Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లేకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తాం :వంగూరి రాములు
నవతెలంగాణ-నల్లగొండ
గ్రామ రెవెన్యూ సహాయకులకు ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, లేకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తెలంగాణ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం(వీఆర్ఏల) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగూరి రాములు అన్నారు. శనివారం నల్లగొండ పట్టణంలోని దొడ్డి కొమురయ్య భవన్లో వీఆర్ఏల సంఘం ఉమ్మడి నల్లగొండ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వీఆర్ఏలు దళిత,బడుగు బలహీన వర్గాలకు చెందిన వారని ముఖ్యమంత్రి అసెంబ్లీలో చెప్పారన్నారు. వారికి పే స్కేల్ ఇస్తామని, వయస్సు పైబడిన వారి పిల్లలకు వారసత్వ ఉద్యోగాలు ఇస్తామని అన్నారని తెలిపారు. అర్హులైన వారికి ప్రమోషన్ ఇస్తామని, ఇతర సమస్యలు పరిష్కరిస్తామని ఇచ్చిన హామీ ఏడాది గడిచినా ఇప్పటివరకు ఉలుకుపలుకూ లేదన్నారు. రెవెన్యూ వ్యవస్థలో కీలక భూమిక పోషించిన వీఆర్ఏలను ప్రభుత్వం ఇతర శాఖలకు మళ్లిస్తా నని ఏం చేయకుండా అనాథలను చేసిందన్నారు. ఈ సమావేశంలో సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి ఎల్.నర్సింహారావు, నల్లగొండ, భువనగిరి జిల్లాల గౌరవాధ్యక్షులు చిన్నపాక లక్ష్మీనారాయణ, కల్లూరి మల్లేష్, మూడు జిల్లాల అధ్యక్షులు మోసంగి అంజయ్య, పసుల రమేశ్, ఎడ్ల మల్లయ్య, కార్యదర్శులు జి.శ్రీనివాస్, వెంకటేష్ పాల్గొన్నారు.