Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 14న హైదరాబాద్‌లో మహాపాదయాత్ర
- ఆప్ నేత సోమ్‌నాథ్ భార్తి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సామాన్యుడి చేతికి అధికారం అందించడమే ఆమ్ ఆద్మీ పార్టీ లక్ష్యమని ఆ పార్టీ దక్షిణ భారత ఇంచార్జీ సోమ్‌నాథ్ భార్తి అన్నారు. ఢిల్లీలో కేజ్రీవాల్ అనుసరిస్తున్న విధానాల పట్ల దేశప్రజలు ఆకర్షితులవుతున్నారని చెప్పారు. హైదరాబాద్‌కు వచ్చిన ఆయన లిబర్టీలోని ఆ పార్టీ కార్యాలయంలో నేతలు, వాలంటీర్లతో సమావేశమయ్యారు. పలు రంగాలకు చెందిన వారు ఆమ్ఆద్మీ పార్టీలో చేరారు. ఈనెల 14న అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్‌లో చేపట్టనున్న మహాపాదయాత్ర పోస్టర్‌ను సోమ్‌నాథ్ భార్తి ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఢిల్లీలో ప్రజా సంక్షేమ పాలన అందించడం వల్లే పంజాబ్‌లో ఆప్ విజయానికి కారణమని చెప్పారు. పంజాబ్‌లో ఆప్ ప్రభుత్వం ఏర్పడగానే అవినీతి నిర్మూలనకు టోల్‌ఫ్రీ నెంబర్ ఇవ్వడంపై ప్రజల్లో మంచి స్పందన వస్తోందన్నారు. ఢిల్లీలో మూడు లక్షల మంది విద్యార్థులు ప్రయివేటు పాఠశాలల నుంచి సర్కారు బడుల్లో చేరడం విద్యాప్రమాణాలు మెరుగయ్యాయనీ, నాణ్యత పెరిగిందనడానికి నిదర్శనమని వివరించారు. తెలంగాణ ప్రజలు కేజ్రీవాల్ మోడల్ అభివృద్ధిని కోరుకుంటున్నారని అన్నారు. ఈనెల 14న గ్రేటర్ హైదరాబాద్‌లో 25 ప్రాంతాల్లో మహాపాదయాత్ర కొనసాగుతుందని ఆమ్ఆద్మీ పార్టీ సెర్చ్ కమిటీ చైర్పర్సన్ ఇందిరాశోభన్ చెప్పారు. ట్యాంక్‌బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహం నుంచి ప్రారంభమై ముషీరాబాద్, సికింద్రాబాద్ మీదుగా వెళ్తుందన్నారు.