Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నట్టేట మునిగిన సాగుదారులు
- వాణిజ్య పంటల దిగుబడి తగ్గిన వైనం
- కూరగాయ పంటలకు తగ్గిన ధర
- రైతులను ఆదుకోవాలని రైతు సంఘాలు డిమాండ్
నవతెలంగాణ- రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
ప్రత్యామ్నాయ పంట సాగు భలే లాభసాటిగా ఉంటుందని ప్రభుత్వం ఊదరగొట్టింది. ఆ మాటలు నమ్మి రైతులు ప్రత్యామ్నాయ పంటలే సాగు చేశారు. కానీ.. లాభాలు వస్తాయని ఆశిస్తే నిరాశే మిగిలింది. లాభాల మాట దేవుడెరుగు పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. వాణిజ్య పంటల దిగుబడి తగ్గడం, కూరగాయ పంటలకు ధర తగ్గడటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
ఉమ్మడి రంగారెడ్డి జిలాలో గతేడాది యాసంగిలో 2 లక్షల 23 వేల ఎకరాల్లో వరి సాగు చేశారు. ఈ ఏడాది యాసంగి వడ్లు కొనుగోలు కేంద్రాలు ఉండవు.. వరి వస్తే ఉరే అన్న సీఎం కేసీఆర్ ప్రకటనతో ప్రస్తుతం వరి సాగు 35 శాతానికి పడిపోయింది. ఎక్కువ మంది ప్రభుత్వ సలహా మేరకు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేశారు. కానీ.. ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో సుమారు 70 వేల ఎకరాల్లో కూరగాయలు, వాణిజ్య పంటలు మినుములు, కందులు, వేరుశనగ సాగు చేశారు. వాణిజ్య పంటలకు మార్కెట్లో మంచి ధర ఉన్నప్పటికీ పంట దిగుబడి ఆశించిన స్థాయిలో లేకపోవడంతో పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకా కూరగాయ పంటలు సాగు చేసిన రైతుల పరిస్థితి దీనంగా ఉంది. పంట చేతికి వచ్చే సమయానికి టమాట ధర అమాతం తగ్గింది. గతేడాది ఒక బాక్స్ రూ.300 నుంచి 500 వరకు పలికితే.. ఈ ఏడాది జనవరి నెలలో కొంత మేరకు మంచి ధర పలికినప్పటికీ మార్చి నుంచి 20 కేజీల టమాట బాక్స్ రూ.50 నుంచి రూ.60 మాత్రమే పలకడంతో రైతులు లబోదిబోమంటున్నారు.
యాచారం మండల పరిధిలో మొండిగౌరల్లిలో గ్రామానికి చెందిన రైతు ధర్మనాయక్ రెండెకరాలు కౌలుకు తీసుకుని వరికి బదులు పంట సాగు చేశాడు. పంట దిగుబడి 400 బాక్స్‌లు వచ్చింది. మార్కెట్లో ధర లేకపోవడంతో బాక్స్ రూ.60కు విక్రయించారు. మొత్తం రూ.48 వేలు వచ్చాయి. పంట సాగు పెట్టుబడిలో.. దుక్కికి రూ.15 వేలు, విత్తనాలు రూ.10వేలు, ఎరువు మందులు రూ.6 వేలు, మొక్కలు నాటిన కూలీలకు రూ. 5,500, రసాయన ఎరువులు రూ.12 వేలు, పంట కోసిన కూలీల ఖర్చు రూ.20 వేలు.. మొత్తం రూ.68 వేల 500 పెట్టుబడి అయింది. రైతుకు వచ్చింది మాత్రం రూ.48వేలు మాత్రమే. రూ.20,500 రైతు నష్టపోయాడు. జిల్లాలో ప్రత్యామ్నాయ పంటలు వేసిన రైతుల పరిస్థితి మొత్తం ఇలాగే ఉంది. ప్రభుత్వ మాటలు నమ్మి అప్పుల పాలు అయ్యామని, ప్రభుత్వమే తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
కౌలు డబ్బులు వచ్చే పరిస్థితి లేదు
రైతు కైరా నాయక్
రెండెకరాలు కౌలుకు తీసుకుని టమాట సాగుచేస్తే పంట చేతికొచ్చే సమయానికి మార్కెట్లో ధర పడిపోయింది. రెండెకరాలకు కలిపి రూ.70వేలు పెట్టుబడి అయింది. పండిన పంటను కొనుగోలు చేసేవారు లేక.. పొలంలోనే వదిలేశాం. ప్రత్యామ్నాయ పంటలతో లాభం వస్తుందని ఆశపడితే.. అప్పు మిగిలింది.
ప్రభుత్వ మాటలు నమ్మి మినిములు వేశా.. రైతు రాంరెడ్డి- కొహెడ
వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేస్తే లాభసాటిగా ఉంటుందని ప్రభుత్వం చెప్పడంతో మినుములు సాగు చేశాను. ఎకరాకు రూ.20 వేల ఖర్చు అయింది. పంట దిగుబడి రాలేదు. కనీసం ఎకరానికి 4 క్వింటాల పంట కూడా రాలేదు. మూడెకరాలు సాగు చేస్తే 11 క్వింటాలకు రూ. 65 వేలు వచ్చినవి. ఆరుగాలం కష్టపడితే రూ. 5వేలు మిగిలినవి.