Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రులు
- ఇంద్రకరణ్ రెడ్డి, పువ్వాడ అజరు కుమార్ దంపతులు
నవతెలంగాణ-భద్రాచలం
భద్రాచల క్షేత్రంలో సీతారాముల కల్యాణ వేడుక కన్నుల పండువగా.. అంగరంగ వైభవంగా జరిగింది. సందర్శకుల జయజయ ధ్వానాలు... పండితుల మంత్రోచ్ఛారణలతో పట్టణంలోని మిథిలా కళ్యాణ మండపం మారుమ్రోగింది. ఆదివారం మధ్యాహ్నం 12.00గంటలకు అభిజిత్ ముహుర్తాన కల్యాణం కమనీయంగా సాగింది. సీతారాముల కల్యాణానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవాదాయ ధర్మాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజరు కుమార్ దంపతులు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. అలాగే, తిరుమల తిరుపతి దేవస్థానం తరపున వైవీ సుబ్బారెడ్డి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఆ పట్టు వస్త్రాలు రామయ్య, సీతమ్మకు ధరింపజేసి పెండ్లి కొడుకు, పెండ్లి కూతురుగా ముస్తాబుచేశారు. భక్తరామదాసు చేయించిన పచ్చల పతకం, చింతాకు పతకం, కలికితురాయి, రామమాడ వగైరా ఆభరణాలను వధూవరులకు అలంకరించడంతో మరింత అందాన్నిచ్చాయి. ఆదివారం మధ్యాహ్నం సరిగ్గా గం.12.00లకు జిలకర్ర, బెల్లం పెట్టారు. అనంరతం మాంగళ్యధారణ జరిగింది.
శ్రీరామనవమి సందర్భంగా ఆలయ తలుపులను ఆదివారం తెల్లవారు జామున సమయంలో తెరిచారు. స్వామి వారికి సుప్రభాత సేవ, తిరువారాధన, ఆరగింపు, శాత్తుముబై, మంగళశాసనం నిర్వహించారు. అనంతరం మూల వరులకు అభిషేకం నిర్వహించారు. 8.00గంటలకు స్వామివారి ధృవ మూర్తులకు కళ్యాణం జరిపారు. కళ్యాణమూర్తులను అలంకరించారు. అనంతరం ఆలయం నుంచి పూలపల్లకిలో సందర్శకుల కోలాటాలు, జయజయ ధ్వానాలు, మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా శిల్పకళ శోభితమైన మిథిలా స్టేడియంలోని కళ్యాణ మండపానికి తీసుకొచ్చి కల్యాణ తంతు ముగించారు.
రెండేండ్ల తర్వాత సీతారాముల కల్యాణానికి సందర్శకులను అనుమతించడంతో మిథిలా స్టేడియం కిక్కిరిసిపోయింది. ఆలయ వీధులు సందర్శకులతో కోలాహలంగా మారాయి. కోవిడ్ కారణంగా రెండేండ్ల పాటు శ్రీరామనవమి ఉత్పవాలను అంతరంగికంగానే నిర్వహించిన సంగతి తెలిసిందే.
రామయ్య కళ్యాణానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. మంత్రి సత్యవతి రాథోడ్, హైకోర్టు న్యాయమూర్తులు ఏ వెంకటేశ్వర రెడ్డి, యం. సుధీర్ కుమార్, కె విజయలక్ష్మి, ఖమ్మం సీనియర్ సివిల్ జడ్జి జి. శ్రీనివాస్, భద్రాచలం ప్రథమశ్రేణి న్యాయమూర్తి పి. సురేష్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల జడ్పీ చైర్మెన్లు లింగాల కమల్ రాజు, కోరం కనకయ్య, పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ కమిషనర్ ఎ.శరత్, ఎమ్మెల్సీ తాతా మధు, దేవాదాయ కమిషనర్ అనిల్ కుమార్, భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, ములుగు జిల్లాల కలెక్టర్లు అనుదీప్, గౌతమ్, యస్.కృష్ణ ఆదిత్య, జిల్లా ఎస్పీ సునీల్ దత్, ఐటీడీఏ పీవో గౌతమ్ పొట్రు, భద్రాచలం ఏఎస్పీ రోహిత్ రాజు, మాజీ జేడీ లక్ష్మీనారాయణ, జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, మాజీ మంత్రి పోరిక బలరాం నాయక్, దేవస్థానం ఈవో బి.శివాజీ, వివిధశాఖల అధికారులు పాల్గొన్నారు.