Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రవాణా శాఖ వెంటనే ఉపసంహరించుకోవాలి
- రేపు ఖైరతాబాద్‌లోని రవాణా శాఖ కమిషనర్ కార్యాలయం ముట్టడి
- రాష్ట్ర వ్యాప్తంగా ట్రాన్స్పోర్ట్ కార్యాలయాల ముందు ధర్నాలు : సీఐటీయూ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
వాహనాల ఫిట్నెస్ గడువు అయిపోగానే రోజుకు రూ.50 చొప్పున ఫైన్ వేయడం దారుణమనీ, దానిని రవాణా శాఖ వెంటనే ఉపసంహరించుకోవాలని తెలంగాణ పబ్లిక్, ప్రయివేటు రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ (సీఐటీయూ అనుబంధం) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం.సాయిబాబు, పి.శ్రీకాంత్ డిమాండ్ చేశారు. ఫిట్‌నెస్‌పై ఫైన్, ఓవర్ లోడ్ రవాణాపై విపరీతంగా జరిమానాలు విధించడం, తదితర సమస్యలపై ఈ నెల 11న ఖైరతాబాద్‌లోని రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ కార్యాలయ ముట్టడి, జిల్లా కేంద్రాల్లో ట్రాన్స్పోర్ట్ కార్యాలయాల ఎదుట ధర్నాలకు పిలుపునిచ్చారు. వాటిని జయప్రదం చేయాలని కోరారు. ఈ మేరకు వారు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. కేంద్రం ప్రభుత్వం తీసుకొచ్చిన మోటారు వాహన చట్టం-2019 రవాణా రంగం కార్మికులపైనా, ప్రజలపైనా విపరీత భారాలను మోపుతున్నదని విమర్శించారు. ఇప్పటికే పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలతో అనేక ఆర్ధిక ఇబ్బందులను రవాణారంగ కార్మికులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. పుండు మీద కారం చల్లిన చందంగా ఈ నెల ఒకటో తేదీ నుంచి ఫిట్నెస్ రెన్యూవల్ ఫీజులను త్రీ వీలర్‌కు రూ.3,500, లైట్ వెయిట్ మోటార్ వెహికల్‌కు రూ.7 వేలు, మినీ గూడ్స్ రూ.10 వేలు, గూడ్స్ రూ.12,500 విధించడం దారుణమనీ, దీనికి తోడు లేటయిన కొద్దీ ఒక్కో రోజుకు రూ.50 జరిమానా వేయడం అన్యాయమని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ఓ ఆటో కార్మికుడు ఫిట్నెస్ కోసం స్లాట్ బుక్ చేస్తే లేట్ ఫీజు పేరుతో రూ.47,350 వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. అంత జరిమానా ఎలా కడతారని ప్రశ్నించారు. రెండు టన్నులెక్కువ ఉంటే ఓవర్ లోడింగ్ నెపంతో రూ.27 వేల ఫైన్ వేయడం దారుణమని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న పెనాల్టీలపై వందల రెట్లు పెంచి కార్మికులు, ప్రజల వద్ద పాలకులు డబ్బులు గుంజుతున్నారని విమర్శించారు. జరిమానాల పేరిట ఆటో, ట్రాలీ, క్యాబ్, డీసీఎం, లారీ, స్కూల్ బస్, అంబులెన్స్, ట్రాక్టర్, మినీ డీసీఎం, హైయర్ బస్, జేసీబీ, ట్రక్కు కార్మికులు, సొంత వాహనదారులపై కరోనా కాలంలో తీవ్ర ఆర్ధిక భారాలు మోపడం సర్కారు ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు.