Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐదు నెలల గర్భం దాల్చడంతో ఘటన వెలుగులోకి..
- రాజీ కుదిర్చేందుకు అధికార పార్టీ నేతల యత్నం
నవతెలంగాణ - వర్ధన్నపేట
బాలికపై గ్రామ సర్పంచ్ ఆరు నెలలుగా లైంగిక దాడి చేస్తూ గర్భవతిని చేశాడు. బాధితురాలు ఐదు నెలల గర్భం దాల్చడంతో విషయం వెలుగులోకొచ్చింది. అయితే, బయటకు పొక్కకుండా చేసేందుకు అధికార పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారన్న విమర్శలు న్నాయి. ఈ సంఘటన వరంగల్ జిల్లా వర్దన్నపేట మండలంలోని ల్యాబర్తి గ్రామంలో శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివారాల్లోకెళ్తే..లేబర్తి గ్రామానికి చెందిన సర్పంచ్ రాజు గ్రామానికి చెందిన 16 ఏండ్ల బాలికను తమ ఇంట్లో పనిచేసేందుకు కుదుర్చుకున్నాడు. బాలిక గ్రామానికి చెందిన ఓ యువకుడితో చనువుగా మాట్లాడటాన్ని గమనించిన సర్పంచ్ పస్తం రాజు ఆ యువకుడిని బెదిరించాడు. ఈ విషయం ఆసరాగా తీసుకున్న సర్పంచ్ బాలికను బెదిరించి లైంగికదాడి చేస్తున్నాడు. సదరు బాలిక ఐదు నెలల గర్భం దాల్చడంతో తల్లిదండ్రులు గమనించి గట్టిగా అడగటంతో విషయం చెప్పింది. ఈ విషయమై సర్పంచ్ పస్తం రాజును నిలదీయగా.. విషయం బయటకు పొక్కకుండా రాజీ కుదిర్చేందుకు టీఆర్ఎస్ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. స్థానిక టీఆర్ఎస్ నేతలు శనివారం గ్రామం శివార్లలోని ఒక మామిడి తోటలో పంచాయితీ నిర్వహించేందుకు సిద్ధమయ్యారని తెలిసింది. అయితే, విషయంలో గ్రామంలో దావానంలా వ్యాపించడంతో సోషల్ మీడియాకెక్కింది. నిరుపేద కుటుంబానికి చెందిన బాలికకు న్యాయం చేయాలంటూ గ్రామస్తులు పోలీసులకు చెప్పేందుకు యత్నిస్తే.. గ్రామ పెద్దలు వారిని వారించి అడ్డుకున్నట్టు సమాచారం. నియోజకవర్గానికి చెందిన ప్రధాన నాయకుడి సూచనతో బాలిక కుటుంబాన్ని రహస్య ప్రదేశానికి తరలించినట్టు గుసగుసలు వినబడుతున్నాయి. సర్పంచ్ రాజుపై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాల నేతలు, గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.