Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గ్రామీణాభివృద్ధి కోసం పనిచేసేందుకు ఒప్పందం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
గ్రామీణాభివృద్ధి, ప్రజల అభ్యున్నతి కోసం కలిసి పనిచేసేందుకు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, పంచాయతీరాజ్ (ఎన్ఐఆర్డీపీఆర్)తో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవ సాయ విశ్వవిద్యాలయం మధ్య అవగాహనా ఒప్పందం కుదిరింది. శుక్రవారం హైదరాబాద్‌లో పీజేటీఎస్ఏయూ ఉపకులపతి వి.ప్రవీణ్‌రావు సమక్షంలో ఎన్ఐఆర్డీపీఆర్ డైరెక్టర్ డాక్టర్ జి.నరేంద్రకుమార్, వ్యవసాయ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ సుధీర్‌కుమార్ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా నరేంద్రకుమార్ మాట్లాడుతూ.. జాతీయస్థాయిలో పేరుపొందిన పీజేటీఎస్‌ఏయూతో కలిసి పనిచేయడం శుభపరిణామమని అన్నారు. తాము ఇప్పటికే ఐసీఏఆర్, తదితర సంస్థలతో ఒప్పందాలు కుదర్చుకుని గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నామని చెప్పారు. గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ శాఖలు సంయుక్తంగా పనిచేస్తేనే ఆశించిన లక్ష్యాలను వేగంగా చేరుకోగలమన్నారు. ప్రవీణ్‌రావు మాట్లాడుతూ..రెండు సంస్థల మధ్య అనేక అంశాల్లో సారూప్యత ఉందని అభిప్రాయపడ్డారు. తమ వర్సిటీ రూపొందించిన వంగడాలు తెలంగాణ లోనే కాక ఆరేడు రాష్ట్రాల రైతుల ఆదరణ పొందాయని వివరించారు. సహజ వనరుల యాజమాన్యం అనేది నేడు ప్రధాన అంశంగా మారిందన్నారు. వ్యవసాయం డిజిటలీ కరణవైపు అడుగులు వేస్తోందనీ, ఇప్పటికే బిగ్‌డేటా, డ్రోన్ల వంటి నూతన టెక్నాలజీలు అందుబాటులోకి వచ్చాయని వివరించారు. ఐసీఏఎస్ డిప్యూటీ జనరల్ డైరెక్టర్ శశి భూషన్, ప్రొఫెసర్లు జీవీరాజు, జి.రవీంద్ర, నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్-ఆర్సీ డైరెక్టర్ డాక్టర్ రాధికారాణి, ఉన్నతాధికారులు డాక్టర్ సూర్జిత్ విక్రమన్, డాక్టర్ కె.కృష్ణారెడ్డి, డాక్టర్ వీజీ నిత్య, తదితరులు పాల్గొన్నారు.