Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అప్పుడు వానలు... ఇప్పుడు తెగుళ్లు, ఎండలు
- ఈ ఏడాదీ అంతంతే...
- రాష్ట్రవ్యాప్తంగా నాలుగైదు లక్షల టన్నుల ఉత్పత్తి తగ్గే అవకాశం
- ధర బాగానే ఉన్నా దిగుబడులు లేక రైతుకు నష్టం
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ఈ ఏడాది మామిడి రైతు డీలా చెందాడు. అధిక వర్షాలు, నల్లతామర, తేనె మంచు పురుగుల ప్రభావంతో పూత సకాలంలో రాలేదు. పిందెలూ సరిగా పడలేదు. వచ్చిన కొద్దిపాటి పూత కూడా చాలా తోటల్లో నిలవలేదు. ప్రస్తుతం మండిపోతున్న ఎండలతో పిందెలు, కాయలు రాలిపోతున్నాయని రైతులు వాపోతున్నారు. ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే రాష్ట్రవ్యాప్తంగా నాలుగైదు లక్షల టన్నుల దిగుబడి తగ్గే అవకాశం ఉందని ఉద్యానశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది మామిడికి గిట్టుబాటు ధర లభిస్తున్నా దిగుబడి ఆశాజనకంగా లేని దృష్ట్యా కాయలను మాగబెట్టి స్థానిక మార్కెట్లోనే విక్రయించుకుంటే మేలని సూచిస్తోంది.ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 2020-21లో 40,680 ఎకరాల మామిడి తోటలుండగా 2021-22లో 44,864 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ఏడాది కాలంలో నాలుగువేల విస్తీర్ణం పెరిగింది. రాష్ట్రవ్యాప్తంగా 3.17 లక్షల ఎకరాలకు పైగా మామిడి సాగవుతోంది. గతేడాది 3,06,765 ఎకరాల్లో పంట సాగు చేయగా 11,48,996 మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చింది. ఈ ఏడాది 11 వేల ఎకరాల పంట విస్తీర్ణం పెరిగినా ప్రతికూల వాతావరణ పరిస్థితుల మూలంగా దీనిలో సగం దిగుబడి వచ్చే అవకాశం లేదని ఉద్యానశాఖ అంచనా.
అధిక వర్షాలు.. నల్ల తామరతో ముప్పు
ఈ ఏడాది అధిక వర్షాలు మామిడిపై ప్రభావం చూపాయి. సాధారణంగా జూన్ నుంచి సెప్టెంబర్ వరకు వర్షాలు కురుస్తుంటాయి. కానీ ఈ ఏడాది డిసెంబర్ వరకూ వర్షాలు పడుతూనే ఉన్నాయి. దీనివల్ల నేలలో తేమశాతం పెరిగింది. తేమ ఆరక, చెట్టుకు పూత రాకుండా కొమ్మలు చిగురించాయి. డిసెంబర్, జనవరిలో రావాల్సిన పూత ఆలస్యమైంది. ఈలోగా ఉష్ణోగ్రతలు పెరిగాయి. డిసెంబర్ నుంచి మార్చి వరకూ నాలుగు దఫాలుగా పూత పూసింది. ఒక చెట్టుకు కొన్ని చోట్ల పూత, కొన్ని చోట్ల పిందెలు, కొన్ని చోట్ల కాయలు కాశాయి. అధిక వర్షాలతో యజమాన్య చర్యలు ఆలస్యమయ్యాయి. దున్నడం, ఎండిన కొమ్మలను తొలగించడం తదితర పనులకు ఆటంకం ఏర్పడింది. ఈలోగా నల్లతామర పురుగులు కాండం, కొమ్మల బెరడులోకి చేరి పూత, పిందె సమయంలో పంటను నాశనం చేశాయి. రసం పీల్చడంతో పూత రాలిపోయింది. కొద్దిరోజులుగా 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్న దృష్ట్యా పిందెలు, కాయలు రాలిపోతున్నాయి. దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా 11లక్షలకు పైగా రావాల్సిన మామిడి ఉత్పత్తికి గాను ఐదారు టన్నుల దిగుబడి మాత్రమే వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
గిట్టుబాటు ధర లభిస్తున్నా దిగుబడి లేక డీలా
ఈ ఏడాది మామిడికి గిట్టుబాటు ధర లభిస్తున్నా దిగుబడి లేక రైతులు దిగాలు చెందుతున్నారు. గతంలో ఎకరానికి నాలుగు టన్నుల దిగుబడి వచ్చేది ఈ ఏడాది ఒక టన్ను మాత్రమే వచ్చే అవకాశం ఉందంటున్నారు. తెలంగాణలో మామిడికి ప్రసిద్ధిగాంచిన కొల్లాపూర్లో సైతం దిగుబడి 60 శాతం తగ్గే అవకాశం ఉందని ఉద్యాన అధికారులు తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు జగిత్యాల, మంచిర్యాల, నాగర్కర్నూల్, సంగారెడ్డి, మహబూబాబాద్, వరంగల్, సిద్దిపేట, నల్లగొండ, మహబూబ్నగర్, జోగులాంబ గద్వాల, యాదాద్రి భువనగిరి జిల్లాలో మామిడి తోటలు ఎక్కువగా సాగవుతున్నాయి. పరిస్థితులు అనుకూలిస్తే ఎకరానికి నాలుగు టన్నుల చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 11 లక్షల టన్నులకు పైగా దిగుబడి వచ్చేది. కానీ ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే దీనిలో 40 శాతం దిగుబడి మాత్రమే వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం టన్ను ధర రూ.80వేల నుంచి రూ.లక్ష వరకూ పలుకుతోంది. హైదరాబాద్, ముంబయి, విజయవాడ తదితర ప్రాంతాల నుంచి వ్యాపారులు నేరుగా తోటల వద్దకే వస్తున్నారు. కేజీ రూ.100 నుంచి రూ.120 వరకూ చెల్లిస్తున్నారు. అంటే దాదాపుగా టన్ను రూ.లక్ష పైచిలుకు పలుకుతుంది.
పెట్టుబడి కూడా వచ్చేటట్టు లేదు.. - కమల్షా, కల్లూరు
ఈ ఏడాది అధికవర్షాలు, నల్లతామర పురుగు ప్రభావంతో మామిడి దిగుబడి బాగా తగ్గేలా ఉంది. నేను తోట వయస్సు, చెట్ల సంఖ్యను బట్టి ఎకరానికి రూ.40వేల నుంచి రూ.50వేల వరకూ పెట్టుబడి పెట్టి 70 ఎకరాలు కౌలుకు తీసుకున్నాను. సస్యరక్షణ చర్యల కోసం ఎకరానికి మరో 30వేలకు పైగా ఖర్చు పెట్టాను. కానీ అధిక వర్షాలు, తామర నల్లి ప్రభావంతో పూత, పిందె నిలువలేదు. కాయలను చూస్తే పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితిలేదు.
ఉభయరాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి
- జినుగు మరియన్న, జిల్లా ఉద్యానశాఖ అధికారి
ఈ ఏడాది ఉభయరాష్ట్రాల్లోని మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రతికూల వాతావరణ పరిస్థితులతో సకాలంలో పూత, కాత పడకపోవడం, పడిన చోట నిలవకపోవడం, అనేక తోటల్లో పంట తక్కువగా పండిన పరిస్థితి. దాంతో కాయలు అమ్ముకోవడం కంటే వాటిని మాగేసి పండ్లు పండిన తర్వాత స్థానిక మార్కెట్లో అమ్ముకోవడం వల్ల కొంత అధిక ధర లభించే అవకాశం ఉందని రైతులకు సూచిస్తున్నాం.