Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 70ఏండ్లుగా సాగులో ఉన్న రైతులు
- వందల ఎకరాలను స్వాధీనం చేసుకునేే ప్రయత్నం
నవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
భూమిలేని ప్రతి దళిత కుటుంబానికీ మూడెకరాల భూమి పంపిణీ చేస్తానన్న సీఎం కేసీఆర్.. పంపిణీ మాట అటుంచితే.. వారికి ఉన్న భూములనే లాక్కుంటున్నారు. ఎపుడో ఏండ్ల కిందట దళితులకు నాటి ప్రభుత్వాలు ఇచ్చిన భూమిని అభివృద్ధి పేరిట లాక్కునే కుట్రలకు తెరలేపుతున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఇప్పటివరకు ప్రభుత్వ అవసరాల కోసం వాడుకున్న భూముల్లో సగానికంటే ఎక్కువగా దళితుల భూములే ఉన్నాయి. గుంటలు, ఎకర, రెండెకరాల భూములు కలిగిన వారి నుంచే తీసుకుంటున్నారు. ఇప్పుడు ల్యాండ్ ఫుల్లింగ్ పేరుతో యాదాద్రి భువనగిరి జిల్లాలో విలువైన దళితుల భూములను లాక్కునే ప్రయత్నం చేస్తోంది.
ఎన్నికల హామీల్లో భాగంగా దళితులకు మూడెకరాల భూమిని పంపిణీ చేస్తామని ఉద్యమం నుంచి రెండోసారి సీఎం అయ్యే వరకు కేసీఆర్ ప్రకటించారు. కానీ పంపిణీ సంగతి పక్కకు పోయింది.. ఎక్కడెక్కడ విలువైన భూములున్నాయో వాటిని లాక్కుని కార్పొరేటర్లకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. 1975లో నాటి ప్రధాని ఇందిరాగాంధీ కాలంలో చౌటుప్పల్ మండలం ఎస్‌లింగోటం గ్రామంలో 130 మంది దళిత, బలహీనవర్గాలకు చెందిన పేదలకు ప్రభుత్వం భూమిని కేటాయించింది. 252 సర్వే నెంబర్లో ఏ 83-36ఎకరాలు, 268 సర్వే నెంబర్లో ఏ 57-32 ఎకరాలు, 269 సర్వేనెంబర్లో 11 ఎకరాల భూమిని ఇచ్చింది. మొత్తంగా 152.28ఎకరాల భూమిని నాటి ప్రభుత్వం 135 కుటుంబాలకు పంపిణీ చేసింది. అయితే, 1970లో భూమి ఇచ్చినప్పటికీ.. 1975లో పాసుపుస్తకాలు ఇచ్చారు. ప్రస్తుతం రైతుబంధు, పంటరుణాలు కూడా రైతులకు అందుతున్నాయి. లక్షలు ఖర్చు చేసి సాగుకు అనుకూలం చేసిన రైతులు ప్రభుత్వం ఇచ్చిన ఆ భూముల్లో మొదట్లో రాళ్లు, రప్పలు, చెట్టు, పుట్టలు ఉండేవి. వాటన్నింటినీ తొలగించి రైతులు సాగుకు అనుకూలంగా మార్చుకున్నారు. బావులు తవ్వారు. బోర్లు వేసుకున్నారు. ప్రస్తుతం ఆ భూమిలో మూడోతరం సాగు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ మొత్తం భూమిలో 70 బోర్లున్నాయి. రైతు పిట్టల శంకరయ్య పంటల సాగుకై నీటి వసతి కోసం రెండు బావులు తవ్వి, తిరిగి పూడ్చి వేశారు. సుమారు 21బోర్లు వేశారు. ఆయనొక్కడే దాదాపు 20లక్షలు ఖర్చు చేసినట్టు చెప్పాడు. ఇతర రైతులు కూడా భూమి చదును కోసం ఇప్పటి వరకు సుమారు. రూ.10లక్షల చొప్పున ఖర్చు చేసినట్టు తెలిపారు. 75శాతం వరి, 25శాతం పత్తి, కంది, ఇతర పంటలను సాగు చేస్తున్నారు.
