Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెట్టింపైన బడ్జెట్‌కు తగిన ఫలితాలు రాబట్టేందుకు యత్నం
- జవాబుదారీతనం, పారదర్శకత కోసం చర్యలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ప్రక్షాళనపై రాష్ట్ర సర్కారు దృష్టి సారించింది. కోవిడ్-19 మహమ్మారి నేర్పిన గుణపాఠాల నేపథ్యంలో భవిష్యత్తులో ప్రజారోగ్య వ్యవస్థ బలోపేతం చేసే దిశగా ప్రయత్నాలు మొదలెట్టింది. గత కొంత కాలంగా రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు విభాగాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రతి నెలా ఒక క్రమపద్ధతిలో సమీక్షలుండేలా హెల్త్ క్యాలెండర్‌ను రూపొందించారు. ప్రతి నెలా మూడో తేదీన ఆశావర్కర్లు, ఐదున అన్ని జిల్లాల డీఎంహెచ్ఓలు, పీహెచ్ సీల ఇన్ ఛార్జీలు, ఏడున వైద్యవిధాన పరిషత్ కమిషనర్, ఆస్పత్రుల సూపరింటెండెంట్లు, తొమ్మిదిన డీఎంఈ పరిధిలోని ఆస్పత్రుల సూపరింటెండెంట్లతో సమీక్షించేందుకు ఆ శాఖ ప్రత్యేకంగా జూమ్ యాప్‌ను రూపొందించింది.
రాష్ట్రంలో ఆయూష్ సేవలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకునేందుకు కసరత్తు మొదల ెట్టారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఆధునిక వైద్యంతోపాటు ఆయూష్ సేవలను కూడా ప్రవేశపెడితే ఆయూష్ వైద్యులకు పనితో పాటు రోగులకు ఇష్టమైన వైద్యం ఎంచుకునే ఆప్షన్ ఇచ్చినట్టవుతుందని భావిస్తున్నారు. అదే సమయం లో అధికారులు, డాక్టర్లు, సిబ్బంది సమయపాలన పాటించేలా నిఘా వ్యవస్థను పెంచాలని భావిస్తు న్నది. ఇందుకోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సీసీ కెమెరాల వ్యవస్థను ఏర్పాటు చేసి దాన్ని ఉన్నతాధికారుల పర్యవేక్షణ పరిధిలోకి తేనున్నారు.
ఆస్పత్రుల డెవలప్మెంట్ ఫండ్ ఖర్చు పెట్టుకునే అధికారాన్ని ఆయా ఆస్పత్రుల సూపరింటెండెంట్లకే కట్టబెట్టింది. ప్రభుత్వ డాక్టర్లు ప్రయివేటు ప్రాక్టీస్ చేయడం ప్రజారోగ్య వ్యవస్థకు ప్రధాన ఆటంకంగా ఉన్నట్టు గుర్తించింది. దీన్ని నివారించేందుకు భవిష్యత్ నియామకాల్లో ప్రయివేటు ప్రాక్టీసు చేయబోమని హామి ఇచ్చే వారికే అవకాశం ఇచ్చేలా సంబంధిత సర్వీస్ రూల్స్ లో సవరణ తీసుకురావాలని యోచిస్తున్నది. బోధనాస్పత్రుల పాలనా బాధ్యతల్లో ఉన్న సీనియర్ డాక్టర్లను వైద్యసేవలకు ఉపయోగించుకుంటూ నాన్ మెడికల్ ప్రొఫెషన్ అధికారులను పాలనకు ఉపయోగించుకునే అంశాన్ని పరిశీలిస్తున్నది. ప్రభుత్వాస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద ఆపరేషన్లు తక్కువగా కావడానికి ఉన్న ఇబ్బందులను తొలగించే దిశగా చర్యలు మొదలెట్టింది. ప్రభుత్వాస్పత్రుల్లో చికిత్సతో పాటు అన్ని మందులు రోగులు అందేలా వ్యవస్థను రూపొందించనున్నారు.
డాక్టర్లు ఎక్కువ....రోగులు తక్కువ
కొన్ని ఆస్పత్రులకు వచ్చే రోగుల సంఖ్య తక్కువగా ఉంటున్న డాక్టర్లు ఎక్కువగా ఉంటున్నట్టు గుర్తించింది. ఉదాహరణకు మలక్‌పేట, వనస్థలిపురం ఏరియా ఆస్పత్రుల్లో వచ్చే రోగులకు అవసరమైన దాని కంటే సిబ్బంది ఎక్కువగా ఉంటున్నట్టు గుర్తించారు. ఇలాంటి వారిని రోగుల రద్దీ ఎక్కువగా ఉన్న చోట ఉపయోగించుకోవాలని యోచిస్తున్నది.
సిజేరియన్ ఆపరేషన్లపై సీరియస్
పలు కొలమానాల్లో రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంచి గుర్తింపు పొందినప్పటికీ, కొన్నింటి విషయంలో పనితీరు అధ్వానంగా ఉన్నట్టు విమర్శలు వస్తున్నాయి. అలాంటి వాటిలో సిజేరియన్ ఆపరేషన్ల విషయంలో దక్షిణాది రాష్ట్రాలైన కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 20 నుంచి 30 శాతముండగా, మన రాష్ట్రంలో అది కాస్తా 64 శాతంగా ఉండటం వెనుకబాటుతనానికి నిదర్శనం. దీంతో ఈ పరిస్థితిని మార్చేందుకు ఇప్పటికే ప్రభుత్వాస్పత్రుల్లో సిజేరియన్ ఆపరేషన్లు చేస్తున్న సిబ్బందికి ఇస్తున్న ప్రోత్సాహకాన్ని నిలిపేసి సహజ ప్రసవాలకు ఇవ్వాలని నిర్ణయించింది. ముఖ్యంగా కొన్ని ప్రయివేటు ఆస్పత్రులు అధిక డబ్బులకు ఆశపడి సిజేరియన్ ఆపరేషన్లు చేస్తున్నాయని గుర్తించి వాటిని కట్టడి చేసేందుకు చర్యలు మొదలెట్టింది. అదే విధంగా నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ నిర్వహించిన సర్వేలో రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ మిగిలిన రాష్ట్రాల కన్నా చాలా వెనుకబడింది. ఇలా సేవలందించడంలో విఫలమవుతున్న వాటిని గుర్తించి వాటిని సరి చేయడం ద్వారా ప్రక్షాళన చేయాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ భావిస్తున్నది.