Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్మికుల ఆర్థిక ప్రయోజనాలపై దెబ్బ
- ఇప్పటికే మూసివేత దిశలో సీసీఎస్
- ఈపీఎస్ రద్దుపైనా యాజమాన్యం సమాలోచనలు
- ఆందోళనలో ఆర్టీసీ కార్మికులు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) అనగానే దానికింద 'సామాజిక బాధ్యత' అనే ట్యాగ్‌లైన్ ఉండేది. క్రమేణా ఇప్పుడు ఆ ట్యాగ్‌లైన్‌ను చెరిపేసి, పక్కా 'వ్యాపార, వాణిజ్య సంస్థ' అనే ముద్ర వేసుకుంటున్నది. ఇప్పటికే ఆర్టీసీకి అనుబంధంగా ఉన్న అనేక యూనిట్లు మూతపడ్డాయి. సంస్థలో కొత్తగా ఎలాంటి రిక్రూట్మెంట్లు లేవు. పైపెచ్చు స్వచ్ఛంద ఉద్యోగ విమరణ (వీఆర్ఎస్)ను అమల్లోకి తెస్తారనే ప్రచారం జరుగుతున్నది. దీనికోసం రాష్ట్రంలోని అన్ని డిపోల్లో అనధికారికంగా రిజిస్టర్లు పెట్టి కార్మికులతో సంతకాలు కూడా పెట్టించుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆర్టీసీ కార్మికులు తమ జీతాల సొమ్ము ద్వారా ఏర్పాటు చేసుకున్న కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ (సీసీఎస్) కూడా దాదాపు మూసివేత దిశగా అడుగులు వేస్తున్నట్టు కార్మిక సంఘాలు చెప్తున్నాయి. తాజాగా... రిటైర్మెంట్ తర్వాత ఎలాంటి పెన్షన్ సౌకర్యం లేని ఆర్టీసీ కార్మికులకు, కాస్తో కూస్తో ఆర్థిక చేయూతనిచ్చే స్టాప్ రిటైర్మెంట్ బెనిఫిట్ స్కీం (ఎస్ఆర్బీఎస్)ను కూడా ఎత్తేసే ఆలోచనలో ఆర్టీసీ యాజమాన్యం ఉన్నట్టు తెలుస్తున్నది. దీనిపై ఇప్పటికే అనేక రకాల ప్రచారాలు జరుగుతున్నాయి. యాజమాన్యం వాటికి వివరణ ఇచ్చే కనీస ప్రయత్నం కూడా చేయట్లేదు. ఫలితంగా కార్మికుల్లో తమ భవిష్యత్‌పై ఆందోళన వ్యక్తమవుతున్నది. సంస్థ మనుగడ, అభివృద్ధి కోసం దాదాపు 30-35 ఏండ్లు కష్టించి పనిచేస్తూ, సర్వీస్ చేస్తే... ఒంట్లో సత్తువ సన్నగిల్లి, రిటైర్మెంట్ అయ్యాక మీ బతుకులతో మాకేం సంబంధం అన్నట్టే యాజమాన్యం వ్యవహరిస్తుండటాన్ని కార్మికులు తప్పుపడుతున్నారు. కార్పొరేట్ సోషల్ రెస్సాన్సిబిలిటీ (సీఎస్ఆర్) పేరుతో పలు సంస్థల నుంచి నిధులు తెస్తున్న యాజమాన్యం...కార్మికుల పట్ల సామాజిక బాధ్యతను విస్మరిస్తున్నదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉమ్మడి రాష్ట్ర ఆర్టీసీలో 1989లో కార్మికుల జీతాల్లోంచి నెలకు రూ.40 కట్ చేస్తూ, యాజమాన్య మ్యాచింగ్ గ్రాంటును కలుపుతూ రిటైర్ అయిన వారికి ఆర్థిక ప్రయోజనం చేకూర్చేందుకు ఎస్ఆర్బీఎస్ను ప్రారంభించారు. ఆ తర్వాత ఆ మొత్తం పెరుగుతూ వచ్చి ప్రస్తుతం కార్మికుల జీతంలోంచి నెలకు రూ.250 కట్ అవుతుంది. వారి సర్వీసును బట్టి రిటైర్మెంట్ తర్వాత నెలకు రూ.720 నుంచి రూ.3,200 వరకు క్యాస్ బెనిఫిట్ (ఎమ్‌సీబీ) ఇస్తారు. ఆర్టీసీలో ప్రతి వేతన ఒప్పందం సమయంలోనూ దీనిపై యాజమాన్యం ఇచ్చే మ్యాచింగ్ గ్రాంట్‌ను ప్రకటిస్తుంది. చివరగా 2013 సంవత్సరానికి సంబంధించిన వేతన సవరణ 2015లో జరిగింది. అప్పట్లో ఎస్ఆర్బీఎస్కు 6.5 శాతం మ్యాచింగ్ గ్రాంటును ప్రకటించారు. కాన్నీ ఇప్పటి వరకు ఒక్క రూపాయి విడుదల చేయలేదు. 