Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భవిష్యత్ మహమ్మారులను ఎదుర్కొనేలా చర్యలు
- చివరి స్టేజీలో గాంధీకి రోగులు...అందుకే డెత్ రేట్ ఎక్కువ
- ప్రభుత్వాస్పత్రుల్లో డెలివరీల టార్గెట్ 75 శాతం
- ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేడుకల్లో మంత్రి హరీశ్ రావు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్ర వైద్యారోగ్యశాఖ అందిస్తున్న సేవలన్నింటిలోనూ నెంబర్‌వన్ స్థానం సాధించేదాకా తాను విశ్రాంతి తీసుకోననీ, ఎవర్నీ తీసుకోనివ్వనని ఆ శాఖ మంత్రి టి.హరీశ్ రావు తెలిపారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో జరిగిన వేడుకల్లో ఆయన పాల్గొని ఉత్తమ పనితీరు కనబరిచిన డాక్టర్లు, సిబ్బందికి అవార్డులను అందజేశారు. కోవిడ్-19ను అనుభవాల నేపథ్యంలో భవిష్యత్తులో అలాంటి మహమ్మారులు వస్తే ఎదుర్కొనేందుకు తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. గాంధీ (ప్రభుత్వ) ఆస్పత్రిలో మరణాల రేటు ఎక్కువగా ఉంటుందని చేసే ప్రచారంలో వాస్తవం లేదనీ, ఇలాంటి మరణాల్లో ఎక్కువగా చివరి దశలో ప్రయివేటులో వైద్యం చేసేందుకు నిరాకరించినవే ఉంటున్నాయని వివరించారు. రాష్ట్రంలో ప్రసవాల్లో 54 శాతం ప్రభుత్వాస్పత్రుల్లో జరుగుతున్నాయనీ, దీన్ని 70 నుంచి 75 శాతం వరకు పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నట్టు మంత్రి వెల్లడించారు.
కోవిడ్-19కు అభివృద్ధి చెందిన దేశాలే వణికిపోయిన స్థితిలో మనం సరైన నిర్వహణా సామర్థ్యాన్ని కనబరిచామని చెప్పారు. భవిష్యత్తులో డాక్టర్ల కొరత లేకుండా మెడికల్ కాలేజీలను మూడు నుంచి 33కు, బడ్జెట్లో గతేడాది వైద్యారోగ్యశాఖ నిధులు రూ.6,295 కోట్లు (2.5 శాతం) నుంచి రూ.11,440 కోట్లకు (4.5 శాతం) పెంచామని గుర్తుచేశారు. నాలుగు టిమ్స్ ఆస్పత్రులతో పాటు నిమ్స్‌లో 40 ఎకరాల్లో రెండు వేల పడకలతో విస్తరణ, వరంగల్ జిల్లాలో హెల్త్ సిటీని ఏర్పాటు చేస్తున్నామన్నారు. నిధులకు కొరత రాకుండా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టరు మొదలుకొని బోధనాస్పత్రుల సూపరింటెండెంట్ల వరకు అందరి వద్ద నిధులు ఉంచామనీ, సొంతంగా నిర్ణయాలు తీసుకుని సదుపాయాలు కల్పించాలని ఆదేశించామని మంత్రి చెప్పారు. బాగా పని చేసే వారిని తగిన రీతిలో గౌరవిస్తామనీ, చెడ్డపేరు తెచ్చే వారికి అదే స్థాయిలో చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కేంద్రం అనేక అవార్డులనిచ్చిందని మంత్రి గుర్తుచేశారు. నిటిఅయోగ్ ఆరోగ్య సూచికలో మూడో స్థానం, తల్లుల మరణాల రేటు (ఎంఎంఆర్) 92 నుంచి 56కు తగ్గించి దేశంలో మూడో స్థానంలో నిలిచామనీ, క్వాలిటీ అష్యురెన్స్లో మొదటి స్థానంలో, స్పెషల్ నియోనాటల్ కేర్ యూనిట్ (ఎస్ఎన్సీయూ)లో రెండో స్థానం, టీబీ నిర్మూలనా కార్యక్రమంలో ఐదో స్థానంతో పాటు ఆజాదీ కా అమృత్ మహౌత్సవ్‌లో రెండు అవార్డులు వచ్చాయని తెలిపారు.
ముహూర్తాల డెలివరీలు వద్దు...
సహజ ప్రసవాల శాతం పెరగాలని మంత్రి అభిప్రాయపడ్డారు. ముహూర్తాలు చూసుకుని శస్త్రచికిత్సతో ప్రసవాలు చేయించుకోవడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ, ప్రయివేటు ఆస్పత్రుల్లో సి సెక్షన్లపై ఆడిట్ నిర్వహిస్తామనీ, అవి తగ్గకపోతే డాక్టర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వాస్ప త్రుల్లో సహజ ప్రసవాలు చేస్తే ప్రోత్సాహకాలు ఇస్తామని చెప్పారు. ఎనీమియా ఎక్కువగా ఉన్న తొమ్మిది జిల్లాల్లో 1.5 లక్షల మంది గర్భిణీలకు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్‌ను అందజేస్తామని తెలిపారు.