Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పట్టుబడ్డ డిప్యూటీ తహసీల్దార్, సీనియర్ అసిస్టెంట్
- రూ. 3.50 లక్షల లంచం సొమ్ము స్వాధీనం
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) వలకు భారీ ఎత్తున లంచం తీసుకుంటూ అవినీతి తిమింగళాలు పట్టుబడ్డాయి. రూ. 3.50 లక్షలు డిమాండ్ చేసి తీసుకున్న డిప్యూటీ తహసీల్దార్ సహా మరో సీనియర్ అసిస్టెంట్‌ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ డీజీ అంజనీ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. నారాయణ్‌పేట్ జిల్లా మరికెల్ మండలంలో తన తండ్రికి చెందిన పట్టా పాసు పుస్తకంలో తాను కోరిన వివరాలు చేర్చాలంటూ హైదరాబాద్‌కు చెందిన సంధ్యారాణి మరికెల్ మండల తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నది. ఇందుకు రూ. 3.50 లక్షలు సీనియర్ అసిస్టెంట్ తాహిర్ అహ్మద్ ద్వారా డిప్యూటీ తహసీల్దార్ జగన్ ముదావత్ డిమాండ్ చేశారు. ఈ డబ్బులను తమ కార్యాలయంలో తీసుకుంటుండగా దాడి చేసిన ఏసీబీ అధికారులు మొదట తాహిర్ అహ్మద్‌ను పట్టుకున్నారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్‌ను అరెస్టు చేశారు. వీరి నుంచి లంచం సొమ్మును రూ. 3.50 లక్షలను స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు అరెస్టు చేసిన ఇద్దరు నిందితులను హైదరాబాద్ ఏసీబీ కేసుల ప్రత్యేక కోర్టులో హాజరు పరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. రెవెన్యూ శాఖలో అవినీతి అధికారులకు సంబంధించిన సమాచారాన్ని తమకు అందజేసి సహకరించాలని ఏసీబీ డీజీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.