Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అడ్డుకున్న స్థానికులు
నవతెలంగాణ-కొండపాక
'రోజూ కూలీకి వెళ్తే తప్పా పూట గడవని పరిస్థితి. ఉండటానికి గూడు కూడా లేదు. డబుల్ బెడ్ రూం కేటాయించాలని అడిగితే ఇవ్వడం లేదు' అంటూ ఓ మహిళ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఒంటిపై డీజిల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకుంది. గమనించిన స్థానికులు నీళ్లు పోసి ఆమెను అడ్డుకున్నారు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా కొండపాక మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట శుక్రవారం జరిగింది. ఉమ్మడి వెలికట్ట గ్రామపంచాయతీగా ఉన్న సమయంలో విశ్వనాథపల్లిలో ప్రభుత్వం 50 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించింది. అయితే, వెలికట్ట నుంచి రవీంద్రనగర్, విశ్వనాథపల్లి గ్రామాలు వేరు పడి కొత్త గ్రామపంచాయతీగా ఏర్పడ్డాయి. కాగా, అక్కడ నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో విశ్వనాథపల్లి గ్రామానికి చెందిన పలువురికి కేటాయించక ముందే ఉగాది రోజు గృహ ప్రవేశాలు చేశారు. రవీంద్రనగర్ గ్రామానికి చెందిన వారు వెళితే వెళ్లగొట్టారు. దాంతో రవీందర్‌నగర్‌కు చెందిన పలువురు నిరుపేదలు తహసీల్దార్ కార్యాలయం ఎదుట బైటాయించి శుక్రవారం ధర్నా చేశారు. తమ గ్రామస్తులకు కూడా ఇండ్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో వాసరి సుదోష వెంట తెచ్చుకున్న డీజిల్ ఒంటిపై పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. రెండుసార్లు జాబితాలో తన పేరు ఉందని.. మూడోసారి పేరు తీసేశారని ఆవేదన వ్యక్తం చేసింది. తనకు ఇల్లు కేటాయించాలని కోరింది. అక్కడున్న వారు గమనించి ఆమెపై నీళ్లు పోసి అడ్డుకున్నారు. అనంతరం రవీంద్రనగర్ గ్రామస్తులంతా సర్పంచ్ వాసరి లింగారావు ఆధ్వర్యంలో తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. అక్రమంగా ఇండ్లల్లోకి ప్రవేశించిన వారిని బయటకు పంపించాలని, అర్హులైన వారిని గుర్తించి ఇండ్లు కేటాయించాలని డిమాండ్ చేశారు.