Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తక్షణమే ప్రభుత్వం చెల్లించాలి : టీపీటీఎఫ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ధనిక రాష్ట్రంలో ఉద్యోగుల వేతనాలకు ఇబ్బంది ఉందని తెలంగాణ ప్రొగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ (టీపీటీఎఫ్) రాష్ట్ర అధ్యక్షులు కె రమణ, ప్రధాన కార్యదర్శి మైస శ్రీనివాసులు విమర్శించారు. ఈనెల పదో తేదీ వచ్చినా 14 జిల్లాల్లో వేతనాలు అందక ఉపాధ్యాయులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. గతనెల 23న ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులు చెల్లించాలనీ, ప్రతినెలా మొదటి తేదీన జీతాలివ్వాలని ఆందోళన చేసినా ప్రభుత్వంలో కదలిక లేదని పేర్కొన్నారు. దేశంలోనే ధనిక రాష్ట్రమంటూ పాలకులు పదేపదే చెప్తున్నారని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులకు వారాలకుపైగా ఆలస్యంగా వేతనాలు అందుతున్నాయని వివరించారు. ప్రభుత్వ ఉద్యోగులకు మొదటి తేదీన వేతనాలు ఇవ్వడం ఆనవాయితీ అని పేర్కొన్నారు. 90 శాతం ఉద్యోగులు, ఉపాధ్యాయులు గృహ రుణాలు, వ్యక్తిగత రుణాలు తీసుకుంటారని తెలిపారు. సిబిల్స్కోర్పైనా ప్రభావం పడుతుందని తెలిపారు. దీంతో ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్ర మానసిక ఆందోళనకు గురవుతున్నారని పేర్కొన్నారు. అభద్రతాభావంతో జీవితాలను కొనసాగిస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.