2011 తర్వాతి నుంచి ఈ స్కీంకు యాజమాన్య మ్యాచింగ్ గ్రాంట్‌ను ఇవ్వట్లేదని కార్మిక సంఘాలు చెప్తున్నాయి. ఆర్టీసీలో ఈ స్కీం ద్వారా ప్రస్తుతం 26,900 మంది రిటైర్డ్ కార్మికులు లబ్ది పొందుతున్నారు. 2022 నుంచి ఏటా దాదాపు రెండువేల మంది రిటైర్ అవుతారు. వారందరికీ ఎస్ఆర్బీఎస్ ద్వారా ఆర్థిక లబ్ది చేకూర్చాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఆర్టీసీకి ఉన్న ఆదాయ వనరుల దృష్ట్యా రిటైర్ కార్మికుల సామాజిక బాధ్యతగా ఉన్న ఈ స్కీంను వదిలించుకోవడమే ఉత్తమమనే అభిప్రాయాన్ని అధికారులు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ వద్ద వ్యక్తంచేసినట్టు సమాచారం. దీనిపై ఆయన కూడా సానుకూలంగా స్పందించినట్టు సంస్థలో ప్రచారం జరుగుతున్నది. 2015లో జరిగిన వేతన ఒప్పందంలో ఎస్ఆర్బీఎస్లో కార్మికుల వాటా సొమ్మును రూ.250 నుంచి రూ.500కు పెంచి, కనీస ఆర్థిక ప్రయోజన మొత్తాన్ని రూ.5వేలకు పెంచాలని ప్రతిపాదించారు. దీనిపై అప్పటి ఆర్టీసీ యాజమాన్యం, గుర్తింపు కార్మిక సంఘాల నేతలు సంతకాలు చేశారు. ఈ స్కీంను ఎట్టి పరిస్థితుల్లోనూ నిలుపుదల చేయరాదని 1989 అనుబంధ బైలాస్‌లో పేర్కొన్నారు. కార్మిక సంఘాల లెక్కల ప్రకారం ప్రస్తుతం ఈ స్కీం రూ.12 కోట్ల మిగులుతో ఉంది. అయినా కొత్త రిక్రూట్మెంట్లు లేనందున, భవిష్యత్‌లో రిటైర్మెంట్లు అధికం అవుతున్నాయి కాబట్టి ఈ స్కీంను ఇప్పుడే వదిలించుకుంటే బాగుంటుందనే యాజమాన్యం భావిస్తున్నట్టు తెలుస్తున్నది. ప్రస్తుతం టీఎస్ఆర్టీసీలో 48వేల మంది ఉద్యోగులు ఉన్నారు. వచ్చే ఐదేండ్లలో పదివేల మందికి పైగా రిటైర్ అవుతారని అంచనా. ఇవే కారణాలు చెప్తూ ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్)లో అంతర్భాగంగా ఉన్న ఎంప్లాయీ పెన్షన్ స్కీం (ఈపీఎస్)ను కూడా రద్దు చేసే యోచనలో యాజమాన్యం ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది. ఈ ఏడాది నుంచి రిటైర్ అయ్యే ఆర్టీసీ కార్మికులకు ఈపీఎస్ ద్వారా సర్వీసును బట్టి నెలకు రూ.3,600 వరకు పెన్షన్ వస్తుంది. ఆర్టీసీని పూర్తిగా వ్యాపార, వాణిజ్య సంస్థగా మార్చడంపైనే యాజమాన్యం దృష్టి పెట్టినట్టు స్పష్టమవుతుంది. ఇప్పటికే తమకు రావాల్సిన రెండు ఫిట్మెంట్లు, ఆరు డిఏలు, ఇతర ఆర్థిక ప్రయోజనాలు అందక భవిష్యత్‌పై బిక్కుబిక్కుమంటూ బతుకుతున్న ఆర్టీసీ కార్మికులకు యాజమాన్యం భరోసా కల్పించాల్సిన అవసరం ఉంది.
కార్మికులపై సామాజిక భద్రతా దాడి
12న డిమాండ్స్ డే-టీఎస్ఆర్టీసీ జేఏసీ
ఆర్టీసీ కార్మికుల సామాజిక భద్రతపై జరుగుతున్న యాజమాన్య దాడిని తక్షణం నిలిపేయాలని టీఎస్ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ డిమాండ్ చేసింది. వీఆర్ఎస్, ఎస్ఆర్బీఎస్ రద్దు, ఈపీఎస్ రద్దు అనుమానాలను తక్షణం నివృత్తి చేయాలని జేఏసీ నేతలు కోరారు. కార్మిక సమస్యల పరిష్కారం, పెండింగ్ డిమాండ్ల సాధన కోసం ఈనెల 12న డిమాండ్స్ డే నిర్వహిస్తున్నట్టు జేఏసీ కన్వీనర్ వీఎస్ రావు ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 5న జరిగిన జేఏసీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామన్నారు. ఆరోజు కార్మికులు ఎర్రబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరుకావాలని పిలుపునిచ్చారు.