Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గంజాయి, హాష్ ఆయిల్ తరలింపు
- నలుగురిని అరెస్టు చేసిన ఎస్వోటీ పోలీసులు
- వివరాలు వెల్లడించిన రాచకొండ సీపీ మహేశ్ భగవత్
నవతెలంగాణ- నేరెడ్మెట్
వైజాగ్ నుంచి ఢిల్లీకి గంజాయి, హాష్ ఆయిల్‌ను తరలిస్తున్న నలుగురిని ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు గురువారం హైదరాబాద్ మౌలాలీ రైల్వే స్టేషన్లో అరెస్టు చేశారు. గురువారం రాచకొండ కమిషనర్ మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు.
కాలేజి స్టూడెంట్స్ లాగా బ్యాగులతో ప్రయాణిస్తున్న యూపీకి చెందిన ముఠాను గుర్తించిన ఎల్బీనగర్ ఎస్వోటీ పోలీసులు వారిని పట్టుకున్నారు. ముఠాలోని నలుగురు సభ్యులు ఈనెల 5న దువ్వాడ రైల్వే స్టేషన్లో రైల్ ఎక్కి మౌలాలిలో దిగారు. వారు వైజాగ్ నుంచి హైదరాబాద్ మీదుగా ఢిల్లీకి వెళ్తున్నారు. నిందితుల్లో ఒకరైన రాజస్థాన్‌కు చెందిన విజరు ప్రస్తుతం వైజాగ్‌లో సెటిల్ అయ్యాడు. ఢిల్లీకి చెందిన ఇమ్రాన్‌తో కలిసి ఓ ముఠాను వైజాగ్ ఏజెన్సీ ఏరియాకు పంపి గంజాయి తెప్పిస్తున్నాడు. ఇమ్రాన్ కేజీ గంజాయి రూ.2500 నుంచి రూ.3000కు కొని విజరుతో కలిసి కస్టమర్లకు రూ.18 వేల నుంచి రూ.20 వేల వరకు అమ్ముతున్నారు. హాష్ ఆయిల్ లీటరు రూ.70 వేలకు కొని, రూ.2 లక్షలకు అమ్ముతున్నారు.
వైజాగ్ ఏజెన్సీలో గంజాయి కొనుగోలు చేసి నలుగురు నిందితులు దువ్వాడ రైల్వే స్టేషన్లో ఎక్కారు. వారి టికెట్ సికింద్రాబాద్ వరకు ఉన్నా అక్కడ చెకింగ్ ఎక్కువగా ఉంటుందని మౌలాలి రైల్వేస్టేషన్లోనే దిగారు. సమాచారం అందుకున్న ఎస్వోటీ పోలీసులు అక్కడికి వెళ్లి సోదాలు చేయగా ఆరు బ్యాగుల గంజాయి దొరికింది. మొత్తం గంజాయి 26 ప్యాకెట్లలో 2 కిలోల చొప్పున ఉంది. మొత్తం 52 కిలోల గంజాయి, లీటరు హాష్ ఆయిల్ 25 బాటిల్స్ (40 ఎమ్ఎల్), రూ.750, నాలుగు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి, హాష్ ఆయిల్ విలువ రూ.12,80,750 ఉంటుంది. ఫయ్యుమ్, జునైద్, సారిక్, నజీమ్‌ను అదుపులోకి తీసుకున్నారు.
ఇమ్రాన్ని పట్టుకోవడానికి టీమ్స్‌ను ఢిల్లీకి పంపిస్తున్నామని సీపీ తెలిపారు. నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించినందుకు ఎల్బీనగర్ ఎస్ఓటీ టీమ్‌కి క్యాష్ అవార్డు ఇచ్చారు. రాచకొండ అడిషనల్ కమిషనర్ జి.సుధీర్‌బాబు ఆధ్వర్యంలో జరిగిన ఆపరేషన్ టీమ్‌లోని ఎల్బీనగర్ ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ బి.అంజిరెడ్డి, సబ్ ఇన్స్పెక్టర్ కె.ప్రతాప్ రెడ్డి, మిగతా సభ్యులకు అభినందనలు తెలిపారు.