Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మోడీ ప్రభుత్వం రైతులను వంచించింది
- నూకలు తినమన్న పార్టీ తోకలు కత్తిరించాలి
- బీజేపీని తరిమి కొట్టడం ఖాయం
- ధరలు పెంపుపై చీమకుట్టినట్టు లేదు : మంత్రులు
- ధాన్యం కొనుగోళ్ల కోసం టీఆర్ఎస్ నిరసన దీక్షలు
నవతెలంగాణ - మొఫసిల్ యంత్రాంగం
టీఆర్ఎస్ వడ్ల పోరు ఉధృతం చేసింది. కేంద్రం మెడలు వంచైనా ధాన్యాన్ని కొనుగోలు చేయిస్తామంటూ రాష్ట్ర వ్యాప్తంగా గురువారం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు రోడ్డెక్కారు. కలెక్టరేట్ల ఎదుట నిరసన దీక్ష చేపట్టారు. మోడీ ప్రభుత్వం వంచించిందని, నూకలు తీనమని చెబుతున్న బీజేపీకి తోకలు కత్తిరించి సాగనంపుతామని హెచ్చరించారు. పచ్చబడి పాడిపంటలు పండుతున్న తెలంగాణపై పగబట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్రోలు, డీజిల్, గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలను విపరీతంగా పెంచుకుంటూపోతోందని, ఆ పార్టీ నాయకులకు చీమకుట్టినట్టు కూడా లేదని విమర్శించారు.
కరీంనగర్ జిల్లాలో మంత్రి గంగుల కమలాకర్, సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్, జగిత్యాల జిల్లాలో మంత్రి కొప్పుల ఆధ్వర్యంలో రైతుదీక్ష చేపట్టారు. కేంద్రం ఎఫ్‌సీఐని నిర్వీర్యం చేసే కుట్ర చేస్తోందన్నారు. సిలిండర్ ధరను వెయ్యి చేసి ప్రజలకు మళ్లీ కట్టెలపొయ్యి దిక్కు చేస్తోందని మంత్రి కేటీఆర్ విమర్శించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరు రైతులను మోసం చేశారన్నారు. అందరూ వరి వేయాలని, తానే స్వయంగా కేంద్రంతో ధాన్యం కొనిపిస్తానని మాట్లాడి ఇప్పుడు జారుకుంటూ రాజకీయం చేస్తున్నారని అన్నారు. మోడీ ప్రభుత్వం రైతులను వంచించిందని, తెలంగాణ ప్రజలకు నూకలు తినడం అలవాటు చేయాలంటూ కేంద్ర మంత్రి గోయల్ నోరుపారేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నూకలు తినాలన్న పార్టీ తోకలు కత్తించి ఇంటికి పంపుతామని హెచ్చరించారు. కరీంనగర్ కలెక్టరేట్లో దున్నపోతుపై కేంద్ర ప్రభుత్వం అని రాసి ప్రదర్శించారు.
నాడు తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడి సాధించుకున్నామని..నేడు తెలంగాణ రైతులకోసం మళ్లీ రోడ్డెక్కామని మంత్రి హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం వద్ద నిరసనదీక్షలో ఆయన మాట్లాడారు. మోడీ సర్కారు లాభనష్టాలు బేరీజు వేసుకుని ప్రయివేట్ లిమిటెడ్ కంపెనీలాగా పనిచేస్తున్నదని విమర్శించారు. పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయని, మోడీ అంటే మోదుడు.. బీజేపీ అంటే బాదుడు అని విమర్శించారు.
వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఎన్టీఆర్ చౌరస్తా వద్ద టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు మెతుకు ఆనంద్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. పోరాటాల ద్వారానే తెలంగాణ సాధించుకున్నామని, అదే తరహాలో ఉద్యమాలు చేసి కేంద్రం ధాన్యం కొనేవరకు పోరాడుతామని తెలిపారు.
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ ఆధ్వర్యంలో ఎంపీ, ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్పర్సన్లు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కేంద్రం వడ్లు కొనే వరకు బీజేపీని వదలబోమన్నారు.
వనపర్తి జిల్లా కేంద్రంలో ఆర్డీఓ కార్యాలయం ఎదుట వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. పచ్చబడ్డ తెలంగాణపై కేంద్రం పగబట్టిందని, అందుకే వరి కొనుగోలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రైతుల విషయంలో రాజకీయాలు పక్కన పెట్టి ధాన్యం కొనుగోలు కోసం కలిసి అందరం కొట్లాడుదామని రోడ్లు, భవనాలు, గృహనిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో 'నిరసన దీక్ష'లో ఆయన పాల్గొన్నారు.
ఖమ్మం జిల్లా కలెక్టరేట్ ఎదుట నిరసన దీక్షలోరవాణా శాఖ మంత్రి పువ్వాడ అజరు కుమార్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ తాత మధు పాల్గొన్నారు. వడ్ల కంకులను మెడలో వేసుకొని నిరసన తెలిపారు.
తెలంగాణలో పండించిన వరి ధాన్యాన్ని కేంద్రం భేషరతుగా కొనుగోలు చేయాలని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి డిమాండ్ చేశారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.
సంగారెడ్డి జిల్లా సమీకృత కార్యాలయం ఎదుట నిరసన దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మెన్ ఎర్రోల్ల శ్రీనివాస్ పాల్గొన్నారు.
నల్లగొండ జిల్లా కేంద్రంలో చేపట్టిన నిరసన దీక్షలో విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, హోంమంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్మెన్ బండా నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ కోటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.