Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
హైదరాబాద్ నగరంలోని నిజాం కాలం నాటి ఉస్మానియా ఆస్పత్రి భవనాలను తమ అనుమతి లేకుండా కూల్చరాదని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. భవనాలు పటిష్టంగా ఉన్నాయో లేవో తేల్చే నిమిత్తం ప్రభుత్వం ఈఎన్సీ, జీహెచ్ఎంసీ సిటీ ప్లానర్లతో ఏర్పాటు చేసిన కమిటీలో ఐఐటీ డైరెక్టర్ లేదా ఆయన ప్రతినిధి, ఆర్కీయాలజీ సర్వే ఆఫ్ ఇండియా శాఖాధిపతి లేదా ఆయన ప్రతినిధులకు కూడా చోటు కల్పించాలని ఆదేశాలు జారీ చేసింది. కమిటీ నివేదిక నిమిత్తం విచారణను జులై 22కి వాయిదా వేస్తున్నట్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్‌చంద్రశర్మ, న్యాయమూర్తి జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలి ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆస్పత్రి భవనాలు కూల్చాలనీ, కూల్చవద్దని వేరువేరుగా దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాల తరఫున ప్రభుత్వ న్యాయవాది వాదిస్తూ, ఇప్పటికే రాష్ట్రం కమిటీని ఏర్పాటు చేసిందన్నారు. గత నెలలో కమిటీ ఆస్పత్రిని పరిశీలన చేసిందని, భవనాల పటిష్టతపై అధ్యయనం చేయాల్సివుందని చెప్పారు. ఈ కమిటీకి వరంగల్ ఐఐటీ, హైదరాబాద్ జేఎన్టీయూ నిపుణులు కూడా సహకరిస్తారని తెలిపారు. దీంతో మరో ఇద్దరికి కూడా కమిటీలో చోటు కల్పించాలని ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
10న శోభాయాత్రకు అనుమతి
రామనవమి సందర్భంగా ఈనెల 10న హైదరాబాద్, బైంసా పట్టణంలో శోభాయాత్ర నిర్వహించేందుకు హైకోర్టు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. పోలీసులు ఈ నెల 7న జారీ చేసిన గైడ్‌లైన్స్ మేరకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట మధ్యలో శోభాయత్రా చేయాలని చెప్పింది. అనుమతి లేని ప్రాంతాల్లో నిర్వహించరాదని స్పష్టం చేసింది. రెండు ప్రాంతాల్లో శోభాయత్రాకు అనుమతి ఇవ్వలేదని దాఖలైన రిట్లపై విచారణకు తెర దించుతున్నట్లు న్యాయమూర్తి జస్టిస్ లలిత ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, భద్రాచలంలో ఈ నెల 10న జరిగే రామనవమి కల్యాణ కార్యక్రమంలో గత ఆచారాలను అమలు చేసేలా ఉత్తర్వులు ఇవ్వాలని హైదరాబాదీ వెంకటరమణ వేసిన రిట్‌ను శుక్రవారం జస్టిస్ అభిషేక్‌రెడ్డి విచారించారు. స్వామి కల్యాణంలో శ్రీరామచంద్ర ప్రభూ అనే విధానాన్ని వదిలేసి శ్రీరామ నారాయణ అంటున్నారనీ, గతంలో మాదిరిగా అనేలా ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషనర్ కోరారు. ప్రతివాదుల వాదనల తర్వాతే ఉత్తర్వుల విషయాన్ని పరిశీలిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది.
విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది.