Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పుస్తకావిష్కరణలో పలువురు వక్తలు
- మఖ్దూంభవన్‌లో వందో ఏట జన్మదిన వేడుకలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
స్వాతంత్య్ర పోరాటంలో అలుపెరగని పోరాటం చేసిన ఏటుకూరి కృష్ణమూర్తి ధన్యజీవి అని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. ఆయనను ఆదర్శంగా తీసుకొని నేటి తరం ముందుకు సాగాల్సిన అవసరముందన్నారు. కృష్ణమూర్తి 99 ఏండ్లు పూర్తి చేసుకొని, వందో ఏటలోకి అడుగిడిన సందర్భంగా ఆయన రాసిన 'మన ప్రజా వైద్యులు' పుస్తకావిష్కరణ సభ హైదరాబాద్‌లోని మఖ్దూంభవన్‌లో శనివారం జరిగింది. సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి పుస్తకావిష్కరణ చేసి తొలి ప్రతిని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి కె నారాయణకు అందజేశారు.ఈ సందర్భంగా జన్మదిన వేడుకలు జరిగాయి. కేక్ కట్ చేశారు. సుధాకరరెడ్డి మాట్లాడుతూ స్వాతంత్య్ర సంగ్రామంలో చిన్న వయస్సులోనే పాల్గొని బ్రిటీష్ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా పోరాడారని గుర్తుచేశారు. కె నారాయణ మాట్లాడుతూ సుదీర్ఘ అనుభవం కలిగిన కృష్ణమూర్తి మధ్యలో తానుండటం నిజంగా ధన్యజీవినని అన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ కృష్ణమూర్తి కుటుంబం విజ్ఞాన కోవిధుల కుటుంబమనీ, నిత్యం జ్ఞాన జ్యోతులు వెలుగిస్తున్నారని అన్నారు. ఏటుకూరి కృష్ణమూర్తి మాట్లాడుతూ స్వాతంత్య్ర సంగ్రామం నుంచి మొదలుకొని నేటి వరకు ఎర్రజెండా చేబూని ముందుకుసాగుతున్నానని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీపీఐ ఏపీ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు, జాతీయ కార్యవర్గసభ్యులు సయ్యద్ అజీజ్‌పాషా, ఇప్టా జాతీయ ఉపాధ్యక్షులు కందిమళ్ళ ప్రతాపరెడ్డి, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శులు పల్లా వెంకట్‌రెడ్డి, కూనంనేని సాంబశివరావు, నవచేతన విజ్ఞాన సమితి సంపాదకులు ఏటుకూరి ప్రసాద్, ఏటుకూరి కష్ణమూర్తి తనయులు శ్రీనివాసమూర్తి, భరద్వాజ తదితరులు పాల్గొన్నారు.