Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేసీఆర్.. రైతులతో రాజకీయాలొద్దు
- జీవితమంతా ఉద్యమాలతోనే..:
హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్
నవతెలంగాణ - మహబూబ్నగర్ ప్రాంతీయప్రతినిధి
సోయి తప్పి మాట్లాడుతున్న సీఎం కేసీఆర్ పాలన చేతగాకపోతే పదవికి రాజీనామా చెరు.. లేకుంటే ఇచ్చిన మాట ప్రకారం రైతు పండించిన ప్రతిగింజనూ కొనుగోలు చేయాలని హుజూరాబాద్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని అన్నపూర్ణ గార్డెన్లో శనివారం నిర్వహించిన రైతు సదస్సులో ఆయన మాట్లాడారు. నాడు తెలంగాణ ఉద్యమం.. నేడు న్యాయం, ధర్మం కోసం కేసీఆర్తో కోడ్లాడుతున్నానని, తన జీవితం మొత్తం ఉద్యమాలతోనే సాగుతుందని అన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం చేసిన ఉద్యమాలు పాలమూరులో సజీవంగా ఉంటాయన్నారు. రాష్ట్రం వచ్చిన తర్వాత ఏడేండ్ల పాలనలో నియంతృత్వం, రాచరిక పాలన చవి చూశామన్నారు. మంత్రి వర్గం, ఎమ్మెల్యే పదవి నుంచి బయటకు వచ్చిన తర్వాత కేసీఆర్ నిజస్వరూపం బయట పెట్టడం తన బాధ్యత అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నుల రూపంలో వచ్చిన రూ.4 కోట్ల ప్రజాధనంతోనే పాలన చేస్తున్నాయని, కేసీఆర్ సొంత డబ్బులేమీ ఖర్చు చేయడం లేదని అన్నారు. గజ్వేల్లో ఉన్న మీ సొంత భూములు అమ్మి సంక్షేమ పథకాలైన పింఛన్లు, రుణమాఫీ వంటివి అమలు చేస్తున్నారా అని ప్రశ్నించారు. చీర కొన్నా, బీరు తాగినా పన్నులు చెల్లించేది ప్రజలేనన్నారు. సాగు నీరిచ్చామని గొప్పలు చెబుతున్న కేసీఆర్ నీళ్లతో పండిన ధాన్యాన్ని ఎందుకు కొనుగోలు చేయడం లేదని ప్రశ్నించారు. దేశ ఆర్థిక వ్యవస్థ ఆధారపడి ఉన్న వ్యవసాయాన్ని, సాగు చేసే రైతులపై కపట నాటకాలు మానుకోవాలని అన్నారు. పీడీఎస్ బియ్యం గురించి తెలియకుంటే అడిగి తెలుసుకోవాలని హితవు పలికారు. ఇప్పటికైనా ధాన్యం కొనుగోలు విషయంలో రాజకీయాలు మాని వెంటనే కొనుగోలు ప్రక్రియ ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. సదస్సులో మాజీ మంత్రి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు డీకే.అరుణ, జిల్లా అధ్యక్షులు వీరబ్రహ్మచారి, రాష్ట్ర కోశాధికారి శాంతికుమార్ తదితరులు పాల్గొన్నారు.