Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సాహిత్య అకాడమి చైర్మెన్ జూలూరి గౌరీశంకర్
నవతెలంగాణ-కల్చరల్
విస్మరణకు గురైన తెలంగాణ మాండలిక జానపద పదాలు, కావ్య భాష నుంచి సామాన్య ప్రజ నాల్కలపై నడయాడే యాసలతో కూడిన తెలంగాణ బృహత్ నిఘంటువు రూపకల్పనకు కృషి జరుగుతోందని సాహిత్య అకాడమీ చైర్మెన్ జూలూరి గౌరీశంకర్ తెలిపారు. హైదరాబాద్లోని నిజాం కళాశాల ప్రాంగణంలో కళాశాల తెలుగు శాఖ నిర్వహణలో రాష్ట్ర ఉన్నత విద్యామండలి, సాహిత్య అకాడమీ, మూసీ సాహిత్య ధార'ల సహకారంతో 'తెలంగాణ భాష- సమాలోచన' అంశంపై రెండ్రోజుల జాతీయ సదస్సు గురువారం ప్రారంభమైంది. సదస్సును ప్రారంభించిన గౌరీశంకర్ మాట్లాడుతూ.. తెలంగాణ భాషను పరిరక్షించుకొని భవిష్యత్ తరాలకు అందించేలా అకాడమీ పని చేస్తుందన్నారు. జీవ పదాలన్నింటినీ భాషా శాస్త్రవేత్తలు, 30 ఏండ్ల కిందట రవ్వ శ్రీహరి వంటి భాషా పండితులు రూపొందించిన నిఘంటువులను పరిగణనలోకి తీసుకొని భాషా సంపద గనిగా నిఘంటువును ఏడాదిలోగా అందుబాటులోకి తెస్తామన్నారు.
ఉన్నత విద్యామండలి చైర్మెన్ ప్రొఫెసర్ బి.లింబాద్రి మాట్లాడుతూ.. గతంలో తెలుగు భాషకు చిరునామా తిక్కన అనేవారని, నేడు అసలు సిసలు చిరునామా ఈ తరం వారు కావాలని ఆకాంక్షించారు. ప్రపంచ భాషలు అన్నింటిలో కలిసిపోగల సులువైన అందమైన భాష తెలుగు అన్నారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఉన్నత విద్యామండలి పాఠ్యాంశాల్లో భాషకు, తెలంగాణ సంస్కృతికి ప్రాధాన్యత ఇచ్చేలా రూపొంచారని తెలిపారు. భాష, సాహిత్య అంశాలు కూడా తెలంగాణ పోరాటానికి కారణమని గుర్తు చేశారు. నేటి సామాజిక అవసరాలకు అనుగుణంగా పాఠ్యాంశాలు రూపొందించుకోవాల్సి ఉందన్నారు. అధ్యక్షత వహించిన కళాశాల ప్రధానాచార్యులు ఆచార్య బి.నారాయణ సదస్సు ప్రాధాన్యతను వివరించారు. తెలంగాణ పద కోశ రచయిత నలిమెల భాస్కర్ మాట్లాడుతూ.. మాండలిక పద సాహిత్యాన్ని వివరించారు. ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి, సాగి కమలాకర్ శర్మ తదితరులు పాల్గొన్నారు.