Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం కేసీఆర్కు బీజేఎల్పీ నేత రాజాసింగ్ లేఖ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై మోపిన విద్యుత్ చార్జీల భారాన్ని తగ్గించాలనీ, యాసంగి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని బీజేపీ శాసన సభాపక్ష నేత రాజాసింగ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం సీఎం కేసీఆర్కు లేఖ రాశారు. విద్యుత్ ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణ ఆదర్శమని గొప్పలు చెప్పుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై రూ. 6 వేల కోట్ల భారం మోపడం దారుణమని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ దివాళాకోరుతనం, ఏడేండ్లుగా అధిక ధరలకు కరెంట్ కోనుగోలు చేసి అవినీతికి పాల్పడటం వల్లనే ప్రజలపై ఈ భారాలని తెలిపారు. రూ. 50 వేల కోట్లకుపైగా బకాయిలు చెల్లించకపోవడం వలన డిస్కంలు అప్పులు ఊబిలోకి కూరుకుపోయాయని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన మితిమీరిన అప్పులకు వడ్డీలు చెల్లించుకోవడానికే చార్జీల పెంచినట్టు కనిపిస్తోందని తెలిపారు. దొంగ కనెక్షన్ల వల్ల విద్యుత్ విషయంలో సాంకేతిక వాణిజ్య, నష్టాలు ఏటేటా పెరుగుతున్నాయని తెలిపారు. ప్రభుత్వ శాఖలకు చెందిన కరెంట్ బిల్లుల బకాయిలే రూ.12,598 కోట్లు ఉన్నాయని పేర్కొన్నారు. రారైస్ సప్లరుపై కేంద్రంతో చేసుకున్న ఒప్పందాన్ని మరుగునపరిచి కేంద్రంపై ఆరోపణలు చేయడం తగదని సూచించారు. ఐకేపీ సెంటర్ల ద్వారా ధాన్యం కొనుగోలు ప్రారంభించి కేంద్రానికి రారైస్ సప్లరు చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో సుమారు 1.81 లక్షల క్వింటాళ్ళ వడ్లు రైస్ మిల్లుల్లో మాయం అయ్యాయని ఎఫ్సీఐ తనిఖీల్లో బయటపడిందని తెలిపారు. దీనిపై విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు.