Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 20 రోజుల్లో మరోసారి ఆర్టీసీ టిక్కెట్ రేట్లు పెంపు
- పల్లెవెలుగు, ఆర్డినరీ బస్సుల్లో రెండ్రూపాయల భారం
- ఇతర సర్వీసుల్లో రూ.5...
- బస్సు ప్రయాణం మరింత భారం
- ప్రజలు సహకరించాలి: చైర్మెన్, ఎమ్డీ విజ్ఞప్తి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఆర్టీసీ బస్సు టిక్కెట్ రేట్లు 20 రోజలు వ్యవధిలో మరోసారి పెరిగాయి. కొత్తగా డీజిల్ సెస్ పేరుతో ప్రయాణీకులపై ఆర్థిక భారాన్ని మోపారు. పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ బస్సుల్లో ఒక్కో ప్రయాణీకుని నుంచీ రెండు రూపాయలు డీజిల్ సెస్‌గా వసూలు చేస్తారు. ఎక్స్‌ప్రెస్, డీలక్స్, సూపర్‌లగ్జరీ, సిటీ మెట్రో ఎక్స్‌ప్రెస్, మెట్రోడీలక్స్, ఏసీ సర్వీసుల్లో ఒక్కో ప్రయాణీకుని నుంచి రూ.5 డీజిల్ సెస్‌గా వసూలు చేస్తారు. శనివారం నుంచి ఈ కొత్త సెస్ ఆర్టీసీ బస్సుల్లో అమల్లోకి వస్తుంది. ఈనెల 18న టిక్కెట్‌కు సరిపడా చిల్లర సమస్య వస్తున్నందనే కారణాన్ని చూపి 'హేతుబద్ధీకరణ' (రేషనలైజేషన్) పేరుతో టిక్కెట్ ధరను రూ.5, రూ.10 విలువల్లోకి (డినామినేషన్) మార్చిన విషయం తెలిసిందే. దానితోపాటే 'సేఫ్టీ సెస్' పేరుతో ప్రతి ప్రయాణీకుని నుంచీ ఒక్క రూపాయి అదనంగా చార్జీ విధించి, వసూలు చేస్తున్నారు. టోల్ చార్జీలను కూడా పెంచారు. తాజాగా డీజిల్ సెస్ పేరుతో చార్జీలను మరోసారి పెంచేశారు. మొత్తంగా 20 రోజుల వ్యవధిలో పల్లెవెలుగు, ఆర్డినరీ బస్సుల్లో రూ.6, ఇతర సర్వీసుల్లో రూ.8 నుంచి రూ.10 వరకు టిక్కెట్ చార్జీ పెరిగింది. టిక్కెట్ మూలధరను పెంచకుండా సెస్‌ల పేరుతో చార్జీలను సవరించడం గమనార్హం, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కూడా పెట్రోల్, డీజిల్‌పై సెస్‌ల పేరుతోనే దోపిడీకి పాల్పడుతున్న విషయం తెలిసిందే. టీఎస్ఆర్టీసీ యాజమాన్యం కూడా అదే తోవలో ప్రయాణిస్తూ, సెస్‌ల పేరుతో ప్రయాణీకుల్ని బాదేస్తున్నది.
తప్పలే...
తప్పనిసరి పరిస్థితుల్లోనే చార్జీలు పెంచాల్సి వచ్చిందనీ, ప్రజలు సహకరించాలని టీఎస్ఆర్టీసీ చైర్మెన్ బాజిరెడ్డి గోవర్థన్, మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ విజ్ఞప్తి చేశారు. పెరుగుతున్న డీజిల్ ధరలు సంస్థకు గుదిబండగా మారాయనీ, అంతర్గత సామర్థ్యం మెరుగవుతున్నప్పటికీ రోజు వారీ ఖర్చులు పెరిగిపోతుండటంతో నష్టాల్ని చవిచూడాల్సి వస్తోందంటూ వారు చెప్పుకొచ్చారు. ప్రయాణీకులను గమ్యస్థానాలను చేర్చేందుకు టీఎస్ఆర్టీసీ రోజుకు ఆరు లక్షల లీటర్ల డీజిల్‌ను వినియోగిస్తున్నట్టు వారు తెలిపారు. ఇటీవలి కాలంలో చమురు ధరలు అసాధారణ రీతిలో పెరిగాయనీ, 2021 డిసెంబరులో రూ.85 ఉన్న డీజిల్ ధర ప్రస్తుతం రూ.118 కి పెరిగిందని చెప్పారు. కేవలం నాలుగు నెలల వ్యవధిలో డీజిల్ ధర రూ.35 పెరిగిపోయిందనీ, తప్పని పరిస్థితుల్లోనే డీజిల్ సెస్ విధించాల్సి వచ్చిందని వారు వివరణ ఇచ్చారు. వల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ సర్వీసుల్లో కనీస చార్జీ రూ.10 గా నిర్ణయించారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో టీఎస్ఆర్టీసీకి బడ్జెట్లో రెండుశాతం నిధులు కేటాయించాలని కార్మిక సంఘాల జేఏసీ నేతలు కోరారు. ప్రభుత్వం వారి వినతిని పరిగణనలోకి తీసుకోలేదు. పెరిగిన డీజిల్ భారాలను ప్రభుత్వం భరించాలని సూచించారు. దాన్నీ ప్రభుత్వం పట్టించుకోలేదు. డీజిల్, విడిభాగాలు సహా అన్ని రకాల ఆర్టీసీ సేవలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులు వసూలు చేసుకుంటున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సర బడ్జెట్లో ఆర్టీసీకి రావల్సిన రీయింబర్స్మెంట్, ప్రభుత్వ గ్యారెంటీ రుణాల చెల్లింపులకోసం కేవలం రూ.1,500 కోట్లు మాత్రమే కేటాయించిన విషయం తెలిసిందే.