Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముగ్గురు అరెస్ట్.. పరారీలో ఐదుగురు
- వివరాలు వెల్లడించిన సీపీ నాగరాజు
నవతెలంగాణ-కంఠేశ్వర్
నిషేధిత సీపీఐ(మావోయిస్టు) విస్తరణకు ప్రచారం చేస్తున్న మావోయిస్టుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసినట్టు నిజామాబాద్ సీపీ నాగరాజు తెలిపారు. గురువారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీసు కమిషనరేట్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీపీ వివరాలను వెల్లడించారు. సిరికొండ మండలం న్యావనంది గ్రామానికి చెందిన గొల్ల జనార్ధన్ గతంలో మావోయిస్ట్ పార్టీలో పనిచేశారు. 2001లో కామారెడ్డి జిల్లా రెడ్డిపేట ఎన్కౌంటర్లో గాయపడి అప్పటి ఎస్పీ డాక్టర్ రవిశంకర్ అయ్యనార్ ఎదుట లొంగిపోయారు. కలిగోట్ గ్రామానికి చెందిన పల్లికొండ గంగాధర్ అలియాస్ సాగర్ ప్రస్తుతం ధర్పల్లి మండలం రామడుగు గ్రామంలో నివసిస్తున్నారు. వీరిద్దరూ ఆదిలాబాద్ జిల్లా సుందరగిరికి చెందిన కొల్లూరి సాయన్న అలియాస్ అశోక్‌ను కలిశారు. ఆయన సూచనల మేరకు గొల్ల జనార్ధన్, పల్లికొండ గంగాధర్ ఇటీవల భద్రాచలం ప్రాంతంలోని చర్ల అటవీ ప్రాంతంలో మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యులు, భద్రాద్రి కొత్తగూడెం-ఈస్ట్ గోదావరి డివిజన్ కమిటీ కార్యదర్శి ఆజాద్‌ను కలిశారు. జిల్లాలో మావోయిస్టు పార్టీని విస్తృత పరచాలని ఆదేశించిన ఆజాద్ గొల్ల జనార్ధన్‌ను జిల్లా ఇంచార్జిగా నియమించి లక్ష రూపాయల నగదు, విప్లవ సాహిత్యం అందజేశారు. నెల రోజుల కిందట అరెస్టయిన ముగ్గురు నిందితులతో పాటు ములుగు జిల్లాకు చెందిన కొండ సాంబయ్య, సుందరగిరికి చెందిన కొల్లూరి సాయన్న, చింతలూరుకు చెందిన గూడెట్టి అశోక్, సిరికొండ మండలం మహిపాల్ తండాకు చెందిన గుగులోతు రాజుతో జనార్ధన్ పొలంలోని గుడిసెలో నెల రోజుల కిందట సమావేశమయ్యాడు. ఇలా ఏడాది కాలంగా మావోయిస్టు రహస్య కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు పోలీసులకు నమ్మదగిన సమాచారం అందింది. ఈ మేరకు డీసీపీ అరవింద్ బాబు, అడిషనల్ డీసీపీ డాక్టర్ వినీత్ నేతృత్వంలో ఏసీపీ వెంకటేశ్వర్లు, ధర్పల్లి సీఐ శ్రీశైలం, ఎస్ఐ వంశీ కృష్ణారెడ్డి, సిరికొండ ఎస్ఐ నరేష్, జక్రాన్‌పల్లి ఎస్ఐ శ్రీకాంత్ వారి కదలికలపై నిఘా ఉంచారు. పోలీసులు జక్రాన్‌పల్లి మండలం కొలిప్యాక గ్రామ శివారులో గొల్ల జనార్ధన్, పల్లికొండ గంగాధర్, అంకేష్ కమల్‌ను గురువారం అదుపులోకి తీసుకున్నారు. కాగా ఐదుగురు పరారీలో ఉన్నారు. ప్రస్తుతం అరెస్ట్ చేసిన ముగ్గురు నుంచి మూడు బ్యాగులు, నిషేధిత సీపీఐ(మావోయిస్టు) సాహిత్యం, పేలుడు పదార్థాలైన జిలెటిన్ స్టిక్స్ 11, డిటోనేటర్ల 10, మెమోరీ కార్డ్, పెన్‌డ్రైవ్‌లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కేసును ఛేదించడంలో కీలకపాత్ర పోషించిన పోలీస్ సిబ్బందికి సీపీ చేతుల మీదుగా రివార్డులు, ప్రశంసాపత్రాలను అందజేశారు.