Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఉపాధ్యాయుల పరస్పర అంగీకారంతో అంతర్ జిల్లాల బదిలీలకు సంబంధించిన జీవోనెంబర్ 402పై హైకోర్టు స్టే విధించింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ విజరు సాయి రెడ్డి సోమవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. పరస్పర అంగీకారంతో బదిలీలకు సంబంధించిన జీవో 21కి సవరణలు చేస్తూ ప్రభుత్వం మరో జీవో 402ను జారీ చేయడాన్ని పలువురు ఉపాధ్యాయులు హైకోర్టులో సవాల్ చేశారు. రాష్ట్రపతి ఉత్తర్వులకు వ్యతిరేకంగా జీవో ఉందని వారు చెప్పారు. అనంతరం జీవో 402 అమలును నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. విచారణను వాయిదా వేసింది.
పరిశ్రమల తరలింపుపై నివేదిక ఇవ్వండి
హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లోని కాలుష్య కారక పరిశ్రమలను తరలించేందుకు 2013లో జారీచేసిన జీవో 20 అమలు కావడం లేదని దాఖలైన కేసులో హైకోర్టు స్పందించింది. ఔటర్ రింగ్ రోడ్డు అవతలివైపునకు ఎన్ని కాలుష్య కారక పరిశ్రమలను తరలించారో చెప్పాలని పొల్యూషన్ కంట్రోల్ బోర్డును ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్రశర్మ, జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి ధర్మాసనం సోమవారం ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ జీవో అమలు కావడం లేదని పర్యావరణ సామాజిక కార్యకర్త పి లక్ష్మి నరసింహరావు దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు మరోసారి విచారణ చేపట్టింది. తదుపరి విచారణను జులై 11వ తేదీకి వాయిదా వేసింది.
అన్ని కేసుల్లోనూ అరెస్ట్ చేయకూడదా?
రియల్ ఎస్టేట్ మోసాలకు పాల్పడ్డారన్న అభియోగాల కేసులో సంధ్యా కన్వెన్షన్ ఎండీ ఎస్ శ్రీధర్‌బాబు, ఆయన భార్య సంధ్యలకు అనుకూలంగా సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులు సవాల్ చేసిన కేసును హైకోర్టు డివిజన్ బెంచ్ సోమవారం విచారణ చేపట్టింది. గచ్చిబౌలి, మాదాపూర్, రాయదుర్గం, ఇతర ప్రాంతాల్లోని పోలీస్ స్టేషన్లలో నమోదైన అన్ని కేసులనూ అరెస్టు చేయరాదని సింగిల్ జడ్జి ఉత్తర్వులు జారీ చేయడాన్ని ధర్మాసనం తప్పు పట్టింది. ఆ ఉత్తర్వులను సవాల్ చేస్తూ మణికొండకు చెందిన ఖుషిచందు అప్పీల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిని సోమవారం చీఫ్ జస్టిస్ సతీష్ చంద్రశర్మ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ విచారణ చేపట్టింది. శ్రీధర్‌బాబు, సంధ్యలపై ఎన్ని కేసులు నమోదయ్యాయి, ఎన్ని కేసుల్లో అరెస్టయ్యారో పూర్తి వివరాలు సమర్పించాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ మంగళవారం చేపడతామని ప్రకటించింది.