Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆటోడ్రైవర్లు, మెకానిక్‌లు మారుతున్న యువకులు
- ఎక్కువ మందికి ఆధారం వీధి వ్యాపారమే
- రుణాలకు దరఖాస్తు పెట్టుకున్నా సర్కారుకు పట్టదే
- 1.12 లక్షల మంది రుణం కోసం దరఖాస్తు
- ఇచ్చింది ఏడెనిమిది వేల మందికే
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
''సౌకా దస్..సౌకా దస్..''...'బీస్ రూపారు..బీస్ రూపారు...' 'పది..పది..' అంటూ కోటిలో ఏ వీధికెళ్లినా వినిపించే అరుపులివే. కానీ, కరోనా ఆ వీధి వ్యాపారుల పట్ల ప్రాణసంకటంగా మారింది. అందులోనూ ముస్లిం మైనార్టీల మీద ఎక్కువ ప్రభావం చూపింది. బతుకుదెరువు కోసం తోపుడు బండ్లు, పుట్‌పాత్‌లపై చిరువ్యాపారాలతో పాటు ఫంచర్లు వేసే వారిలో ముస్లింలే ఎక్కువ. మొత్తం వ్యాపారుల్లో 68 శాతం మంది వీరే. దీనికితోడు ఆటోలు నడపడటం, భవన నిర్మాణ కార్మికులు, వంటవారిగా పనిచేయడంలోనూ వారే ముందు వరుసలో ఉన్నారు. వీరంతా స్వయం ఉపాధి కోసం సర్కారుకు దరఖాస్తులు పెట్టుకున్నా పట్టించుకోవటం లేదు. ఉపాధి లేక.. అరకొరగా నడుస్తున్న వీధి వ్యాపారాలు...రోజంతా ఆటో నడిపినా మిగులుతున్న అత్తెసరు ఆదాయంతో ముస్లిం కుటుంబాలు దుర్భర బతుకులీడుస్తున్నారు.
రాష్ట్రంలో ముస్లిం జనాభా 46 లక్షలు (2011 జనాభా లెక్కల ప్రకారం). అందులో ఒక్క హైదరాబాద్ నగరంలోనే 26 లక్షల మంది ఉన్నారు. వారి జనాభాలో 63శాతం మంది దారిద్య్రరేఖకు దిగువన ఉన్నట్టు ప్రభుత్వ నివేదికలు చెబుతున్నాయి. అప్పులు చేసి కుటుంబాలను నెట్టుకొస్తున్న వారు 68శాతం మంది ఉన్నారు. చిన్న చిన్న వ్యాపారాలపై ఆధారపడి జీవించే వారు మొత్తం జనాభాలో 68శాతం మంది ఉన్నరంటే పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు. పాతబస్తీలో బహుదూర్‌పురా, ఖాజాపహడ్ దర్గా ఏరియాలో ప్రతి 100 మంది ముస్లింలలో 63 మంది ఆటో డ్రైవర్లుగా బతుకులీడుస్తున్నారు. అందులో ప్రతి వంద మందిలో పది మందికే సొంత ఆటోలున్నాయి. మిగతా వారంతా కిరాయి ఆటోలపై ఆధారపడి బతుకుతున్నారు. వీరు రోజంతా(15 గంటలదాకా) ఆటో నడిపినా గిరాకీని బట్టి రోజుకు రూ.1000 నుంచి 1200 మిగిలితే ఒట్టు. అందులో ప్యూయల్ ఖర్చులు రూ.500 పోనూ, ఆటో అద్దె రూ.300 వరకు కట్టగా రూ.300-400కి మించి మిగలవు. ఐదారు మంది కుటుంబ సభ్యులు ఆ డబ్బులతో వెళ్లదీయాలి. ఆటో డ్రైవర్లలో ఉన్నత చదువులు చదివినవారూ ఉన్నారు. ఫైనాన్స్‌లో వాహనాలు తీసుకుని నడుపుతూ జీవించేవారు కిస్తీలు కట్టలేదని వారి వాహనాలను ఫైనాన్షియర్లు తిరిగి తీసుకెళ్లి పోతున్నారు. ప్రయివేటు ఫైనాన్షియర్ల వద్ద అప్పులు తెచ్చి వ్యాపారం చేసే వారికి అసలు, వడ్డీ కలిసి అప్పు మోయలేని భారమై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
వీధి వ్యాపారం...భయం..భయం..
