Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ధాన్యం కొనుగోళ్లపై టీఆర్ఎస్ నిరసనలు
నవతెలంగాణ- మొఫసిల్ యంత్రాంగం
యాసంగి ధాన్యం కొనుగోళ్లపై నిరసనలో భాగంగా శుక్రవారం టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు తమ ఇండ్లపైనా, రైతుల ఇండ్లపైనా నల్లజెండాలు ఎగురవేశారు. కేంద్రం దిష్టిబొమ్మలు దహనం చేశారు. ధాన్యాన్ని కొనేవరకు కేంద్రంపై పోరాడుతామని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హెచ్చరించారు. ధాన్యం కొనుగోళ్లపై తెలంగాణ పట్ల వివక్ష వీడాలని డిమాండ్ చేశారు.
వికారాబాద్ జిల్లా తాండూరులో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి, తాండూరు రూరల్‌లో ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో రైతుల ఇండ్లపై నల్లా జెండాలు ఎగురవేశారు. మోడీ దిష్టిబోమ్మ దహనం చేశారు. పరిగి ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి తన ఇంటిపై నల్లా జెండా ఎగురవేశారు. వికారాబాద్ జిల్లా కొండగల్ నియోజవర్గంలో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నల్లా జెండాలతో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని గ్రామాల్లో టీఆర్ఎస్ నాయకులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు.
గద్వాల జిల్లా కేంద్రంలో జెడ్పీ చైర్పర్సన్ సరిత ఆమె స్వగృహంపై నల్ల జెండాతో నిరసన తెలిపారు. వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం సంగినేనిపల్లి గ్రామంలో ఎమ్మెల్యే భీరం హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో మోడీ దిష్టిబొమ్మ దహనం చేశారు. నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణ కేంద్రంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు.
యాదాద్రిభువనగిరి జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి తన ఇంటిపై నల్లజెండాను ఎగురవేశారు. ఆలేరు పట్టణ కేంద్రంలో ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్‌రెడ్డి క్యాంపు కార్యాలయంపై నల్లజెండా ఎగురవేసి బైకు ర్యాలీలో పాల్గొన్నారు. మిర్యాలగూడలో ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు ఇంటిపై నల్లజెండా ఎగురవేశారు. నార్కట్‌పల్లిలోని తన ఇంటిపై చిరుమర్తి లింగయ్య నల్ల జెండా ఎగురవేశారు. దేవరకొండలో ఎమ్మెల్యే రవీంద్రకుమార్ నల్లజెండాలను ఎగురవేశారు. నకిరేకల్‌లో ర్యాలీ నిర్వహించారు.
సూర్యాపేట జిల్లాలో ఇంటింటికీ నల్లజెండాలు కట్టి నిరసన ర్యాలీలు నిర్వహించారు. తిరుమలగిరి మున్సిపల్ పరిధిలో స్కూటర్ ర్యాలీ తీశారు. కోదాడ పట్టణంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై నల్లజెండా ఎగురవేశారు. బైక్ ర్యాలీ నిర్వహించారు. హుజూర్నగర్ పట్టణంలో తన క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి నల్లజెండాను ఎగురవేసి నిరసన తెలిపారు.
ప్రజా వ్యతిరేక బీజేపీకి ప్రజలు బుద్ధి చెప్పాలని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. యాసంగి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ మంత్రి నిర్మల్‌లో తన నివాసంపై నల్లజెండా ఎగరేశారు. అనంతరం పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. రైతన్నలు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, తెలంగాణ పట్ల కేంద్రం వివక్షను వీడనాడాలని డిమాండ్ చేశారు. వడ్లు కొనేదాకా రైతుల తరపున కేంద్రంపై పోరాటం చేస్తామన్నారు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా టీఆర్ఎస్ శ్రేణులు రైతులతో కలిసి ఇండ్లపై నల్ల జెండాలు ఎగరేశారు.