Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒక్కరోజులో రూ.500 తగ్గించిన ట్రేడర్లు
- క్వింటాకు రూ.1450 పలికిన ధర
- సూర్యాపేట మార్కెట్ కార్యాలయాన్ని ముట్టడించిన రైతులు
నవతెలంగాణ-సూర్యాపేటటౌన్
ధాన్యం కొనుగోళ్లు.. ధర అమాంతం తగ్గింపుపై రైతులు భగ్గుమన్నారు. వ్యాపారులు ఒక్క రోజులోనే రూ.500 తగ్గించడంతో మార్కెట్ కార్యాలయాన్ని ముట్టడించారు. గేట్లను మూసేశారు. ఆరుగాలం కష్టం చేసి పండించిన పంటను దోచుకుంటుండటంతో కడుపు మండి కాంటా మిషన్లను ధ్వంసం చేశారు. ఈ ఘటన శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో జరిగింది. వివరాలిలా ఉన్నాయి.. వారం రోజులుగా రైతులు మార్కెట్కు ధాన్యాన్ని తీసుకొస్తున్నారు. క్వింటాకు రూ.1950 వరకు పలికిన ధరను శనివారం ఒక్కసారిగా మిల్లర్లు, ట్రేడర్లు కుమ్మక్కై రూ.500 తగ్గించారు. క్వింటాకు రూ.1450 మాత్రమే ధర వేశారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎండనక, వాననక పండించిన పంటకు మార్కెట్లో సరైన గిట్టుబాటు ధర లభించకపోవడం ఆవేదన కలిగిస్తోందని పలువురు రైతులు ఆందోళన చెందారు. శనివారం మార్కెట్కు 26,352 బస్తాల ధాన్యం వచ్చిందని చెప్పారు. కమీషన్ దారులు, ఖరీదుదారులు, అధికారులు కుమ్మక్కై మా కష్టాన్ని దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము తెచ్చిన ధాన్యానికి సరైన ధర ఇవ్వకపోతే కాంటా వేయనీయబోమని హెచ్చరించారు. మార్కెట్ కార్యాలయాన్ని ముట్టడించారు. కార్యాలయం గేటు వేసి అధికారులను నిర్బంధించారు. విషయం తెలుసుకున్న కలెక్టర్ వినరు కృష్ణారెడ్డి మార్కెట్కు వచ్చారు. రైతులకు అన్యాయం జరిగినట్టు తేలితే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.