Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రోజుకు రెండు పూటలా కూలీల ఫొటోల అప్లోడ్ సరికాదు
- 333 సర్క్యూలర్‌ని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయాలి : వ్యకాస
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్ ఉపాధి హామీ చట్టానికి విరుద్ధంగా ఉందనీ, రోజుకు రెండు పూటలా కూలీల ఫొటోలు అప్లోడ్ చేయాలని రాష్ట్ర సర్కారు జారీ చేసిన సర్క్యూలర్ నెంబర్ 333ని వెంటనే రద్దు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి.నాగయ్య, ఆర్.వెంకట్రాములు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం వారు ఒక ప్రకటన విడుదల చేశారు. ట్రాన్సఫరెన్సీ, ఎకౌంటబులిటీ పేరుతో కేంద్రంలోని మోడీ సర్కారు తెచ్చిన ఎన్ఎమ్పీఎస్ గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి ఉరితాడుగా మారే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సర్క్యూలర్ పేదలకు మెరుగైన పని కల్పన కంటే కార్పొరేట్ కంపెనీల సెల్ ఫోన్లు, సిమ్ కార్డులు గ్రామీణ ప్రాంతాలకు ప్రమోట్ చేసే చర్యలాగా ఉందని విమర్శించారు.
కేంద్రానికి వత్తాసు పలుకుతూ దాని అమలుకు రాష్ట్ర ప్రభుత్వం సర్క్యూలర్ విడుదల చేయడం దారుణమని పేర్కొన్నారు. పని ప్రదేశంలో కూలీల ఫొటోలు ఉదయం 11 గంటలకు ఒకసారి, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు స్మార్ట్ ఫోన్ల ద్వారా మేట్లు అప్లోడ్ చేస్తేనే కూలీల మస్టర్ గుర్తించి వేతనాలిస్తామనటం చట్ట మౌలికాంశాన్ని తూట్లు పొడవడమేనని తెలిపారు. పని కొలతలు, పని గంటలతో నిమిత్తం లేకుండా పని చేయగలిగిన వయోజనులకు పని కల్పన, చట్ట ప్రకారం నిర్ణీత వేతనాలు చెల్లించాలనే మార్గదర్శకాలకు విరుద్ధంగా కేంద్రంలోని బీజేపీ మోడీ ప్రభుత్వం కేంద్ర పాలిత ప్రాంతాలకు, రాష్ట్ర ప్రభుత్వాలు కు అదేశాలివ్వడం ఆందోళన కలిగిస్తోందని వాపోయారు. అండ్రాయిడ్ 10 వర్షన్ ఫోన్ , 4జి, 5జి కనెక్షన్ ఉంటేనే నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్ యాఫ్ సపోర్టు చేస్తుందని సర్క్యూలర్‌లో ఉందనీ, రెక్కాడితే గానీ డొక్కాడని నిరుపేదలు ఖరీదైన ఫోన్లను ఎలా కొనుగోలు చేయగలుగుతారని ప్రశ్నించారు.
ఆదివాసీ ఏజెన్సీ ప్రాంత గిరిజనులతో పాటు వెనుకబడిన ప్రాంతాల్లోని పేదలను పనికి దూరం చేయడమే దీని సారాంశమని విమర్శించారు. ప్రతిమేట్ రోజూ 20 కూలీల ఫొటోలు అప్ లోడ్ చేయడం, ప్రతి గ్రూప్‌లో 50శాతం మహిళలు తప్పని సరిగా ఉండాలనే ఆదేశాలతో మేట్లపై పనిభారం పెరిగే ప్రమాదం ఉందని తెలిపారు. ఫోన్లు లేనివారు, రీఛార్జీ చేసుకోలేనివారు అనివార్యంగా చట్టం ద్వారా పొందే పని హక్కును కోల్పోతారని పేర్కొన్నారు.