Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి
నవతెలంగాణ ఆలేరుటౌన్
ప్రతి నిరుపేద కుటుంబానికి మెరుగైన వైద్యం అందేలా ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పీహెచ్సీలను బలోపేతం చేయాలని ఉమ్మడి నల్లగొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణకేంద్రంలోని పీహెచ్సీని ఆయన తనిఖీచేశారు. ఆస్పత్రిలో వైద్యం ఏవిధంగా అందుతుందని పేషెంట్లను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రి పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. వైద్యులను ఫార్మాసిస్ట్ నర్సులు, ఎక్స్రే, ల్యాబ్, ప్రసూతి సంబంధిత అంశాలపై డాక్టర్లతో చర్చించారు. అనంతరం నర్సిరెడ్డి మాట్లాడుతూ.. కరోనా సమయంలో ప్రజలకు వైద్య సిబ్బంది అందించిన సేవలను గుర్తుచేస్తూ వారిని అభినందించారు. ఆస్పత్రికి వచ్చే రోగుల సౌకర్యార్థం అన్ని రకాల మందులు, యంత్ర పరికరాలు అందుబాటులో ఉండేలా చూడాలని అక్కడున్న వైద్యులను కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం మరింత సౌకర్యాలు కల్పిస్తూ డాక్టర్లు, వైద్య సిబ్బందిని నియమించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. కరోనా వైరస్ పరిస్థితుల నుంచి ప్రజలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారని తెలిపారు. కరోనా వైరస్ సమయంలో కార్పొరేట్ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం కోసం లక్షలు లక్షలు వెచ్చించాల్సి వచ్చిందన్నారు. అనంతరం తెలంగాణ పౌర స్పందన వేదిక కరపత్రాలను విడుదల చేశారు. విద్య, వైద్యం ప్రజలకు ప్రభుత్వమే ఉచితంగా అందించాలనేదే ఈ వేదిక ముఖ్యమైన ఉద్దేశమన్నారు. కార్యక్రమంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ క్రాంతికుమార్, ఆస్పత్రి ఉప అధికారి, మేయర్ బాబా, డాక్టర్ సాయి కిరణ్, డాక్టర్ ప్రసాద్, టీఆర్టీ పీఏ జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మకంటి బాలరాజు, డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు బుగ్గ నవీన్, డీవైఎఫ్ఐ సోషల్ మీడియా కన్వీనర్ సుధగానీ రాజు, కవిడే రాజు, వైద్య సిబ్బంది ఆస్పత్రి సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.