Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భద్రాద్రిలో నేడు ఎదుర్కోలు
- రేపు సీతారాముల కల్యాణం
నవతెలంగాణ-భద్రాచలం
శ్రీరామనవమి దగ్గర పడటంతో భద్రాచలంలోని సీతారామచంద్రస్వామి ఆలయంలో పండుగ వాతావరణం సంతరించుకుంది. ఆదివారం శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని మిథిలా స్టేడియంలోని శిల్పకళాశోభితమైన కల్యాణ మండపంలో అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. భద్రాచలంలో శనివారం రాత్రి వైకుంఠ ద్వారం వద్ద శ్రీ సీతారామచంద్రస్వామి ఎదుర్కోలు ఉత్సవం సంప్రదాయబద్ధంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, దేవదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్ స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. సీతారామ కల్యాణ మహోత్సవం పురస్కరించుకుని భద్రాచలంలో చేపట్టిన పనులు తుది దశకు చేరుకున్నాయి. ఈ క్రమంలో రామాలయంకు విద్యుత్ దీప అలంకరణలు, చలువ పందిళ్లు, చాందినీ వస్త్రాలంకరణలు, శ్రీరామ ధ్వజాలు ఏర్పాటు చేయటంతో భద్రాద్రి పుణ్యక్షేత్రంలో సందర్శకుల సందడి నెలకొంది. అలాగే స్వామివారి కల్యాణం అనంతరం ముత్యాల తలంబ్రాల పంపిణీ, లడ్డూ ప్రసాదాల విక్రయాలకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. అలాగే సందర్శకుల రద్దీ అధికంగా ఉండటాన్ని అంచనా వేసిన అధికారులు మూడు లక్షలకు పైగా లడ్డూ ప్రసాదాలను సిద్ధం చేశారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు చెందిన సందర్శకులు అధిక శాతం మంది ఈసారి పాదయాత్ర ద్వారా భద్రాద్రికి చేరుకుంటున్నారు. అదే విధంగా వివిధ ప్రాంతాల నుంచి వాహనాల ద్వారా రామయ్య కల్యాణాన్ని తిలకించేందుకూ సందర్శకులు భారీగా తరలివస్తున్నారు. సామాన్య సందర్శకుల కోసం 3లక్షల చదరపు అడుగుల్లో చలువ పందిళ్ళ షామియానాలను భద్రాచలంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. అదేవిధంగా తాగునీటి సౌకర్యం, ప్రత్యేక మరుగుదొడ్డను సైతం సిద్ధం చేసినట్టు అధికారులు తెలిపారు. భద్రాచలం శ్రీరామ నవమికి వచ్చే భక్తుల కోసం తెలుగు రాష్ట్రాల్లోని ఆర్టీసీ మూడు రోజుల్లో 500 పైగా బస్సులను ప్రత్యేకంగా నడుపుతోంది. 10వ తేదీన జరిగే శ్రీరామనవమిని పురస్కరించుకొని సీఎం కేసీఆర్, శ్రీరామ మహా పట్టాభిషేకాన్ని పురస్కరించుకొని 11వ తేదీన గవర్నర్ తమిళపై దంపతులు రాకను పురస్కరించుకొని భద్రాచలం పట్టణం పోలీసుల భారీ బందోబస్తు మధ్య ఉంది. భద్రాచలంలో అన్ని ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అలాగే రామాలయ పరిసరాలు, గోదావరి నదీ తీరంలోనూ సందర్శకులపై పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు. ఎస్పీ సునీల్ దత్, ఏఎస్పీ రోహిత రాజ్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది, బందోబస్తు నిర్వహించనున్నారు.