Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వ్యతిరేకిస్తూ తీర్మానం
కన్నూరు (కేరళ) నుంచి నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి
దేశంలో మహిళలపై రోజురోజుకీ దాడులు, అఘాయిత్యాలు పెరిగిపోవటం పట్ల సీపీఐ(ఎం) 23వ మహాసభ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. వీటన్నింటినీ ముక్తకంఠంతో ఖండించాలని ప్రజానీకానికి పిలుపునిచ్చింది. ఈ మేరకు మహాసభలో తీర్మానించారు. 'మహిళలతోపాటు యువతులపై అఘాయిత్యాలు కొనసాగుతున్నాయి. వారిపై హింస, సామూహిక అత్యాచారాలు, మానసికంగా, శారీరకంగా అవమానపరుస్తూ మాట్లాడటం తదితర ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కొన్ని రాజ్యాంగేతర సంస్థలు తాము సొంతంగా ఏర్పాటుచేసుకున్న బృందాల ద్వారా ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నాయి. ఇవిగాక మహిళలు, యువతులపై హత్యలు, దోపిడీలు, మూక దాడులను కొనసాగుతున్నాయి. ఆరెస్సెస్, బీజేపీ రాజకీయ మద్దతుతోనే అసాంఘీక శక్తులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని...ఈ దాడులను కొనసాగిస్తున్నాయి. దేశంలోని మూడోవంతుకుపైగా చిన్నారులు ఇలాంటి అఘాయిత్యాలకు బలవుతున్నారు. పోలీస్ రికార్డుల ప్రకారం... దేశ రాజధాని ఢిల్లీలో ఒక్కో నెలలో ఏడు పోస్కో కేసులు నమోదవటం ఆందోళనకరం. జాతీయ మహిళా కమిషన్ నివేదిక ప్రకారం... 2020తో పోలిస్తే 2021లో మొదటి ఎనిమిది నెలల్లో మహిళలపై హింసకు సంబంధించిన ఘటనలు 46 శాతం పెరిగాయి. వీటిలో 35 శాతం కేసులు గృహ హింస, భర్తలు లేదా బంధువుల దాడులకు సంబంధించినవే ఉంటున్నాయి...' అని తీర్మానంలో పేర్కొన్నారు. ఇలాంటి వాటన్నింటికి వ్యతిరేకంగా పెద్ద సంఖ్యలో ప్రజలను సమీకరించి పోరాడాలని సీపీఐ (ఎం) తన శ్రేణులకు పిలుపునిచ్చింది.