Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహారాష్ట్ర అడిషనల్ డీజీ బ్రిజేష్ సింగ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పరిశోధనాత్మక జర్నలిస్టులకు సమాచారం గోప్యత, భద్రత అత్యంత కీలకమని మహారాష్ట్ర అడిషనల్ డీజీపీ బ్రిజేష్ సింగ్ అన్నారు. జర్నలిస్టులు ఉపయోగించే లాప్టాప్, కంప్యూటర్, మొబైల్, ఇతర సమాచార వ్యవస్థలు హ్యాకింగ్‌కు గురికాకుండా ఎప్పటికప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. డేటా భద్రత, గోప్యతపై సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ సైబర్ ఇంటెలిజెన్స్, డిజిటల్ ఫోరెన్సిస్ (సిఆర్‌సిఐడిఎఫ్) ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్‌లో జర్నలిస్టులకు అవగహన కార్యక్రమం నిర్వహించారు. డిజిటల్ జర్నలిజంలో డేటా విశ్లేషణ- ధ్రువీకరణ పద్దతులు, ఊహాజనిత వార్తలపై అప్రమత్తత, డేటా భద్రతపై బ్రిజేష్ సింగ్ వివరించారు. డిజిటల్ మీడియా వేగంగా విస్తరిస్తుందనీ, అదే సమయంలో విపరీత ధోరణులపై పూర్తి అవగహనతో జర్నలిస్టులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సిఆర్‌సిఐడిఎఫ్ డైరెక్టర్ ప్రసాద్ పాడిబండ్ల మాట్లాడుతూ..డేటా భద్రత విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఉదాహరణలతో వివరించారు. కార్యక్రమంలో కేంద్రీయ నేర పరిశోధన శిక్షణాలయం (సీడీటీఐ) హైదరాబాద్ డైరెక్టర్ క్రాంతి కుమార్, సైబర్ క్రైమ్ పరిశోధకులు మనీష్ యాదవ్, సైబర్ సెక్యూరిటీ నిపుణులు, సీనియర్ జర్నలిస్టులు పాల్గొన్నారు.