Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్రం ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్
- ఏర్పాట్లను పర్యవేక్షించిన ఎమ్మెల్సీ కవిత, ఎంపీలు
- మంత్రివర్గం మొత్తం అక్కడకే...
- సీఎం కేసీఆర్ హాజరు డౌటే!
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్రంలో పండిన యాసంగి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ నిరాహార దీక్ష నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. దానిలో పాల్గొనేందుకు పార్టీ శ్రేణులు ఇప్పటికే ఢిల్లీకి బయల్దేరారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు, ఆయన భార్య శోభ, కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వారం క్రితమే ఢిల్లీ వెళ్లారు. అక్కడ సీఎం కేసీఆర్‌కు ఎయిమ్స్ అస్పత్రిలో ఆయనకు పంటి చికిత్స చేశారు. కంటి చూపుకు సంబంధించిన పరీక్షలు కూడా చేశారు. ప్రస్తుతం ఆయన డాక్టర్ల సూచన మేరకు ఢిల్లీలోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. ఢిల్లీ జంతర్‌మంతర్ వద్ద జరిగే నిరాహార దీక్షాస్థలి ఏర్పాట్లను ఎమ్మెల్సీ కవితతోపాటు పార్టీ ఎంపీలు ఆదివారం పరిశీలించారు. టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కే తారకరామారావు సోమవారం ఉదయం ఢిల్లీకి బయల్దేరి వెళ్లనున్నారు. రాష్ట్ర మంత్రివర్గం మొత్తం ఢిల్లీ ఆందోళనలో పాల్గొనాలని నిర్ణయించినట్టు సమాచారం. వారితో పాటు జిల్లా అధ్యక్షులు, జెడ్పీటీసీ, ఎమ్పీటీసీ, కార్పొరేషన్ల చైర్మెన్లు సహా దాదాపు వెయ్యి మంది వరకు రాష్ట్రం నుంచి ఢిల్లీ ఆందోళనల్లో పాల్గొననున్నారు. 'ఒకే దేశం-ఒకే విధానం' పేరుతో ఇప్పటికే టీఆర్ఎస్ ఎంపీలు కేంద్రప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయాలని వివిధ రూపాల్లో పార్లమెంటులో ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఆరోగ్య కారణాల రీత్యా ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరుపై సందిగ్ధత ఏర్పడింది. నిరాహార దీక్షా స్థలి ఏర్పాట్లను ఆదివారం రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ ఎంపీలు కేఆర్ సురేష్‌రెడ్డి, బీబీ పాటిల్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా తదితరులు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు అక్కడ విలేకరులతో మాట్లాడుతూ రైతుల ఆదాయం రెట్టింపు ఎక్కడైందని ప్రధాని నరేంద్రమోడీని ప్రశ్నించారు. తమ ఆందోళనలకు వివిధ రాజకీయపార్టీలు మద్దతు తెలిపాయనీ, సోమవారం వారు సంఘీభావంగా దీక్షకు హాజరవుతారని తెలిపారు.