పూట గడవాలంటే..చిన్న చిన్న వ్యాపారాలే మాకు దిక్కుని పలువురు ముస్లిం యువకులు ఆవాజ్ సర్వేలో చెప్పారు. కరోనా కారణంగా ఉపాధి దెబ్బతిన్న వారిలో ముస్లిం మైనార్టీలే ఎక్కువ. నూటికి 98 శాతం మంది వీధి వ్యాపారాలతో పాటు( ఫుట్‌పాత్‌లపై పూలు, పండ్లు, కూరగాయలు, చెప్పులు, బట్టల అమ్మకం, పంచర్ కొట్లు, తదితర పనులు చేసుకోవడం) హోటళ్లు, బేకరీల్లో పనులు చేసుకుంటూ జీవనం గడిపేవారే. కరోనా దెబ్బతో వీరి వ్యాపారాలన్నీ దెబ్బతినిపోయాయి. పనులు దొరక్క అర్ధాకలితో బతుకుతున్నారు. వీధి వ్యాపారులు పొద్దస్తమానం వ్యాపారం చేసినా రూ.1000 నుంచి రూ.1500 బేరం జరగదు. అందులోనూ అన్నీ పోనూ రోజుకు రూ.300 నుంచి 500 మిగులుతాయి. ఒకవేళ పోలీసులు చలాన్ వేస్తే చచ్చినట్టు కట్టాల్సిందే. ఆరోజు ఉత్త చేతుల్తో ఇంటికెళ్లాల్సిందే. ఆ కుటుంబం పస్తులుండాల్సిందే. ఇదీ క్షేత్రస్థాయి పరిస్థితి. సొంతవ్యాపారం చేసుకువాలని ముందుకొచ్చే ముస్లిం యువతకు సర్కారు చేయూతనందించడంలో పూర్తి వైఫ్యలం చెందింది.
స్వయం ఉపాధికి ఆసరా ఏదీ?
మైనార్టీలకు రూ.50 వేల నుంచి రూ.10 లక్షల వరకు రుణాలిస్తామని 2015-16 ఆర్థిక సంవత్సరంలో సీఎం కేసీఆర్ ప్రకటించడంతో 82 వేల మంది ఆన్లైన్ ద్వారా, 30 వేల మంది ప్రత్యక్షంగా దరఖాస్తు చేసుకున్నారు. అంటే మొత్తం లక్షా 12 వేల మంది నిరుద్యోగులు, చిరు వ్యాపారులు, చిన్న చిన్న వృత్తులు చేసుకునేవాళ్లు వివిధ సర్టిఫికెట్లు, గుర్తింపు కార్డుల కోసం అప్పులు చేసి, వాటిని తీసుకుని మీసేవ కేంద్రాల ముందు రోజుల తరబడి బారులు తీరిన లైన్లో నిలబడి దరఖాస్తు చేసుకున్నారు. వారిలో ఎనిమిది వేల మందికి మాత్రమే రుణాలు అందజేశారు. అదీ రూ.50 వేల నుంచి లక్ష రూపాయల లోపు వారికే లోన్ శాంక్షన్ లేఖలు వచ్చాయి. అందులోనూ సగం మందికి బ్యాంకులు సెక్యూరిటీ లేదని లోన్లు ఇచ్చేందుకు నిరాకరించాయి. అంటే రాష్ట్రవ్యాప్తంగా సంవత్సరానికి సగటున 500 మందికి మాత్రమే రుణాలు ఇస్తే.. దరఖాస్తు చేసుకున్న వారందరికీ ఉపాది అవకాశాలు మెరుగవ్వాలంటే ఎన్నేండ్లు పడుతున్నదో సర్కారు పెద్దలే చెప్పాలి. మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్‌కు బడ్జెట్ కేటాయింపులు లేక అర్హులైన వారికి రుణాలందటం లేదన్న విమర్శలను ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. రుణాలు అందకపోవటంతో ప్రయివేటు ఫైనాన్షియర్ల ఉచ్చులో పడి ఆర్థికంగా చితికిపోతున్నారు. చిరు వ్యాపారాలు చేసుకోవడం, ఆటోలు అద్దెకు తీసుకుని నడపడం వంటివి చేస్తున్నారు.