Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏప్రిల్ 9 వచ్చే..కొత్త పింఛన్రాలే...
- అన్ని అర్హతలున్నా నోచుకోనోళ్లు 3.15 లక్షల మంది
- ఒక్కొక్కరు నష్టపోయింది సుమారు రూ.80 వేలపైనే
- వికలాంగులు కోల్పోయింది రూ.1.20 లక్షపైనే
- 57 ఏండ్లపైబడిన వారిని కలిపితే ఆశావాహుల సంఖ్య 11 లక్షలకుపైనే
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
'ఇగొస్తరు..అగొస్తరు..పది రోజుల్లో పడ్తరు...ఫస్ట్ నుంచి వస్తరు...ఆగినోల్లు ఆగిరు..జరాగండి..ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచే అందరికీ ఇస్తం...' సీఎం, మంత్రుల నుంచి అధికారుల దాకా అందరి నోటా ఇదే మాట. స్త్రీనిధి వార్షికోత్సవంలోనూ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావూ ఈ నెల నుంచే ఇస్తామని చెప్పారు. దీంతో ఆశావాహులంతా సంబురపడ్డారు. ఏప్రిల్ వచ్చిందిగానీ కొత్త పింఛన్ మాత్రం రాలేదు. క్షేత్రస్థాయిలోని పరిస్థితులను, సర్కారు తీరును చూస్తుంటే ఆ హామీలు, మాటలు మరోమారు నీటిమీది రాతల్లాగే మిగిలేటట్టు ఉంది. మార్చి మొదటి వారంలో ఇవ్వాల్సిన పింఛన్లను రాష్ట్ర సర్కారు నెలాఖర్లో ఇచ్చింది. దీనినిబట్టే కొత్త పింఛన్ల మంజూరు మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తున్నది. 'ఏప్రిల్ వచ్చింది..ఇగనైనా పడ్తయా బిడ్డా మా పింఛన్లు. రెండేండ్ల నుంచి ఆశగా ఎదురుచూస్తున్నం' అంటూ ఆశావాహులు సర్పంచ్‌లు, ఎంపీటీసీల చుట్టూ తిరుగుతున్నరు. వాళ్లేమో ఏం చెప్పాలో అర్థం కాక 'వొస్తరు.. వొస్తరు..జర ఆగండి' అంటూ షరామామూలుగానే సమాధానమిచ్చి దాటవేస్తున్న పరిస్థితి. రాష్ట్రంలో 65 ఏండ్లు దాటినవారు, వికలాంగులు, వితంతువులు, ఇతర అర్హత కలినవారు సెర్ప్ అధికారుల లెక్కల ప్రకారమే 3.15 లక్షల మందికిపైగా దరఖాస్తు చేసుకుని పింఛన్ల కోసం ఎదురుచూస్తున్నారు. వీరంతా సొంతపనులు చేసుకోనివారు, ఇతరులపై ఆధారపడి జీవిస్తున్నవారే. వారిలో 1,59,452 మంది వితంతువులున్నారు. వికలాంగులు 55,619 మంది. వీరంతా పింఛన్‌కు అర్హులని రాష్ట్ర సర్కారు కూడా తేల్చింది. దేనితోనూ సంబంధం లేకుండా వీరికి పింఛన్ వర్తింపజేయాలి. కానీ, రాష్ట్ర సర్కారు 2018 ముందస్తు ఎన్నికల తర్వాత నుంచి నాన్చుతూనే ఉన్నది. 2018 ఆగస్టులో పించన్ లబ్దిదారుల సంఖ్య 39.42 లక్షల మంది ఉంటే ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి ఆ సంఖ్య 36.42 లక్షలకు తగ్గిపోయింది. అంటే రాష్ట్రంలో ఇస్తున్న పింఛన్ల సంఖ్య దాదాపు మూడు లక్షల వరకు తగ్గింది. ఆ స్థానంలో 65 ఏండ్లు దాటినవారినీ, వితంతువులు, వికలాంగులు, తదితర అర్హతలున్నవారిని చేర్చితే వారికన్నా న్యాయం జరిగేది. అదీ చేయలేదు. 65 ఏండ్లు దాటిన వృద్ధులు పింఛన్ అందక గడిచిన 40 నెలల్లో ఒక్కొక్కరు సగటున 80 వేల దాకా నష్టపోయారు. అదే వికలాంగులైతే 1,20,000 దాకా కోల్పోయారు. సెర్ప్ గణాంకాల ప్రకారమే రాష్ట్ర సర్కారు పింఛన్లు ఇవ్వడంలో తాత్సారం చేస్తూ ప్రతినెలా 16.77 కోట్ల రూపాయలను మిగిల్చుకుంటున్నదని తేలింది.
2018 ఎన్నికల మ్యానిఫెస్టోలో పేజీ నెం.12, పాయింట్ నెం.2లో ఆసరా పింఛన్ల వయోపరిమితిని 65 నుంచి 57 ఏండ్లకు తగ్గిస్తామని ఎన్నికల మానిఫెస్టోలో టీఆర్ఎస్ పొందుపర్చింది. ఆ ప్రకటనతో అర్హులైన దాదాపు 11 లక్షల మంది కొత్తగా పింఛన్ల కోసం దరఖాస్తు పెట్టుకుని ఏండ్ల పడాంతరం ఎదురుచూస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం (ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి) కొత్త పింఛన్లు ఇస్తామని ఆర్భాటపు ప్రకటనలు చేసిన ప్రభుత్వం అందుకు తగ్గ కసరత్తు ప్రారంభించకపోవడం శోచనీయం. మార్గదర్శకాలనూ విడుదల చేయలేదు. దీంతో అధికారపార్టీ నాయకులు, అధికారుల చుట్టూ ఆశావాహులు చెప్పులరిగేలా తిరుగుతున్నారు.
న్యాయపోరాటానికెళ్తాం...: కొండల్‌రెడ్డి
ఆసరా పింఛన్ల సాధన కమిటీ నేత, రైతు స్వరాజ్య వేదిక కన్వీనర్
త్వరలోనే ఇస్తాం..ఈ ఆర్థిక సంవత్సరం నుంచే ఇస్తాం..అంటే సర్కారుపై గౌరవంతో ఓపికగా ఎదురుచూశాం. ఈసారీ కేసీఆర్ ప్రభుత్వం మాటతప్పింది. మూడున్నరేండ్లుగా ఇదే తంతు. ధనిక రాష్ట్రమే కదా? ఇవ్వలేరా? నాలుగేండ్ల కాలంలో తగ్గిన పింఛన్లు మూడు లక్షలకుపైనే. వాటిస్థానంలో కొత్తవారికి ఇవ్వొచ్చుగదా? ఆ పని సర్కారు ఎందుకు చేయట్లేదు? ఇంకో పది రోజులు ఎదురుచూస్తాం. అయినా, కొత్త పింఛన్లు ఇవ్వకపోతే న్యాయపోరాటానికి సిద్ధమవుతాం.