Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అడవుల నిర్వహణ, పచ్చదనం పెంపు, పరిశోధనలపై దృష్టి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సమర్ధవంతంగా అడవుల నిర్వహణ, పరిశోధనలు, పచ్చదనం పెంపు విషయంలో రాష్ట్ర అటవీ శాఖ, ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీ మధ్య అవగాహనా ఒప్పందం కుదిరింది. పర్యావరణ మార్పులను ఎదుర్కోవటం, భౌగోళిక పరిస్థితులకు తగినట్టుగా అడవుల నిర్వహణ కార్యక్రమాలు ఈ ఒప్పందంలో ప్రధాన భాగం కానున్నాయి. హైదరాబాద్‌లోని అటవీ శాఖ ప్రధాన కార్యాలయం అరణ్య భవన్లో జరిగిన కార్యక్రమంలో ఐఎఫ్బీ డైరెక్టర్ డాక్టర్ రత్నాకర్ జౌహరి, పీసీసీఎఫ్, హెచ్ఓఎఫ్ఎఫ్ ఆర్.ఎం. డోబ్రియాల్ ఒప్పందం పత్రాలపై సంతకాలు చేశారు. పరస్పర సహకారంతో అటవీ పరిశోధన, అభివృద్ది కార్యక్రమాలను నిర్వహించటం, కేంద్ర అడవులు, పర్యావరణ శాఖ నేతత్వంలో పనిచేసే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ సహకారం తీసుకోవటం, పనుల ప్రాధామ్యాలను గుర్తించి ఉమ్మడి బృందం ఏర్పాటు ద్వారా పర్యవేక్షణ, ఆధునిక నర్సరీల ఏర్పాటు, నాణ్యమైన విత్తనాల వృద్ది, నాటిన మొక్కలు ఎదిగేందుకు అవసరమైన మెటీరియల్, శాంపిల్ ప్లాట్స్ ఏర్పాటు చేయటం ద్వారా నిరంతరం పరిశోధనలు, క్షేత్ర స్థాయి సిబ్బందిలో వృత్తి నైపుణ్యం పెంపు, పరిశోధనల్లో పాల్గొనేలా ప్రోత్సహించటం తదితర అంశాలపై ఈ ఒప్పందం కుదిరింది. ఈ కార్యక్రమంలో పీసీసీఎఫ్ (కంపా) లోకేష్ జైస్వాల్, పీసీసీఫ్ (అడ్మిన్) స్వర్గం శ్రీనివాస్, అదనపు పీసీసీఎఫ్‌లు ఎంసీ పర్గెయిన్, వినరు కుమార్, ఏకే సిన్హా, ఏసీఎఫ్ రామమూర్తి, ఐఎఫ్బీ తరపున వెంకట్, డాక్టర్ దీపా, డాక్టర్ పట్నాయక్, పంకజ్ సింగ్, భారతి, తదితరులు పాల్గొన్నారు.