Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి
నవతెలంగాణ-సంస్థాన్‌నారాయణపురం
ప్రధాని నరేంద్రమోడీ ప్రయివేటీకరణ మోజులో పడి దేశాన్ని తిరోగమనం వైపు తీసుకెళ్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి విమర్శించారు. శనివారం యాదాద్రిభువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. నరేంద్రమోడీ పేద ప్రజలను ఇబ్బందులకు గురి చేసి కార్పొరేట్ శక్తులకు జాతీయ సంపదను ధారాదత్తం చేస్తున్నారన్నారు. డీజిల్, పెట్రోల్, వంటగ్యాస్ ధరలను పెంచి ప్రజలపై మోయలేని భారాలు వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చమురు ధరలను నియంత్రించడంలో విఫలమయ్యారని విమర్శించారు. దేశంలో ఎనిమిదేండ్ల మోడీ పాలనలో రూ.26 లక్షల కోట్లు ప్రజలపై అదనపు భారం మోపారన్నారు. విదేశీ బ్యాంకుల్లో మూలుగుతున్న నల్లధనాన్ని తెచ్చి దేశ ప్రజల ఖాతాల్లో రూ.లక్షలు వేస్తామని చెప్పిన మోడీ వేయకపోగా.. ధరల మీద ధరలు పెంచి ప్రతి మనిషి మీద లక్ష రూపాయలు వసూలు చేస్తున్నారని వివరించారు. నాటి ప్రధాని ఇందిరాగాంధీ బ్యాంకులను జాతీయీకరణ చేయగా.. నేటి ప్రధాని నరేంద్రమోడీ ప్రయివేటీకరించేందుకు 36 బ్యాంకులను 12 బ్యాంకులుగా మార్చారన్నారు. దేశంలో మతవిద్వేషాలను రెచ్చగెడుతూ ప్రజలను చీల్చే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. బీజేపీని నిలువరించేందుకు వామపక్ష వేదిక ఏర్పాటు చేసేందుకు తమ పార్టీ కృషి చేస్తుందన్నారు.
వరిధాన్యం కొనుగోలు విషయంలో బీజేపీ, టీఆర్ఎస్లు రాజకీయాలు మాని వెంటనే కొనుగోళ్లు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యాన్ని కొని గతంలో మాదిరిగా బియ్యాన్ని కేంద్రానికి పంపాలన్నారు. కేంద్రం తీసుకోకుంటే.. ఇక్కడి బీజేపీ నాయకులు దానికి పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ఈ సమావేశంలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి, మునుగోడు మాజీ ఎమ్మెల్యే ఉజ్జిని యాదగిరిరావు, భువనగిరి, నల్లగొండ జిల్లాల కార్యదర్శులు గోదా శ్రీరాములు, నెల్లికంటి సత్యం, మండల కార్యదర్శి బి.గాలయ్య పాల్గొన్నారు.