Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చా వెంకటేశ్వర్లు
- అఖిలపక్షం ఆధ్వర్యంలో దీక్షలు
నవతెలంగాణ-భద్రాచలం
భద్రాచలం పట్టణ సమస్యల పరిష్కారానికి రాజకీయాలకు అతీతంగా ఐక్య ఉద్యమాలు నిర్వహించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చా వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. ఏపీలో విలీనమయిన ఐదు పంచాయతీలను భద్రాచలంలో కలపాలని, భద్రాచలం పట్టణ సమస్యలు పరిష్కరించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలోని అంబేద్కర్ సెంటర్లో అఖిలపక్షం ఆధ్వర్యంలో గురువారం చేపట్టిన రిలే నిరాహార దీక్షలను టీఎన్జీఓఎస్ నాయకులు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఒక్క కలంపోటుతో భద్రాచలంను ముక్కలు చెక్కలు చేసిందని విమర్శించారు. విభజనలో తీవ్రంగా నష్టపోయిన భద్రాచలాన్ని కాపాడాల్సిన బాధ్యత కేంద్రంపైనే ఉన్నదని అన్నారు. భద్రాచలం ఆనుకొని ఉన్న ఐదు పంచాయతీలను తిరిగి భద్రాచలంలో కలపడం ద్వారా బీజేపీ ప్రభుత్వం చేసిన తప్పిదాన్ని సరిచేసుకోవాలని సూచించారు. పోలవరం ముంపు భద్రాచలంకు పొంచి ఉన్నందున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.100 కోట్లతో భద్రాచలం అభివృద్ధికి తగిన చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం టీడీపీ మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గ ఇన్చార్జి కొడాలి శ్రీనివాస్, మహాజన సోషలిస్టు పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు అలవాల రాజా, టీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అరికెల తిరుపతి రావు మాట్లాడుతూ.. శ్రీరామనవమికి వచ్చే కేంద్ర, రాష్ట్ర ప్రజా ప్రతినిధులు భద్రాచలం పట్టణ సమస్యల పరిష్కారానికి నిర్ధిష్టమైన ప్రకటన చేయాలని కోరారు.
కాగా, ఈ రిలే నిరాహార దీక్షలకు టీఎన్జీఓఎస్, పలు స్వచ్ఛంద సంస్థలు, పట్టణ ప్రముఖులు, జర్నలిస్టు సంఘాలు మద్దతు తెలిపాయి. పట్టణ ప్రముఖులు పాకాల దుర్గాప్రసాద్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సభ్యులు డాక్టర్ పవన్ కుమార్, డాక్టర్ సుదర్శన్ రావు, బార్ అసోసియేషన్ అధ్యక్షులు జయరాజ్, స్కూల్ అసోసియేషన్ బాధ్యులు ముని కేశవ్, హౌటల్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు కృష్ణారెడ్డి, కల్కి వాసు, వైఎస్ఆర్టీపీ జిల్లా నాయకులు సత్యనారాయణ, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు కె బ్రహ్మచారి, టీఎన్జీఓఎస్ జిల్లా నాయకులు వల్లభనేని చందు తదితరులు పాల్గొని తమ సంఘీభావం తెలిపారు. ఈ దీక్షలో అఖిలపక్ష పార్టీల నాయకులు పాల్గొన్నారు. దీక్షలను సీపీఐ(ఎం) పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు ఎర్రంశెట్టి వెంకటరామారావు కోఆర్డినేషన్ చేశారు.