మెహర్ నగర్లో 182 ఏకరాల భూములకు ఎసరు
పోచంపల్లి మండలం మోహర్నగర్లో సుమారు 70ఏండ్లకు పైగా దళితులు అసైన్డు భూములను సాగు చేసుకుంటున్నారు. 153సర్వే నెంబర్లో 72ఎకరాలు, 321 సర్వేనెంబర్లో 110ఎకరాలు సాగు చేసుకుంటున్నారు. మొత్తంగా 130 కుటుంబాలు 182ఎకరాల భూమిని సేద్యం చేసుకుంటున్నారు.
రియల్ బ్రోకర్‌గా ప్రభుత్వం
తినడానికి తిండి, ఉండటానికి ఇల్లు.. కట్టడానికి బట్టలేని నిరుపేదలకు అప్పటి ప్రభుత్వాలు అసైన్డ్ భూములను కేటాయించాయి. ఆ భూమి వల్ల ఆత్మగౌరవం పెరుగుతుందని, స్వశక్తితో జీవిస్తారని ప్రభుత్వం ఆశించింది. రైతులు భూములను సాగు చేసుకుంటున్నారు. కానీ టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన ఏడేండ్లలో చౌటుప్పల్ మండలంలో ఒక్క ఎకరం భూమిని కూడా పేదలకు పంచని ప్రభుత్వానికి.. దళితుల భూములపై కన్ను పడింది. ఈ మధ్య కాలంలో ప్రభుత్వమే రియల్ బ్రోకర్‌గా మారి పేదల అసైన్డు భూములను గుంజుకుంటోందని పలువురు బాధితులు తెలిపారు.
నోటికాడి ముద్దను లాక్కుంటున్నారు
తూర్పింటి లక్ష్మమ్మ- ఎస్ లింగోటం- చౌటుప్పల మండలం
వ్యవసాయం చేసుకుంటే తప్ప పూటగడవని పరిస్థితి మాది. ఈ భూమిలో మూడోతరానికి సంబంధించిన కుటుంబం సాగు చేస్తుంది. నోటి కాడి ముద్దను ప్రభుత్వం లాక్కోవడం అన్యాయం. తమ భూమిని బలవం తంగా లాక్కుంటే విషంతాగి ప్రభుత్వం కార్యాలయాల ముందే సాముహికం గా ఆత్మహత్య చేసుకుంటాం. ప్రాణం పోయినా భూములను ఇవ్వం.
భూముల్లో అడుగు పెట్టనివ్వం
తూర్పింటి రాములు - కన్వీనర్ ఎస్. లింగోటం- భూ పరిరక్షణ కమిటీి
ఏండ్ల తరబడి భూమిని సేద్యానికి అనుకూలంగా చేసుకున్న తమను బలవంతంగా ఇక్కడి నుంచి వెళ్లగొట్టడం అన్యాయం. ఏ స్థాయి వాళ్లు వచ్చినా మా భూముల్లో అడుగుపెట్టనివ్వం. భూములు తీసుకోవడం ఆపేస్తున్నట్లు ప్రభుత్వ ప్రకటన చేసే వరకు కలిసికట్టుగా పోరాడుతాం.
ప్రభుత్వం రియల్ ఎస్టేట్ బ్రోకర్‌గా మారడం దురదృష్టం
కొండమడుగు నర్సింహా
పేదల భూములను లాక్కుని ప్రభుత్వమే రియల్ ఎస్టేట్ బ్రోకర్‌గా పనిచేయడం దురదృష్టకరం. సెంటు భూమి ఇవ్వని సర్కార్ ఉన్న భూములను గుంజుకోవడం ఏం న్యాయం. ప్రభుత్వం తన విదానాన్ని మార్చుకోవాలి. లేకపోతే దళితులకు న్యాయం జరిగే వరకు ఉద్యమాలు నిర్వహిస్తాం.