్తోందనీ, అందులో నుంచి రాష్ట్రాలకు దక్కేది గుండు సున్నానేనని వివరించారు. తెలంగాణలో 2015 నుంచి ఇప్పటిదాకా వ్యాట్టాక్స్ నయాపైసా కూడా పెంచలేదనే విషయాన్ని ప్రజలంతా గమనించాలని కోరారు.
ఎన్నికలొస్తే పెట్రోల్ రేట్లు పెరగవనే ఆలోచనలోకి ప్రజలు
'దేశంలో రాజ్యాంగబద్ధంగా ప్రతి ఐదేళ్లకోసారి ఎన్నికలు రావాలి. కానీ బీజేపీ అవకాశవాద, అసమర్థ విధానాలతో తరచూ ఎన్నికలు వస్తే పెట్రోలు ధరల పెంపు ఆగుతుందన్న ఆలోచనల్లోకి ప్రజలు వెళ్లిపోయారు' అని కేటీఆర్ పేర్కొన్నారు. ఎన్నికల సందర్భంగా కొన్ని వారాలు, నెలలు గమ్ముగా ఉండి ఫలితాలు వచ్చిన మరుక్షణం నుంచే పెట్రోభారాన్ని మోపుతున్నదని విమర్శించారు. గత 15 రోజుల్లో 13 సార్లు పెంచడం దారుణమని పేర్కొన్నారు. నాలుగు రాష్ట్రాల్లో ప్రజలు గెలిపించిన పాపానికి. మోడీ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ ఇదేనా అని ప్రశ్నించారు.
ధరల పెరుగుదలకు రష్యా, ఉక్రేయిన్ సంక్షోభాన్ని సాకుగా చూపెట్టడం దారుణమని విమర్శించారు. లోక్ సభలో పెట్రోలియం, నేచురల్ గ్యాస్ మంత్రి రామేశ్వర్ చేసిన ప్రకటన ప్రకారం రష్యా నుంచి కేవలం ఒక్క శాతం కన్నా తక్కువ క్రూడాయిల్‌ను మనం దిగుమతి చేసుకుంటున్నామని తెలిపారు. కరోనా సమయంలో పేదలకు పంపిణీ చేసిన ఆహార ధాన్యాలు, వ్యాక్క్షిన్ల ఖర్చును పెట్రోల్ ధరలతో వసూలు చేసుకుంటామని సిగ్గులేకుండా ప్రకటించడం దారుణమని విమర్శించారు. పెట్రోరేట్ల ప్రభావంతో పప్పు, ఉప్పు, ఔషధాల ధరలు కూడా భారీగా పెరిగి సామాన్యుల బతుకులు దినదినగండంగా మారాయని వాపోయారు. గ్యాస్ బండ మోయలేని గుదిబండగా మారిందనీ, చివరకు మోడీ చెప్పిన పకోడీలు అమ్ముకుని బతికే పరిస్థితి కూడా లేదని ఎద్దేవా చేశారు. పెట్రోల్ రేట్ల దెబ్బకు కార్లు, బైకులు వాడని పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. ధరల పెంపు ధర్మసంకటం అన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ మాటల్ని ప్రజలు సీరియస్‌గా పట్టించుకున్న రోజు, ధర్మ సంకటాన్ని వీడి కేంద్ర ప్రభుత్వంపై తిరగబడే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు.