Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 24 గంటల్లో ధాన్యం కొనుగోలుపై నిర్ణయం ప్రకటించండి
- కేంద్రానికి సీఎం కేసీఆర్ అల్టిమేటం
- జైలుకు పంపుతారా.. దమ్ముంటే రండి
- భూకంపం సృష్టిస్తాం
- కేంద్రమంత్రి పీయూష్‌గోయల్‌ను పరిగెత్తిస్తాం
- ఢిల్లీ దీక్షలో సీఎం కేసీఆర్ తీవ్ర వ్యాఖ్యలు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్రంలో పండిన యాసంగి ధాన్యాన్ని కొనుగోలు చేస్తారో లేదో 24 గంటల్లో తేల్చి చెప్పాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు కేంద్ర ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు. కేంద్రంపై పోరాటానికి తెలంగాణ ప్రజలు, రైతులు సిద్ధంగా ఉన్నారనీ, తాడోపేడో తేల్చుకుంటామని హెచ్చరించారు. దేశంలోని రైతులు బిచ్చగాళ్లు కాదనీ, దేశవ్యాప్తంగా ధాన్యం కొనుగోలుపై ఒకే విధానం లేకపోతే రైతులు రోడ్లపైకి వస్తారని చెప్పారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్ వేదికగా టీఆర్ఎస్ పార్టీ చేపట్టిన రైతు నిరసన దీక్షలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రం నుంచి భారీ సంఖ్యలో టీఆర్ఎస్ నాయకులు, రైతులు, జెడ్పీటీసీ, ఎమ్పీటీసీలు, కార్పొరేషన్ల చైర్మెన్లు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ ప్రధాని మోడీ, కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌కు రెండు చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నాననీ, తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కొనాలని విజ్ఞప్తి చేశారు. సమస్యల గురించి ప్రస్తావిస్తే సీబీఐ, ఈడీల పేరు చెప్పి ముఖ్యమంత్రిని జైలుకు పంపుతామని బెదిరిస్తున్నారు...దమ్ముంటే రండి అని సవాల్ విసిరారు. దేశంలో భూకంపం సృష్టిస్తామంటూ కేంద్రప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేంద్రం కార్పొరేట్లకు కొమ్ము కాస్తూ.. రైతుల జీవితాలతో ఆటలాడుకుంటోందని విమర్శించారు. బీజేపీలో అందరూ సత్యహరిశ్చంద్రులే ఉన్నారా... వాళ్ల దగ్గరకు ఈడీ, సీబీఐ ఎందుకు వెళ్లదని ప్రశ్నించారు. ప్రతి రాష్ట్రంలో ఇతర పార్టీల నాయకులను ఇలాగే బెదిరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గోయల్ పరుగులు తీయాల్సిందే...
''హిట్లర్, నెపోలియన్ వంటి అహంకారులు కాలగర్భంలో కలిసిపోయారు.. కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌కు ఎందుకు ఇంత అహంకారం. దేశంలో భూకంపం సృష్టించి, ఆయన్ని పరుగులు పెట్టిస్తాం'' అని సీఎం కేసీఆర్ అన్నారు. ''కేంద్రమంత్రి పీయూష్ గోయల్ తెలంగాణ అన్నదాతలు నూకలు తినాలంటూ ఉల్టాపల్టా మాట్లాడుతున్నారు. ఆయనకు రైతులపై ఏమైనా అవగాహన ఉందా... అంత సంస్కారహీనంగా ఎలా మాట్లాడతారు. మా రైతులను, మంత్రులను అవహేళన చేస్తే చూస్తూ ఊరుకోం'' అని హెచ్చరించారు.
రాష్ట్ర బీజేపీ నేతలకు సిగ్గుండాలి..
కేంద్రం పంట మార్పిడి చేయాలని సూచించిందని తాను రైతులకు చెప్పానన్నారు. కానీ కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజరు ఉద్దేశపూర్వకంగా రైతులు ధాన్యం పండిస్తే, కేంద్రంతో కొనిపిస్తామంటూ బీరాలు పలికారని చెప్పారు. కేంద్రం ధాన్యం కొనాలని తాము ఢిల్లీలో దీక్షలు చేస్తుంటే, సిగ్గులేకుండా ఇప్పుడు హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద వాళ్లు పోటీగా ధర్నాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఏ ఉద్దేశంతో బీజేపీ నేతలు ధర్నా చేస్తున్నారని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ హిందీలో చేసిన ప్రసంగం ఆకట్టుకుంది.
కేంద్రానికే సిగ్గుచేటు : రాకేశ్ తికాయత్
దేశంలో రైతులు మరణిస్తూనే ఉండాలా...అని జాతీయ రైతు ఉద్యమ నాయకుడు రాకేశ్ తికాయత్ కేంద్రప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తెలంగాణ నుంచి ఢిల్లీ వచ్చి దీక్షలు చేస్తున్నారంటే అది కేంద్ర ప్రభుత్వానికి సిగ్గుచేటు అని విమర్శించారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్ వేదికగా టీఆర్ఎస్ పార్టీ చేపట్టిన నిరసన దీక్షకు ఆయన సంఘీభావం తెలుపుతూ దీక్షలో కూర్చున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో రైతులు తమ హక్కుల కోసం పోరాడుతూనే ఉంటారని స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోలుకు దేశ వ్యాప్తంగా ఒకే విధానం ఉండాలనీ, లేకుంటే రైతులు రోడ్లపైకి రావాల్సి వస్తుందని హెచ్చరించారు. సాగుచట్టాల రద్దు కోసం ఢిల్లీలో 13 నెలల పాటు ఉద్యమించామని చెప్పారు. కేంద్రం ఏడాదికి మూడు విడతలుగా రైతులకు రూ. 6 వేలు ఇస్తూ, వారిని ఏదో ఉద్ధరిస్తున్నట్టు ప్రచారం చేసుకుంటున్నదని విమర్శించారు.
జ్యోతిబా పూలేకు నివాళులు
రైతుల పక్షాన ప్రజాప్రతినిధుల నిరసన దీక్ష పేరుతో ఢిల్లీలోని తెలంగాణ భవన్ వేదికగా టీఆర్ఎస్ పార్టీ చేపట్టింది. దీక్షలు ప్రారంభానికి ముందు సీఎం కేసీఆర్, జాతీయ రైతు నేత రాకేశ్ తికాయత్ సభా వేదిక వద్ద ఏర్పాటు చేసిన అమరవీరుల స్థూపానికి, మహాత్మా జ్యోతిబా ఫూలే, అంబేద్కర్ చిత్రపటాలకు నివాళులర్పించారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పుష్పాలు సమర్పించారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి కార్యక్రమానికి అధ్యక్షత వహించారు.
వెరీ స్పెషల్ ఎమ్మెల్యే సండ్ర
ఢిల్లీ దీక్షలో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. నలుపు రంగు ప్యాంటు, షర్టు ధరించిన ఆయన కావడిలో ముందువైపు ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో, వెనుక వరి కంకులు వేసుకొని, ఆకుపచ్చ రంగు తలపాగ ధరించి వచ్చారు.