Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 6.04 లక్షల దరఖాస్తులు
- పేపర్-1కు 3,38,128, పేపర్-2కు 2,65,907
- దరఖాస్తు చేసేందుకు నేడే ఆఖరు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కు అభ్యర్థుల నుంచి భారీ స్పందన వస్తున్నది. ఇప్పటి వరకు 6,04,035 దరఖాస్తులు వచ్చాయి. ఆన్లైన్లో దరఖాస్తు చేసేందుకు మంగళవారం వరకే అవకాశమున్నది. ఫీజు చెల్లింపు గడువు సోమవారంతో ఇప్పటికే ముగిసింది. దరఖాస్తుల సంఖ్య మరిన్ని పెరగనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర విద్యా, పరిశోధన శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) డైరెక్టర్, టెట్ కన్వీనర్ ఎం రాధారెడ్డి సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. టెట్ పేపర్-1కు 3,38,128, పేపర్-2కు 2,65,907 కలిపి మొత్తం 6,04,035 దరఖాస్తులు వచ్చాయని వివరించారు. పేపర్-1కు 99,241 మంది, పేపర్-2కు 2,70,020 మంది, పేపర్-1,2కు 2,38,887 మంది కలిపి మొత్తం 3,65,148 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారని తెలిపారు. జూన్ 12న ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్-2 పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం https://tstet.cgg.gov.in వెబ్సైట్ను సంప్రదించాలని సూచించారు. 2017 జులైలో టెట్ పేపర్-1కు 98,848 మంది, పేపర్-2కు 2,30,932 మంది కలిపి 3,29,780 మంది పరీక్ష రాశారు. వారిలో పేపర్-1లో 56,708 మంది, పేపర్-2లో 44,965 మంది కలిపి మొత్తం 1,01,673 మంది ఉత్తీర్ణులయ్యారు.
దరఖాస్తు గడువు పొడిగించాలి : రామ్మోహన్రెడ్డి
మంగళవారంతో ముగియనున్న టెట్ దరఖాస్తు గడువును పొడిగించాలని తెలంగాణ డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల సంఘం అధ్యక్షుడు రావుల రామ్మోహన్రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. దరఖాస్తుల్లో తప్పులుంటే సవరించే అవకాశమివ్వాలని కోరారు. జగిత్యాల, జనగామ, కరీంనగర్, నల్లగొండ, రాజన్న సిరిసిల్ల, సూర్యాపేట ఈ ఆరు జిల్లాల్లోనే పరీక్షలు కేంద్రాలు మిగిలాయని తెలిపారు. మిగిలిన 27 జిల్లాల్లో పరీక్షా కేంద్రాల్లేవంటూ బ్లాక్ చేశారని విమర్శించారు. అభ్యర్థులకు అన్ని జిల్లాల్లోనూ పరీక్ష రాసేందుకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు.