Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రిజర్వేషన్ల పెంపునకు ప్రత్యేక అసెంబ్లీ తీర్మానం చేయాలి
- డా.ఆర్ఎస్.ప్రవీణ్ కుమార్
- గిరిజన రిజర్వేషన్ పోరాట సమితి నిరాహార దీక్షకు మద్దతు
నవతెలంగాణ-మిర్యాలగూడ
కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వాలు గిరిజనుల రిజర్వేషన్ల పెంపునకు పూర్తిగా వ్యతిరేకమని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ముఖ్య సమన్వయకర్త డా.ఆర్ఎస్.ప్రవీణ్ కుమార్ అన్నారు. శుక్రవారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ ఆర్డీవో కార్యాలయం ఎదుట గిరిజన రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రిలే నిరాహార దీక్షకు ఆయన మద్దతు పలికారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ..తెలంగాణ అసెంబ్లీలో 10శాతం గిరిజన రిజర్వేషన్ బిల్లుతో పాటు, 12శాతం ముస్లిం రిజర్వేషన్ల పెంపును జోడించడంతో సమస్య తలెత్తిందని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు గిరిజనులపై చిత్తశుద్ధి ఉంటే గిరిజనులు, ముస్లిము ల రిజర్వేషన్ల పెంపు బిల్లులను వేర్వేరుగా తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని డిమాండ్ చేశారు.ముస్లిముల రిజర్వేషన్ పెంపు బిల్లుపై సుప్రీంకోర్టులో కేసు విచారణ జరుగుతున్న నేపథ్యంలో రిజర్వేషన్ల పెంపు అడ్డంకిగా మారిందని అన్నారు.రాష్ట్ర వ్యాప్తంగా అడ్డా కూలీల బతుకులు అత్యంత దయనీయంగా ఉన్నాయన్నారు. బూతులు మాట్లాడే కార్మిక మంత్రి మల్లారెడ్డికి కార్మికుల కష్టాలు పట్టవని విమర్శించారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌కు వేల ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్న ప్రభుత్వం రైతులకు నష్టపరిహారం చెల్లించడంలో పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు. దున్నపోతుల గండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ శంకుస్థాపన చేసి ఏండ్లు గడుస్తున్నా నిధులు కేటాయించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని చెప్పారు. తక్షణమే ఐకెపీ కేంద్రాలను ప్రారంభించి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.