Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సాంకేతిక విద్యలో గుణాత్మక మార్పు అవసరం
- ఇంజినీరింగ్‌లో విద్యార్థుల్లో పడిపోతున్న ప్రమాణాలు
- పెరుగుతున్న మార్కెట్ అవసరాలు... తగ్గుతున్న నైపుణ్యం
- అఖిల భారత వీసీల సదస్సులో వక్తలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఇంజినీరింగ్ విద్యార్థుల్లో ప్రమాణాలు పడిపోతున్నాయనీ, మార్కెట్ అవసరాలకు అనుగుణంగా నైపుణ్యం లేదని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. ఇంజినీరింగ్ పట్టా వచ్చినా ఉద్యోగాలు చేసేందుకు పనికొచ్చే నైపుణ్యం విద్యార్థుల్లో ఏదని ప్రశ్నించారు. 21వ శతాబ్ధానికి అవసరమయ్యేలా సాంకేతిక విద్యారంగంలో గుణాత్మక మార్పు తేవాల్సిన అవసరముందని సూచించారు. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ఇంజనీరింగ్ విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించాలని కోరారు. జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం హైదరాబాద్ (జేఎన్టీయూహెచ్), తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి (టీఎస్సీహెచ్ఈ) ఆధ్వర్యంలో 'ఆఫరింగ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ప్రోగ్రామ్' అనే అంశంపై రెండురోజులపాటు జరిగే అఖిల భారత విశ్వవిద్యాలయాల ఉపకులపతుల (వీసీ) సదస్సు శుక్రవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా ముఖ్యఅతిధిగా పాల్గొన్న సెయింట్ సంస్థ వ్యవస్థాపకుడు, పారిశ్రామిక వేత్త డాక్టర్ బీవీఆర్ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ భారత పారిశ్రామిక అవసరాలకు తగ్గ రీతిలో ఇంజినీరింగ్ విద్యార్థుల్లో నైపుణ్యం ఉన్న వారు కన్పించడం లేదన్నారు. ఏటా 21 లక్షల మంది ఇంజినీర్లు పట్టాలతో బయటకొస్తున్నా వారిలో కేవలం 15.3 శాతం మందికే నేటి అవసరాలకు తగ్గ నైపుణ్యం ఉందని చెప్పారు. 2026 నాటికి దేశంలో సాంకేతిక ఉపాధి అవకాశాలు దాదాపు 75 లక్షలకు చేరే అవకాశముందనీ,కానీ ఈ స్థాయిలో నైపుణ్యం ఉన్న వారు దొరకడం కష్టమని అన్నారు. భారత్‌లో ఇంజనీరింగ్ విద్య స్థాయి నుంచే స్టార్టప్‌లను,ఇంక్యుబేటర్లను తయారు చేయాలన్నారు. ఎంటర్ప్రె న్యూర్షిప్ను కోర్సుల్లో చేర్చాలనీ, క్రెడిట్స్ ఇవ్వాలని సూచించారు. తద్వారా విద్యార్థుల్లో సృజనాత్మక పెరుగుతుందని అన్నారు.
ఉద్యోగాలు కావాలంటూ విద్యార్థులు అడుక్కోవద్దు : బిజె రావు
ఉద్యోగాలు కావాలంటూ విద్యార్థులు అడుక్కోవద్దంటూ హెచ్‌సీయూ వీసీ బిజె రావు చెప్పారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా ఎదిగేలా ఆలోచించాలనీ, ఉపాధి అవకాశాలను సృష్టించే వారిలాగా తయారు కావాలని కోరారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు అవుతున్నా అందరికీ నాణ్యమైన విద్య ఇంకా అందలేదన్నారు. పాలకులు తీసుకుంటున్న నిర్ణయాలే కారణమని అన్నారు. ప్రతి విశ్వవిద్యాలయం కనీసం ఐదు స్టార్టప్‌లను తయారు చేయగలిగితే దేశ జీడీపీలోనే ఉజ్వల మార్పు కన్పిస్తుందన్నారు. నోబెల్ బహుమతి గెలుచుకున్న వారిలో అనేక మంది డిగ్రీ స్థాయి వాళ్లేనని గుర్తు చేశారు. సమాజంలో ఉండే సమస్యలకు పరిష్కారాలు చూపాలంటూ పాలకులు తమ వద్దకు రావాలన్నారు.
కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఇంజినీరింగ్ విద్యార్థుల దరఖాస్తు : లింబాద్రి
యూపీఎస్సీకి ఇంజినీరింగ్ పూర్తి చేసిన విద్యార్థులు ఎంపికవుతున్నారని ఉన్నత విద్యామండలి చైర్మెన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి చెప్పారు. పంచాయతీ కార్యదర్శులు, పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకూ వారు దరఖాస్తు చేసే పరిస్థితికి వచ్చారని ఆందోళన వ్యక్తం చేశారు. ఉన్నత విద్యలో మహిళల భాగస్వామ్యం పెరగడం ఆహ్వానించదగ్గ పరిణామమన్నారు. పీజీలో 76 శాతం మహిళలే ఉన్నారని వివరించారు. ఉన్నత విద్యను బలోపేతం చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామనీ, అంతర్జాతీయ విధానాలను అందిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. నాణ్యమై న విద్యాబోధన కోసం సంస్కరణలు చేపట్టామని ఉన్నత విద్యామండలి వైస్ చైర్మెన్ వి వెంకటరమణ అన్నారు. జేఎన్టీయూహెచ్ వీసీ కట్టా నర్సింహారెడ్డి మాట్లాడుతూ ప్రపంచంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా సాంకేతిక విద్యను తీర్చిదిద్దుతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ బిఎస్ మూర్తి, ఓయూ, కేయూ, టీయూ, పీయూ వీసీలు డి రవీందర్, టి రమేష్, రవీందర్, లక్ష్మికాంత్‌రాథోడ్, జేఎన్టీయూహెచ్ రెక్టార్ ఎ గోవర్ధన్, రిజిష్ట్రార్ మంజూర్ హుస్సేన్, ఉన్నత విద్యామండలి కార్యదర్శి ఎన్ శ్రీనివాసరావు పాల్గొన్నారు.