Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్వింటాకు రూ.300 నుంచి 650 వరకు నష్టపోతున్న రైతులు : బండి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
టీఆర్ఎస్ వడ్ల రాజకీయం వెనుక మహాకుట్ర దాగి ఉందనీ, బ్రోకర్లతో సీఎం కేసీఆర్ కుమ్మక్కయి రైతులకు తీవ్ర అన్యాయం చేస్తున్నాడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజరుకుమార్ విమర్శించారు. భారీ ఎత్తున కమీషన్లు దండుకునేందుకు గులాబీ దండు స్కెచ్ వేసిందని ఆరోపించారు. రైతులతో తక్కువ ధరకే వడ్లు విక్రయించేలా చేసి ధాన్యం వ్యాపారులకు లాభాలు కట్టబెడుతున్నాడని విమర్శించారు. వరికి కనీస మద్దతు ధర రూ.1960 ఉండగా దళారులు, మిల్లర్ల కుమ్మక్కయి ఒక్కో క్వింటా మీద రూ.300 నుంచి రూ.650 వరకు తగ్గించి కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు శనివారం రైతులకు ఆయన బహిరంగ లేఖ రాశారు. రైతుల్లో వచ్చే ఆగ్రహాన్ని కేంద్రంపై మళ్లించే ఎత్తుగడను టీఆర్ఎస్ సర్కారు వేస్తున్నదని తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల మూసివేత అందులో భాగమేనని పేర్కొన్నారు. అన్నదాతల్లారా కేసీఆర్ కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించేలా కేసీఆర్పై ఒత్తిడి తేవాలని సూచించారు. రైతు పండించే ప్రతి గింజా కొనేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని తెలిపారు. వడ్ల కొనుగోలు కోసం కేంద్రం గత ఏడేండ్లలో ఇప్పటికే తెలంగాణకు రూ.97 వేల కోట్లను చెల్లించిందని వివరించారు. వడ్ల కొనుగోలు కోసం రాష్ట్ర ప్రభుత్వం నయా పైసా కూడా ఖర్చుచేయలేదని విమర్శించారు.