Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్ఎఫ్ఐ వరంగల్ జిల్లా 35వ మహాసభలు
నవతెలంగాణ-ఖిలావరంగల్
విద్యారంగ పరిరక్షణ కోసం విద్యార్థులు పోరాటంలోకి రావాలని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. శుక్రవారం వరంగల్ జిల్లాలోని ఖిలావరంగల్ ఏకశిలానగర్ పరిధి మల్లుస్వరాజ్యం నగర్ లక్ష్మీనారాయణ ప్రాంగణంలో ఎస్ఎఫ్ఐ వరంగల్ జిల్లా 35వ మహాసభలు జరిగాయి. ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి యార ప్రశాంత్ అధ్యక్షతన నిర్వహించిన ఈ మహాసభ ప్రారంభసభలో నర్సిరెడ్డి పాల్గొని మాట్లాడారు. పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్స్, స్కాలర్షిప్లు రాష్ట్రప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని కోరారు. యూనివర్సిటీల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. మోడీ ప్రభుత్వం కార్పొరేట్ వర్గాల మేలు కోసం రెడ్‌కార్పెట్ పరుస్తోందన్నారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎల్ మూర్తి మాట్లాడుతూ.. మహానీయుల స్ఫూర్తితో విద్యారంగాన్ని కాపాడుకుందామని పిలుపునిచ్చారు. విద్య ప్రయివేటీకరణ, కాషాయీకరణకు వ్యతిరేకంగా ఎస్ఎఫ్ఐ చేసే పోరాటాల్లో విద్యార్థులు కలిసి రావాలన్నారు. విశ్వ విద్యాలయాల విద్యార్థులకు స్కాలర్షిప్స్, కాస్మోటిక్ ఛార్జీలు, ఫీజు రీయింబర్స్మెంట్ తక్షణమే విడుదల చేయాలని కోరారు. విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే ప్రజాప్రతినిధులను ఎన్నుకునేందుకు విద్యార్థులు కృషి చేయాలన్నారు. మహాసభల్లో ఉమ్మడి జిల్లా మాజీ కార్యదర్శి సీహెచ్ రంగయ్య, సీఐటీయూ నాయకులు ముక్కెర రామస్వామి, ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి దుర్గయ్య, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.