Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్టీసీ చైర్మెన్ క్యాంప్ కార్యాలయం
ఎదుట సీపీఐ(ఎం) ధర్నా
నవతెలంగాణ-కంఠేశ్వర్
ఇప్పటికే అన్నింటి ధరలు పెరిగి ఇబ్బందులు పడుతున్న ప్రజలపై ఆర్టీసీ చార్జీల పెంపు తగదని సీపీఐ(ఎం) నాయకులు అన్నారు. చార్జీల పెంపును నిరసిస్తూ నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ చైర్మెన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ క్యాంపు కార్యాలయం ఎదుట శనివారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) నగర కార్యదర్శి మల్యాల గోవర్ధన్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం రోజురోజుకూ పెట్రో, డీజిల్, గ్యాస్ ధరలు పెంచి ప్రజలపై తీవ్రమైన భారం మోపుతూ ఉంటే..రాష్ట్ర ప్రభుత్వం కూడా తానేమీ తక్కువ కాదంటూ ఆర్టీసీ చార్జీలను పెంచడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు.గతంలో టోల్టాక్సీ, ఇన్సూరెన్స్, ఫిట్నెస్ చార్జీలు పెరిగాయంటూ..ఆ భారం నుంచి తప్పించుకోవడం కోసం చార్జీలు పెంచిందని, మళ్లీ ఇప్పుడు డీజిల్పై సెస్ భారం పేరుతో బాదడం సరికాదన్నారు. మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా ప్రజల పరిస్థితి తయారైందన్నారు. పెంచిన ఆర్టీసీ చార్జీలను వెంటనే తగ్గించాలని, ఆర్టీసీ ఆస్తులను కాపాడాలని, సంస్థ పరిరక్షణ కోసం ప్రత్యేక ప్యాకేజీ కేటాయించి అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే ప్రజా ఉద్యమం తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో నగర కార్యదర్శివర్గ సభ్యులు సుజాత, కటారి రాములు, నగర కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.