Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శాంతిభద్రతపై సమీక్షించి, చర్యలు తీసుకోవచ్చు
- కుటుంబ సమస్య నుంచి తప్పించుకునేందుకే...
- గవర్నర్‌ను కేసీఆర్ సాకుగా చూపిస్తున్నారు
- తనను సీఎం చేయాలని కేటీఆర్ ఒత్తిడి
- వైద్యం కోసం ఢిల్లీ వెళ్లారంటే, ఇక్కడ పడకేసినట్టేనా? : ఇష్టాగోష్టిలో రేవంత్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర పునర్విభజన చట్టంలోని సెక్షన్ 8 ప్రకారం గవర్నర్‌కు గ్రేటర్ హైదరాబాద్‌పై పూర్తి అధికారాలున్నాయని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి చెప్పారు. విద్య, వైద్యం, శాంతిభద్రతలపై సమీక్షించి, తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. సమస్యలు పరిష్కరించే అధికారం కూడా ఉందని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ తన కుటుంబ సమస్యల నుంచి తప్పించుకునేందుకే గవర్నర్‌ను సాకుగా చూపిస్తున్నారని విమర్శించారు. తనను సీఎం చేయాలంటూ సీఎం కేసీఆర్‌పై కుమారుడు కేటీఆర్ ఒత్తిడి చేస్తున్నారన్నారు. గవర్నర్‌తో సఖ్యత లేనప్పుడు అది సాధ్యం కాదని కుటుంబ సభ్యులతో సీఎం చెబుతున్నట్టు తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో విలేకర్లతో ఆయన ఇష్టాగోష్టిగా మాట్లాడారు. 'రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో ఖాళీలున్నాయని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అధికారికంగా నివేదిక ఇచ్చారు. వెంటనే రాజ్యాంగం కల్పించిన అధికారాలను ఆమె ఉపయోగించుకోవాలి. విద్య, వైద్యం, శాంతి భద్రతల సమస్యలపై సమీక్ష చేసి చర్యలు చేపట్టవచ్చు. రాష్ట్రంలోని సమస్యలను గవర్నర్ గుర్తించారు. ఫిర్యాదు చేశారు. సెక్షన్ 8 ప్రకారం సమస్యను పరిష్కరించే అధికారం గవర్నర్‌కు ఉంది. రాష్ట్ర విభజన చట్టం ద్వారా ఏ రాష్ట్ర గవర్నర్‌కు లేని అధికారాలు తెలంగాణ గవర్నర్‌కు ఉన్నాయి. ఆమె బీజేపీ నేతలా మాట్లాడుతున్నారని టీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారు. గతంలో బీజేపీ నేతలుగా ఉండి రాష్ట్రపతిగా రామ్నాథ్కోవింద్, ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు ఎన్నికల్లో పోటీ చేస్తే వారికి ఓటు వేసేటప్పుడు తెలియదా? వారు బీజేపీ నేతలని అంటూ సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించారు. కేసీఆర్‌కు కోపం వస్తుందనే హైదరాబాద్‌లో ఉండి కూడా కేంద్ర మంత్రి జి కిషన్‌రెడ్డి, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరు రాజ్‌భవన్‌లో జరిగిన ఉగాది వేడుకలకు హాజరు కాలేదన్నారు. ఈ విషయాలను ప్రధాని మోడీ, అమిత్‌షాకు గవర్నర్ ఫిర్యాదు చేయాల్సిందనీ, అప్పుడే బీజేపీ, టీఆర్ఎస్ కుమ్మక్కు రాజకీయాలు బహిర్గతమయ్యేవని చెప్పారు.
బీజేపీతో జాతీయ మీడియా కుమ్మక్కు
అందుకే ప్రజల సమస్యలను ప్రచారం చేయట్లే : ఏఐసీసీ అధికార ప్రతినిధి పవన్ ఖేరా
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో జాతీయ ప్రధాన మీడియా కుమ్మక్కైయిందని ఏఐసీసీ అధికార ప్రతినిధి పవన్ ఖేరా విమర్శించారు. అందుకే ప్రజా సమస్యలు చర్చకు రావడం లేదనీ, వాటి గురించి ప్రచారం చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాంతీయ మీడియా ప్రజా సమస్యలను ప్రచారం చేస్తున్నదని ప్రశంసించారు. శుక్రవారం గాంధీభవన్‌లో రేవంత్, షబ్బీర్ అలీ, అంజన్‌కుమార్‌యాదవ్, మాజీ మంత్రి గడ్డం ప్రసాద్‌కుమార్, ఈరవర్తి అనిల్‌కుమార్‌తో కలిసి ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ గెలిచిందనీ, ఆ తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయని అన్నారు. రైతుల సమస్యలపై రేవంత్ పార్లమెంట్‌లోనూ, బయట పోరాడుతున్నారని చెప్పారు. రైతుల జీవితాలతో కేంద్రం చెలగాటమాడుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎరువులు, వ్యవసాయ పరికరాల, నిత్యావసరాల, మందుల ధరలతోపాటు టోల్ ట్యాక్స్ ధరలు పెంచిందని విమర్శించారు. తెలంగాణలో విద్యుత్ చార్జీలు, ఇంటిరుణాలు, మధ్యతరగతి ఇష్టపడే కార్ల ధరలు పెంచిందని తెలిపారు. కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు కోదండరెడ్డి మాట్లాడుతూ మంత్రి కేటిఆర్ అమెరికా పర్యటనలో రహస్య ఎజెండా ఉందన్నారు. రూ 8వేల కోట్ల పెట్టుబ డులకు ఎంవోయూ కుదుర్చుకున్నట్టు, కేటీఆర్ ఎక్కడా బహిరంగంగా చెప్పలేదన్నారు. అవి పూర్తిగా వాళ్ల పెట్టుబడులా? ప్రభుత్వ పెట్టుబడులుం టాయా? అని ప్రశ్నించారు.ఇప్పుడు అమెరికా కెమికల్ కంపెనీలను తీసుకొచ్చి మరింత విషాన్ని వెదజల్లుతారా? ఇప్పటికే ఫార్మా కంపెనీల వల్ల వచ్చే కాలుష్యాన్ని సర్కారు నియంత్రణ చేయడం లేదని విమర్శించారు.
స్పృహతప్పి పడిపోయిన సునీతారావు
కాంగ్రెస్ పార్టీ గురువారం చేపట్టిన విద్యుత్ సౌధ ముట్టడి సందర్భంగా నాయకులు, కార్యకర్తల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును నిరసిస్తూ...డీజీపీని కలిసేందుకు గాంధీభవన్ నుంచి ప్రదర్శనగా బయలుదేరిన మహిళా కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు, నేతలకు మధ్య తోపులాట జరిగింది. నేపథ్యంలో మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు సునీతారావు స్పృహతప్పిపడిపోయారు. ఆమెను హుటాహుటిన పోలీసులు ఆస్పత్రికి తరలించారు.