Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కడలికెరటాలను తలపించిన రెడ్ మార్చ్
- సాగరఘోషను మించిన నినాదాలహౌరు
- కిక్కిరిసిన సభాప్రాంగణం
ఏకేజీనగర్ నుంచి నవతెలంగాణ ప్రతినిధి
సముద్రతీర పట్టణం కన్నూరులో ఎర్రమహాసముద్రం ఉప్పొంగింది. విహంగవీక్షణం చేసేవారికి ఒకేసారి రెండు సముద్రాల అరుదైన దృశ్య ం కనిపించి ఉక్కిరిబిక్కిరి చేసింది.ఒకటి కన్నూరుకు కూతవేటు దూరంలో ఉన్న అరేబియా సముద్రం కాగా, మరోకటి సిపిఎం అఖిలభారత 23వ మహాసభల ముగింపు సందర్భంగా నయనార్ అకాడమీ నుండి ఆదివారం కదిలిన జన సముద్రం. నిజానికి భారీ ఎత్తున తరలివస్తున్న ప్రజానీకాన్ని దృష్టిలో ఉంచుకుని ముందుగా తలపెట్టిన ప్రదర్శనను రద్దు చేస్తున్నట్లు సీపీఐ(ఎం) ప్రకటించింది. కేవలం రెడ్‌షర్ట్ వాలంటీర్ల మార్చ్ ఉన్నట్లు తెలిపింది. ఒక్క కన్నూరు జిల్లాలోనే 25 లక్షల మంది రెడ్‌షర్ట్ వాలంటీర్లు ఉంటే, వారి సంఖ్యను గణనీయంగా తగ్గించింది.ఎంపికచేసిన 2వేల మంది రెడ్‌షర్ట్ వాలంటీర్లే మార్చ్ చేస్తారని ప్రకటించింది. అయితే,ఆదివారం నాటి పరిస్థితి వేరు! శనివారం ఉదయానికే వేలాదిమంది సీపీఐ(ఎం) కార్యకర్త లు,అభిమానులు కన్నూరుకు చేరుకున్నారు. కేరళలోని వివిధ ప్రాంతాలతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్నాటకల నుంచి పెద్దసంఖ్యలో తరలివచ్చారు. స్థానిక ప్రజలు భారీగా తరలివచ్చి..ప్రదర్శనలో భాగస్వాముల య్యారు. ప్రదర్శన ప్రారంభం కావడానికి కొన్ని గంటల ముందు నుంచే వీధుల్లో బారులు తీరారు. దీంతో మధ్యాహ్నాం ఒంటి గంట నుంచే రోడ్లు ప్రజలతో కిక్కిరిసిపోయాయి. నయనార్ అకాడమీ నుంచి బహిరంగ సభ జరిగే ఎకెజి నగ ర్ వరకు ఎక్కడ చూసినా జనమే కనిపించారు.
క్రమశిక్షణతో కదిలి...
ప్రదర్శన ముందుభాగాన నడిచిన రెడ్‌షర్ట్ వాలంటీర్లు అత్యంత క్రమశిక్షణతో కదిలారు. లయబద్దంగా వీరు చేసిన మార్చ్ కడలికెరటాలను తలపించింది. రెడ్‌షర్ట్ వాలంటీర్లకు తోడు మార్చ్‌లో ఎగిసిన ఎర్రజెండాలు, పట్టణమంతా అలంకరించిన ఎర్రతోరణాలతో సముద్రమే కదిలినట్టు కనిపించింది. మార్చ్‌ను ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన సీతారాం ఏచూరి ప్రారంభించారు. ప్రదర్శన ముందుభాగాన రెడ్‌షర్ట్ వాలంటీర్లు బ్యాండు వాయిస్తూ కవాతు చేశారు. వారి వెనుక ఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరితో పాటు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ టాప్లేని వాహనంలో ర్యాలీకి తరలివచ్చిన ప్రజానీకానికి అభివాదం చేస్తూ వచ్చారు. వారి వెనుక ప్రకాశ్ కరత్, బృందాకరత్, సుభాషిణి ఆలీ ఆ వెనుక ఇతర పొలిట్‌బ్యూరో సభ్యులు టాప్ లేని వాహనాల్లో ముందుకుసాగారు. వారి వెనుక కేంద్ర కమిటీ సభ్యులు, ఆ తరువాత ప్రతినిధులు ర్యాలీలో ఉన్నారు. వారి వెనుక కదలిన ప్రజానీకం చేసిన నినాదాల హౌరు సముద్రపు ఘోషను మించింది. పేద ప్రజల కోసం నిర్విరామ పోరాటాలు చేస్తున్న నేతలను చూసిన ప్రజానీకం అపూర్వంగా స్పందించింది.పూలు చల్లుతూ, రెడ్ సెల్యూట్ నినాదాలు చేస్తూ అడుగడుగునా నాయకులకు నీరాజనం పలికారు.సీపీఐ(ఎం) వర్ధిలాల్లి, విప్లవం వర్థిలాల్లి అన్న నినాదాలు మారుమ్రోగాయి. మార్చ్ సాగిన ప్రాంతమంతా ఎక్కడికక్కడ జనం కలిశారు. ప్రదర్శన నయనార్ అకాడమీ నుండి ఫోర్ట్‌రోడ్, రైల్వేస్టేషన్ రోడ్డు, ఓల్డ్ బస్టాండ్ ల మీదుగా బహిరంగ సభా ప్రాంగణంకు చేరింది.
కిక్కిరిసిన సభా ప్రాంగణం
మార్చ్ ఎకెజి నగర్ (జవహర్స్టేడియం చేరుకునేటప్పటికే సభా ప్రాంగణం కిక్కిరిసి పోయింది. రెండు రోజుల ముందు నుండే కుటుంబాలతో తరలివచ్చిన వేలాదిమంది మధ్యాహ్నానికే ప్రాంగణలోకి చేరుకున్నారు.
దీంతో ప్రదర్శనలో వచ్చిన పలువురు వేదికబయటే ఉండాల్సివచ్చింది. సభకు ముందు నిర్వహించిన కేరళ సాంప్రదాయ సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.