Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వడ్లు కొంటారా? కొనరా?
- ధాన్యాన్ని కొనేదాక పోరాటం
- ఆ పార్టీల రాజకీయ క్రీడలో రైతు బలి
- రైతు జేఏసీ రౌండ్‌టేబుల్‌లో వక్తలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆడుతున్న డ్రామాలు ఆపి ధాన్యాన్ని తక్షణం కొనాలని వక్తలు డిమాండ్ చేశారు. గురువారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో 'తెలంగాణలో ధాన్యం సేకరణ-కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరులు-పరిష్కారం' అనే అంశంపై రైతు జేఏసీ ప్రధాన కార్యదర్శి ఎం శ్రీధర్ అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. బోర్లు పడకపోవటం, కరువు, గిట్టుబాటు ధరలు లేకపోవటం, వడ్డీవ్యాపారుల వత్తిడి తదితర అంశాలు రైతుల ఆత్మహత్యలకు కారణాలుగా చెప్పేవారనీ,...నేడు పండిన పంటను కొనకపోవటం, తెచ్చిన అప్పులను తీర్చలేక ఆత్మహత్యలు చేసుకునే స్థితిని ప్రభుత్వం సృష్టిస్తున్నదని విమర్శించారు. టీజేఎస్ అధ్యక్షులు కోదండరాం మాట్లాడుతూ ప్రభుత్వం ధాన్యం సేకరించనందువల్ల ప్రయివేటు వ్యాపారులు తమకు ఇష్టమైన రీతిలో ధరల్ని నిర్ణయిస్తున్నారనీ, రైతులు కూడా తక్షణం ఎదుర్కొంటున్న సమస్యలతో అగ్గువకు అమ్ముకుంటున్నారని చెప్పారు. ధాన్యం కొనుగోలు విషయంలో ఇరు ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూ కాలం గడుపుతున్నాయని తెలిపారు. ఈ లోపు రైతుల నుంచి ధాన్యం ప్రయివేటు వ్యాపారుల చేతికి పోవటం ఖాయమని వివరించారు. కేంద్రం కొనని పక్షంలో రాష్ట్ర ప్రభుత్వమే తక్షణం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఆందోళనలో ఉన్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం భరోసా ఇవ్వాలన్నారు. ఈ విషయమై సంబంధిత అధికారులకు వినతి పత్రాలు అందిస్తామని చెప్పారు. కిసాన్ కాంగ్రెస్ నాయకులు కోదండ రెడ్డి మాట్లాడుతూ కనీస మద్దతు ధరలో 23 రకాల పంటలున్నాయనీ, అందులో వరి ధాన్యం కూడా ఉందన్నారు. నాడు కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నా..ధరల స్థిరీకరణ చట్టం ఉండేదన్నారు. ఈ ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో ఎన్నడూ ఈ పరిస్థితి రాలేదని చెప్పారు. ఎఫ్‌సీఐని లాభ నష్టాలతో సంబంధం లేకుండా చూడాలని తెలిపారు. తెలంగాణ రైతు సంఘం ఉపాధ్యక్షులు పి జంగారెడ్డి మాట్లాడుతూ వ్యవసాయ రంగం రాష్ట్ర పరిధిలో ఉందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల ప్రయోజనాలను పణంగా పెట్టి రాజకీయ క్రీడను ఆడుతున్నాయని విమర్శించారు. చేతికొచ్చిన ధాన్యాన్ని ఎవరు కొంటారో తెలియక రైతు దిగాలుగా ఉన్నారని చెప్పారు. రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ మాట్లాడుతూ ఆఖరి గింజవరకు కొంటామని చెప్పిన ప్రభుత్వాలే ఇప్పుడు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నాయని చెప్పారు. ఇద్దరి మధ్య ఘర్షణలతో ఆందోళన చెందిన రైతు మిల్లర్లకు తక్కువ ధరకు అమ్ముకుంటున్నారని చెప్పారు. తెలుగు రైతు నాయకులు కసిరెడ్డి శేఖర్‌రెడ్డి, రైతు స్వరాజ్య వేదిక నాయకులు కొండల్‌రెడ్డి, ఏఐకేఎంఎస్ నాయకులు వి. కోటేశ్వర్రావు, మండల వెంకన్న, ప్రభాకర్, రణదీర్, తెలంగాణ జనసమితి ఉపాధ్యక్షులు వెంకటరెడ్డి తదితరులు మాట్లాడారు.